ఆ ఒక్క ఓటే కీలకం!

BritonElections
BritonElections

బ్రెగ్జిట్‌ పరిణామాల నేపథ్యంలో కుప్పకూలిన జేమ్స్‌కేమరూన్‌ అనంతరం థెరిస్సామే తర్వాత వచ్చిన బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కఓటు తేడాతో మెజార్టీ నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. గతనెల 22వ తేదీనాటికి కొత్త కన్సర్వేటివ్‌ పార్టీ అధిపతిని ఎన్నుకోవాల్సి ఉంటుందని, ఇక తానెంత మాత్రం కొనసాగబోనని బ్రిటన్‌ ప్రధానిగా థెరిస్సామే ప్రకటించి అనంతరం ఆమె పదవినుంచి వైదొలిగారు. తర్వాత జరిగిన అన్వేషణలో బోరిస్‌ జాన్సన్‌ను ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడాయన మెజార్టీ నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చింది. మొత్తం 650 మందికిపైగా సభ్యులున్న హౌస్‌ఆఫ్‌ కామన్స్‌లో కన్సర్వేటివ్‌పార్టీ బలం 310 మంది.

ఆ పార్టీకి డెమొక్రటిక్‌ యూనియన్‌నిస్టుపార్టీ పదిమంది సభ్యులు మద్దతిస్తుండటంతో మెజార్టీ మొత్తం 320కి చేరింది. ప్రధానిగా ఎన్నికకాగానే బోరిస్‌జాన్సన్‌కు మరో చుక్కెదురయింది. వేల్స్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన పార్టీకి అభ్యర్థి గెలవలేకపోయారు. దీనితో సభలో ఆ పార్టీ మెజార్టీ తగ్గుతూ వస్తోంది. ఒక్క ఓటు తేడాతో మాత్రమే ఇప్పుడు గెలిచే పరిస్థితి ఉత్పన్నం అయింది. ఈ ఒక్క ఓటును అన్ని పార్టీలుసైతం ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బ్రెగ్జిట్‌ను ముందునుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన లిబరల్‌ డెమొక్రాట్స్‌ అభ్యర్థి జేన్‌ డాడ్స్‌ బ్రెకాన్‌ స్థానంనుంచి గెలిస్తే కన్సర్వేటివ్‌ అభ్యర్థి క్రిస్‌ డేవిస్‌ను 1325 ఓట్ల తేడాతో ఓడించారు.

ప్లయిడ్‌సిమ్రూ,గ్రీన్‌పార్టీలు తమతమ అభ్యర్థులను నిలపకపోవడంతో ఈ రెండు పార్టీలు కన్సర్వేటివ్‌ కూటమిలోనే కొనసాగుతాయన్న భావన వ్యక్తం అయింది. ఇపుడు 650 మంది సభ్యులున్న బ్రిటన్‌ పార్లమెంటులో పార్టీకి మొత్తం బలం 320 అయితే ప్రతిపక్షం మొత్తం బలం 319 మందిసభ్యులతో ఢీ కొడుతోంది. స్పీకర్‌,ముగ్గురు డిప్యూటీ స్పీకర్లు, ఏడుగురు సభ్యులున్న సిన్‌ఫీన్‌గ్రూప్‌ ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. కేవలం ఒకే ఒక్క ఓటు ఇప్పుడు బ్రిటన్‌ కొత్తప్రధాని భవిష్యత్తును నిర్దేశించనున్నది. ఏమాత్రం అటూ ఇటూ పరిస్థితులు మారినా బ్రిటన్‌లో ఇప్పుడు కొత్తప్రధాని ప్రభుత్వం కూలిపోయి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు.

బ్రిటన్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు విసిగిపో యారని, భిన్న రాజకీయ వాతావరణం కావాలని బ్రిటన్‌ పౌరులు కోరుకుంటున్నారని మిశ్రమ ప్రభుత్వం కాకుండా ఒకేపార్టీ ప్రభుత్వాన్నే కోరుతున్నారని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వమే రావాలని కోరుతున్నట్లు అధికారపక్షం ప్రచారం చేసుకుంటోంది. అంతేకాకుండా పార్టీ ఎంపిగా ముందు తాను వెస్ట్‌మినిస్టరుకు వెళ్లి బోరిస్‌జాన్సన్‌ను పట్టుకు తెస్తానని, ఆయన ఎక్కడ దాక్కున్నా తాము పిలుచుకుంటామంటూ అధికారపార్టీ అధ్యక్షుడు జేమ్స్‌ క్లవర్లీ చేసిన వ్యంగ్యోక్తులు, ధీమా వైఖరి చూస్తుంటే ఎలాగైనా తమ పార్టీ విశ్వాపరీక్షలో గట్టెక్కుతుందన్న భావన ఆయనలో కనిపిస్తోంది. ఇప్పుడు బ్రెగ్జిట్‌ డీల్‌పైనే బ్రిటన్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఉప ఎన్నిక తమను కొంత నిరాశకు గురిచేసినప్పటికీ సభలో మెజార్టీని రుజువు చేసుకుని కొనసాగుతామని క్లవర్లీ ప్రకటించిన ధీమా ముందుగానే ఇతర పార్టీలతో మంతనాలు ముమ్మరం చేసారని తెలుస్తోంది. గడచిన నాలుగేళ్లకుపైబడి బ్రిటన్‌లో అంతర్గత సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. యూరోపియన్‌ దేశాలు అక్టోబరులోపు బ్రెగ్జిట్‌ అమలు కావాలని గడువు విధించారు.

వాస్తవానికి గడువు మార్చితో ముగిసినప్పటికీ అప్పటి ప్రధాని విజ్ఞప్తితో గడువును యూరోపియన్‌ యూనియన్‌ కూటమి అక్టోబరు వరకు పొడిగించింది. ఈలోపు బ్రిటన్‌ పార్లమెంటులో బ్రెగ్జిట్‌ డీల్‌ ఒప్పందం ఆమోదం పొందాలి. ఆ తర్వాత బ్రిటన్‌ ఐరోపాకూటమితో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు, సంబంధాలు, వాణిజ్య పరస్పర మైత్రీబంధం, ద్వైపాక్షిక ఒప్పందాలు వంటివాటిపై సమగ్ర అధ్యయనం జరగాలి. ఇవన్నీ ముందుకు సాగాలంటే ముందు కొత్తప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన మెజార్టీని నిరూపించుకోవాలి.

క్రియాశీలక రాజకీయాలతో ప్రతిపక్షం ఐక్యకూటమి 319మంది సభ్యులతో అధికార పక్షాన్ని బ్రెగ్జిట్‌ డీల్‌పై ఎండగడుతూనే వస్తోంది. అందుకు అనుగుణంగానే గత ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం, బ్రెగ్జిట్‌ప్రతిపాదనలు తిరస్కరించడం జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో జరిగే విశ్వాసపరీక్ష ఇప్పుడు బోరిస్‌ జాన్సన్‌కు విషమ పరీక్షగానే మిగులుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇప్పటికే బ్రిటన్‌పౌండ్‌ మారకం విలువల్లో డాలర్‌ను అధిగమించలేకపోతోంది. యూరోకరెన్సీని సైతం తట్టుకోలేని స్థితిలో ఉంది.

ఇక వాణిజ్య ఒప్పందాలు మందగించాయి. బ్రిటన్‌ ఆర్థికవ్యవస్థ కుదుటపడాలంటే ముందు బ్రెగ్జిట్‌ డీల్‌ కొలిక్కిరావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తప్రభుత్వం ప్రపంచ దేశాలతో అనుసరించే దౌత్యవిధానం నుండి వాణిజ్య, ఆర్థికరంగ పెట్టుబడుల ఒప్పందాలు మొత్తం కీలకంగా మారనున్నాయి. ఇందుకోసం ఇప్పుడు బోరిస్‌ జాన్సన్‌ తనకున్న ఒక్క ఓటు మెజార్టీని ఆసాంతం పరిరక్షించుకోవాల్సిఉంది. ప్రతిపక్ష పార్టీలు వేసే ఎరకు ఆకర్షితులు కాకుండా ఉండేవిధంగా బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీకి ఇప్పుడు జాన్సన్‌ ప్రభుత్వాన్ని గట్టెక్కించి బ్రిటన్‌ భవిష్యత్తును సైతం చక్కదిద్దాల్సిన బాధ్యత వెంటాడుతున్నదనడంలో ఎలాంటి సందేహంలేదు.