పెరుగుతున్న పిచ్చికుక్కల బెడద!

Dog Attack

పట్టపగలు జనారణ్యంలో కుక్కల గుంపు దాడిలో యాభై మందికిపైగా గాయ పడి ఆస్పత్రిపాలు కావడం చర్చనీయాం శంగా మారింది. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో నిర్జన ప్రదేశంలోనో, అడవ్ఞల్లోనో కాదు. తెలంగాణ రాష్ట్రరాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డులో అమీర్‌పేట్‌ ప్రాంతంలో నిత్యం జనరద్దీ ఉండే ప్రదేశంలో మంగళ వారం కుక్కలు రెచ్చిపోయాయి. ఇందులో యాభై మందికిపైగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతు న్నారు. ఒక్క అమీర్‌పేటే కాదు నగరంలోని అనేక ప్రాంతాల్లో కుక్కలు రెచ్చిపోయి ప్రజలపై పడి కరుస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

సాధారణంగా సీజన్‌ మారినప్పుడల్లా కొత్తనీరు పాతనీరుతో కలిసినప్పుడు కుక్కలకు రోగాలు రావడం అవి పిచ్చిగా మారి మనుషులపై దాడులు చేయడం జరుగుతున్నది. కానీ ఈసారి పరిస్థితి అదుపుతప్పిందేమోననిపిస్తున్నది. ఒక్క రాజధానిలోనే కాదు అటు ఉత్తరతెలంగాణాలోనూ, దక్షిణ తెలంగాణాలోనూ కుక్కల దాడులు పెరిగిపోయాయి.

ఇక్కడే కాదు గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరా వతికి కూతవేటు దూరంలో ఉన్న అడవితక్కెళ్లపాడు గ్రామంలో పట్టపగలు మధ్యాహ్నం నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కుక్కల గుంపు దాడికి తెగబడింది. ఎక్కడపడితే అక్కడ కొరికేశాయి. నడిరోడ్డుపై కుక్కలు విచక్షణారహితంగా కరుస్తుంటే ఆ బాలుడు చేస్తున్న ఆర్తనాదాలు ఎవరి గుండెలను కరిగించలేకపోయాయి. ఎవరూ అడ్డుకొని కాపాడలేకపోయారు.తీరా అడ్డుకునే సరికి జరగాల్సింది జరిగిపోయింది.

రక్తపు మడుగులో రోడ్డుపై కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించినా రక్తస్రావం పెరిగిపోవడంతో ఫలితం దక్కలేదు.ప్రాణాలు పోయాయి.అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ పిచ్చికుక్కల దాడిలో ఏకంగా యాభై మంది తీవ్రంగా గాయపడటం, ఇందులో అనేకమంది విద్యార్థినీవిద్యార్థులు కూడా ఉన్నారు. వాస్తవంగా కుక్కలను నియంత్రించేందుకు, కాట్లకు గురైనవారికి సకాలంలో వైద్యసహాయం అందించేందుకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నది.

హైదరాబాద్‌ వరకే తీసుకున్నా ఎని మిది లక్షలకుపైగా కుక్కలు ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నా అంతకురెట్టింపు స్థాయిలో ఉన్నట్లు అనధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కుక్కలు, కోతుల సంరక్షణ బర్త్‌కంట్రోల్‌ కోసం ఐదు వెల్‌ఫేర్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. కోతులను, కుక్కలను పట్టుకునేందుకు దాదాపు పదిహేను వాహనా లను కూడా ఏర్పాటు చేశారు. సర్జరీ ఇతర చికిత్సల కోసం ఏటా దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు జిహెచ్‌ఎంసి లెక్కలు చెబుతున్నాయి.

కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితమవ్ఞతున్నాయనిపిస్తున్నది. కుక్కలు కరిస్తే వెంటనే మరణించకపోయినా తద్వారా వ్యాపించే రేబీస్‌ వ్యాధి ప్రాణాంతకంగా తయారవ్ఞతు న్నది. దేశవ్యాప్తంగా గణాంకాలను పరిశీలించినా రేబీస్‌ వ్యాధితో సంభవిస్తున్న మరణాల్లో భారతదేశంలో అధిక శాతం జరుగుతున్నాయి. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎన్నో సార్లు హెచ్చరించింది. ఈ టీకాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆస్పత్రుల్లో కుక్క కరిచిన తర్వాత జరగాల్సిన చికిత్సకు అవసరమయ్యే మందులు లేవనే చెప్పాలి.

ఏటా కుక్కకాటు వల్ల దాదాపు యాభైవేల మందికిపైగా ఆస్పత్రిపాలవ్ఞతున్నట్లు అధికార లెక్కలే వెల్లడిస్తున్నాయి. అయితే వీరిలో ఎందరికి సకాలంలో చికిత్స అంది ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్నారో, మరెందరు పరలోకానికి పయనం కడుతున్నారో స్పష్ట మైన లెక్కలు లేవ్ఞ. జనంపై పడి విచక్షణారహితంగా కరిచే పిచ్చి కుక్కలను పట్టి దూరంగా వదిలి వచ్చే శిక్షణ కలిగిన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇక రేబీస్‌ నిరోధక టీకాలు కొనుగోలు, సరఫరా అంతా ఒక మిథ్య గా మారిపోతున్నది. శునకాలకు శస్త్రచికిత్స చేస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్నా వాస్తవంగా అవి ఎంతవరకు అమలు అవ్ఞతున్నాయనేది అందరికి తెలిసిందే.

కుక్కల నియంత్రణకు అటు పంచాయతీల్లోనూ, ఇటు మున్సిపాలిటీల్లోనూ ఒక నిర్దిష్టమైన కార్యక్రమం తీసుకోకపోవడం వల్లనే అవి అంతకంతకు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది చిన్నారులు ఈ కుక్కల బారిన పడి ప్రాణాలు వదులుతున్నా పాలకులు ఈ విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లుబుకుతున్నాయి. అంతేకాదు వీటి నియంత్రణకు సంబంధించి స్థానిక సంస్థల కార్యాలయాలకు స్పష్టమైన నిబంధనలను ఏమీ లేవనే చెప్పొచ్చు. ఉన్నా కాలం చెల్లిన వాటిని ఏమాత్రం అమలు చేయడం లేదు.

ప్రపంచ ఆరోగ్యసంస్థతోపాటు దేశంలోని కేంద్ర ఆరోగ్యసేవల డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం రూపొందించిన మార్గదర్శకసూత్రాలను అన్ని స్థాయిల్లోనూ త్రికరణశుద్ధిగా అమలుకు ప్రయత్నం జరగాలి. కుక్కకాటుకు గురైన వారికి తక్షణం వైద్యసహాయం అందించే ఏర్పాటు చేయాలి. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కుక్కకాటు ద్వారా వచ్చే రేబీస్‌వ్యాధి మరెందరినో కబళించకతప్పదు. దక్షిణ భారతదేశంలో ఆదర్శంగా ఉంటూ విశ్వనగరంగా గుర్తింపు దిశలో అడుగులు వేస్తున్న హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరం, బాధాకరం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/