పర్యాటకుల భద్రత పట్టని పాలకులు

Boat Accident-
Boat Accident-in Godavari (File)

అధికారుల అసమర్థత, అవినీతి, బోటు యజమాని దురాశతో ఆహ్లాదకరంగా సాగాల్సిన పాపికొండల సందర్శన పర్యటన అత్యంత విషాదకరంగా ముగిసింది. ఒకరిద్దరు కాదు. దాదాపు యాభై మంది వరకు గల్లంతయినట్లు సమాచారం.చుట్టూ పచ్చటి ప్రకృతి,నిండు గోదావరి అలలపై అటూ ఇటూ ఊగుతున్న లాంచీలో పాపికొండల అందాలను ఆస్వాధీస్తూ సాగుతున్న ప్రయాణం ఒక్కసారి గా పడవ సుడిగుండంలో చిక్కుకొని అటూ ఇటూ ఊగి మునిగిపోవడం ఆరంభించడంతో దిక్కులు పిక్కటిల్లేటట్లు అరచిన ఆ పర్యాటకుల ఆర్తానాదాలు గాలిలో కలిసిపో యాయి.

ఇరవై ఆరు మంది పర్యాటకులను సమీపగ్రామ స్థులు కాపాడారు. మృతుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. అందులోనూ తెలంగాణ రాష్ట్రా నికి చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. ఈ ప్రమాదం తెలుగురాష్ట్రాలనే కాదు దేశం మొత్తాన్ని ఒక్క సారిగా ఉలిక్కిపరిచింది. జలప్రమాదాలు జరగడం ఇది మొద టిదికాదు. చివరిది కూడా కాదు. ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, బాధ్యు లపై కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలకు విరుద్ధం గా ఎలాంటి పరిస్థితుల్లోనూ లాంచీల ప్రయాణానికి అను మతి ఇవ్వమని పెద్దపెద్ద ప్రకటనలు చేయడం, హెచ్చరి కలు జారీ చేయడం, ఆ తర్వాత మరిచిపోవడం జరుగు తూనే ఉన్నది.

ఇప్పుడు జరిగిన ప్రమాదానికి నిబంధన లకు విరుద్ధంగా గోదావరి ఉధృతంగా ఉన్న తరుణంలో లాంచీని నడిపారనే ప్రాథమిక వార్తలను బట్టి తెలుస్తు న్నది. గోదావరిలో రెండున్నర లక్షల క్యూసెక్కులకు మించి ప్రవాహం ఉన్నప్పుడు పర్యాటకుల లాంచీలను నడపకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆది వారం ఉదయం దాదాపు 73 మంది ప్రయాణీకులు బోటు సిబ్బందితో బయలుదేరింది. అయితే గోదావరి ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో పర్యాటకులతో ప్రయాణించడానికి వీల్లేదని కొందరు పోలీసు అధికారులు అభ్యంతరం చెప్పినా తమకు కాకినాడ పోర్టు ఆధారిటీ నుంచి అనుమతులున్నాయని వారి మాటలు ఖాతరు చేయకుండా బయలుదేరినట్టు చెప్తున్నారు. అయితే అక్కడక్కడ గోదావరిలో సుడిగుండా లున్న విషయం లాంచీ యజమానులకు, డ్రైవర్లకు తెలిసిందే.

పాపికొండల ప్రయాణం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకు జలమార్గంలోనే ప్రయాణిస్తున్నవారు ఎందరో ఆ ప్రకృతి సౌందర్యాలను చూసి ఆనందిస్తుంటారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాపికొండలు మునిగి పోతాయని, ఆ తర్వాత చూసే అవకాశం ఉండదని ఇటీవల ప్రచారం ఎక్కువ కావడంతో పర్యాట కుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పోశమ్మ గండి నుంచి పాపి కొండల వరకు 62 కిలోమీటర్ల దూరం ఉన్నా ఎక్కడా సుడిగుండాల గూర్చి, ప్రమాదకర పరిస్థితుల గూర్చి తెలి యచేసే హెచ్చరికలు సూచించే బోర్డులు లేవ్ఞ. రాజ మహేంద్రవరం పట్టిసీమ, సింగనపల్లి పోశమ్మ గండి నుంచి పాపికొండలకు ప్రయాణించే సమయంలో ప్రవా హానికి ఎదురీదాల్సిఉంటుంది. అంతేకాదు గోదావరి అత్యంత దగ్గరే సన్నగా ప్రవహిస్తుంటుంది. ఎన్నో మలు పులున్నాయి.

ఇటీవల గోదావరి ఈ సీజన్‌లోనే మూడు సార్లు తన ఉగ్రరూపాన్ని చూపించింది. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరూ క్షుణ్ణంగా పరిశీ లించిది లేదు. ఇప్పుడు ప్రమాదం జరిగిన కచ్చులూరు వద్ద గోదావరి ప్రవాహానికి కొండ అడ్డంగా ఉండటంతో సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సుడిగుండాల్లో చిక్కుకున్న లాంచీలు పెద్దపెద్ద బండరాళ్లను ఢీకొని బోల్తా పడటమేకాదు రంధ్రాలుపడి లోపలికి నీరు ప్రవేశిస్తుంది. ఆదివారం కూడాకచ్చులూరు వద్దనే గోదావరి ప్రవాహం వడి, సుడి కలిసి ప్రమాదానికి దారితీశాయని అంచనా వేస్తున్నారు. నీటి సుడుల్లో బోట్లు కానీ, లాంచీలు కానీ చిక్కుకుంటే బయటపడటం అంత సులభం కాదు.

ఇది ఆ ప్రాంతం వారికి అందరికీ తెలుసు. 1964లో ఇదే కచ్చులూరు వద్దనే ఒక బోటుమునిగి అరవై మందికిపైగా పర్యాటకులు మృతిచెందారు. ఆ తర్వాత అక్కడే జరిగిన మరో ప్రమాదంలో ఎనిమిది మందికిపైగా మరణించారు. ఆ తర్వాత కూడా గోదావరి లోనే కాదు అటు కృష్ణా లోనూ ఎన్నో ప్రమాదాలు జరిగాయి. 1985 భద్రాచలం కూనవరం వద్ద నాటుపడవ తలకిందులై 38 మంది చనిపోయారు. ఇక మహబూబ్‌నగర్‌జిల్లాలో కృష్ణానదిపై మంచాలకట్ట దగ్గర 2007లో జరిగిన ప్రమాదంలో 60 మంది బలయ్యారు.

ఇక 2017 పవిత్ర సంఘం వద్ద 23 మంది జలసమాధి అయ్యారు.ఈ ప్రమాదాల పరం పరం కొనసాగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్తూనే ఉన్నారు. పాపికొండల యాత్రకు వెళ్లే లాంచీలన్నీ ప్రభుత్వమే నడిపేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్రపాలకులు ప్రకటించారు. అంతేకాదు ప్రైవేట్‌ బోట్లు పాపికొండల సందర్శనం తర్వాత చీకటిపడకముందే పోశమ్మగండికి చేరుకోవాలని నిబంధనలున్నా రాత్రి పదింటి తర్వాత కూడా బోట్లు తిరుగుతున్నాయి.

మరొకపక్క పాపికొండల యాత్రలో సిగ్నల్స్‌కూడా పనిచేయకపోవడం ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం వచ్చే అవకాశం లేకుండాపోతున్నది. పాలకులు ఇప్పటికైనా జలప్రయా ణాలపై ప్రత్యేకదృష్టి పెట్టాలి. కట్టుదిట్టమైన నిబంధనలు విధించడమేకాదు వాటిని పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలి. అవసరం అనిపిస్తే చట్టానికి మరింత పదునుపెట్టాలి. ఈ ప్రమాదానికి బాధ్యులైనవారిపై కూడా కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన గురుతర బాధ్యత పాలకులపై ఉంది.