నల్లధనస్వాములపై చర్యలు?

Black Money (File)
Black Money (File)

స్వదేశంలో రకరకాల మార్గాల్లో సొమ్ములు కూడబెట్టుకొని కోట్లకు కోట్లు పడగలెత్తి ఆ డబ్బు అంతా విదేశాల్లో భద్రపరుచుకొంటున్న కొందరు ఘరానా పెద్దల గూర్చి తెలిసినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నది. దాదాపు దశాబ్దకాలంగా ఈ విషయంలో కేంద్రపాలకులు ఆ కోణంలో చర్యలు తీసుకున్నట్లు చెపుతున్నా ఇంతవరకు ఆచరణలో ఎలాంటి ఫలితాలు కన్పించడంలేదు. విదేశాల్లో ప్రధానంగా స్విస్‌ బ్యాంకులతోపాటు అనేక విదేశీబ్యాంకుల్లో వందలు కాదు వేలాది కోట్లరూపాయలు దాచుకున్న నల్లధనస్వాములు ఎందరో ఉన్నారు.

ఒకరిద్దరు కాదు వందలు కాదు వేలసంఖ్యలో ఉన్నారు. 2009 నుండి వీరి వివరాలు, వారు దాచుకొన్న నల్లధనం గూర్చి తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారం ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అంటూ కాలం గడుపుతున్నారే తప్ప నిర్దిష్టసమాచారం ఇంతవరకు సేకరించలేకపోతున్నారు. ప్రస్తుతం తాజాగా స్విస్‌ బ్యాంకు నుండి తమ వద్ద ఉన్న సమాచారం కొంతమేరకు అందినట్లు కేంద్రం తెలిపింది. ఈ సమా చారం ఆధారంగా అక్రమంగా భారత్‌ నుండి ధనం తరలించిన వారిపై కేసులు పెట్టి పటిష్టమైన చర్యలు తీసుకోవచ్చునని అధికారులు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

అయితే మొదటి దశలో వచ్చిన సమా చారంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలు మూసివేసిన వారు, డబ్బు మొత్తం విత్‌డ్రా చేసిన వారి వివరాలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తున్నది. చాలా ఖాతాల్లో గత ఏడాది నుండే భారీఎత్తున నిధులు తరలిపోయాయి. వాస్తవంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు సంబంధించి ఏ సమాచారమైనా రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాయి. అలా వ్యవహరిస్తేనే ఖాతాదారుల్లో నమ్మకం పెరిగి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అందుకే స్విస్‌ బ్యాంకు ఈ వ్యవహారంలో చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాల పేరుతో ఏళ్ల తరబడి కొనసాగిం చింది. అయితే ఎప్పటికప్పుడు సమాచారం పంచుకోవాలనే విధానంతో స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ఆర్థిక విభాగం ఈ సమాచారాన్ని భారత్‌కు అందించింది. ఆగస్టు చివరివారంలో స్విట్జర్లాండ్‌ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల బృందం ఢిల్లీకి వచ్చి సమాచారం పంచుకొనేందుకు విధివిధానాలపై చర్చలు జరిపింది.

అందులో భాగంగానే ఆ ప్రభుత్వం ఆదేశాల మేరకు నివేదికలు రూపొందించారు. అయితే ఈ వివరాలు రహస్యంగా ఉంచాలనే షరతుపైన నివేదిక అందించినట్లు సమాచారం. ఇందులో 2018కు ముందు మూసివేసిన దాదాపు వందమందికిపైగా భారతీయుల ఖాతాల వివరాలు ఉన్నట్లు వెల్లడించారు. వాస్తవంగా ఈ ఖాతాల వివరాలు వెల్లడించేందుకు గతంలో స్విట్జర్లాండ్‌ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల నుండి తమతమ మేనిఫెస్టోలో నల్లధనం వెలికితీస్తామని రాజకీయపార్టీలు హామీలిస్తూనే ఉన్నాయి.

అప్పటి యుపిఏ ప్రభుత్వం ఈ మేరకు కొంత ప్రయత్నం చేసిందనే చెప్పొచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న బ్యాంకుల సంగతి ఎలా ఉన్నా, స్విట్జర్లాండ్‌లోని బ్యాంకులపై అప్పట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ దేశంలో బ్యాంకుల్లో వ్యక్తులు తమతమ సొమ్ములు, విలువైన దస్త్రాలు, బంగారం వంటివి డిపాజిట్‌ చేసుకునే సౌకర్యం ఉంది. ఈ వివరాలు ప్రభుత్వాలు అడిగినా ఇచ్చేందుకు అక్కడి చట్టాలు అంగీకరించవ్ఞ. వ్యక్తుల గోప్యతకు ఇది భంగకరమని, దీనివల్ల తమ ఆర్థికాభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఎంతో కాలంగా స్విస్‌ ప్రభుత్వం సమర్థించుకుంటూ వస్తుంది. భారత్‌ మాత్రం పట్టువదలకుండా తమ వాదనను వివిధ వేదికల ద్వారా వినిపిస్తూ ఒత్తిడి పెంచింది. ఒకదశలో స్విట్జర్లాండ్‌ను సహాయనిరాకరణ జాబితాలో చేరుస్తామని కూడా భారత ప్రభుత్వం హెచ్చరించింది. స్విస్‌ అప్పటి ఆర్థిక మంత్రి యవలైన్‌ వైడ్‌మర్గ్‌స్కిల్స్‌ ఘాటైన లేఖకూడా రాశారు.

జి-20 దేశాధినేతలు తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యంగా ద్వంద పనుల ఎగవేత నిరోధక ఒప్పందాన్ని అమలు చేయాలని తీర్మానించడంతో స్విస్‌ ప్రభుత్వం మెత్తపడక తప్పలేదు. పన్నుచెల్లింపుదారుల్లో కొందరు భారతీయులు లెక్కలు చూపని భారీ మొత్తాలను ఆస్తులను, హద్దులు దాటించి నిక్షిప్తం చేసుకున్నారని, దీనివల్ల పన్నుల రాబడి గణనీయంగా తగ్గుతున్నాయని ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టింది. ఇలాంటి సమాచారం ఇవ్వని పక్షంలో స్విట్జర్లాండ్‌పై తమ దేశాల చట్టాల పరిధిలో ఇన్వెస్టర్లకు కల్పించే రాయితీలను కూడా వర్తింపచేయలేమని కూడా ఆనాడు భారత్‌ స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దీనిపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు తాజాగా కొంత సమాచారం ఇచ్చేందుకు స్విస్‌ అంగీకరించింది.

అందులో భాగంగానే కొంత సమాచారాన్ని పంపించింది. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం జాబితాలో ఎక్కువ మంది ఆటోమొబైల్‌, రసాయనికాలు, వస్త్రాలు, వజ్రాలు, నగలు, ఉక్కు తదితర వ్యాపారాలు చేసేవారే ఉన్నారని తెలుస్తున్నది.

ఇప్పుడు వీటిని కూలంకషంగా పరిశీలించి అధ్యయనం చేసి విశ్లేషించి చర్యలు తీసుకు నేందుకు సమాయత్తం అవ్ఞతున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాజకీయ పార్టీలతో సంబం ధాలున్న వారిపై ప్రత్యేక దృష్టిపెట్టబోతున్నట్లు సమాచా రం. ఏదిఏమైనా విదేశాల్లో నిక్షిప్తం చేసుకున్న వేల కోట్ల నల్లధనం వివరాలు కొంతవరకైనా బయటకు వస్తే పన్నుల రాబడి పెరిగి ఆర్థికవృద్ధికి దోహదంఅవ్ఞతుందన్న నిపుణుల అభిప్రాయంలో వాస్తవం లేకపోలేదు.