అయోధ్యపై ముగిసిన వాదనలు

Arguments concluded on Ayodhya

దశాబ్దాల కాలం నాటి అయోధ్య కేసు వివాదం ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. 40 రోజులపాటు ప్రతిరోజూ విచారణ నిర్వహించిన సుప్రీం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. రామ జన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పలు అప్పీళ్లు దాఖలైన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే అలహాబాద్‌ హైకోర్టు ఈ వివాదాస్పద స్థలాన్ని ముగ్గురు పిటిషనర్లకు సమంగా పంచాలని నిర్దేశిస్తూ వెలువరించిన తీర్పును హిందూ మహాసభ, ఇతర సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘకాలంపాటు మౌఖిక విచారణ జరిపిన కేసుగా అయోధ్య వివాదం కేసు నడిచింది. 2.77 ఎకరాలకు సంబంధించిన ఈ వివాదానికి బీజం ఏడు దశాబ్దాల క్రితమే పడిందని చెప్పాలి.

ఆనాటి సామ్రాజ్య పాలకుడు విక్రమాదిత్య నిర్మించిన ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో మళ్లీ పునర్నిర్మించారని చరిత్ర చెపుతోంది. 15వ శతాబ్దంలో మొఘుల్‌ సామ్రాజ్య నేత బాబర్‌ దేవాలయాన్ని ధ్వంసం చేసారని, తర్వాత ఔరంగజేబు కాలంలో 17వ శతాబ్దంలోనే అక్కడ మసీదును నిర్మించారని తెలుస్తోంది. స్కంద పురాణం తదితర చారిత్రక వివరాలను పరిశీలించిన నిపుణులు, పర్యాటకుల కథనాల ఆధారంగాను, తర్వాత ప్రభుత్వ గెజిట్‌ల పరంగా అయోధ్య శ్రీరామచంద్రుని జన్మస్థలంగానే చెప్పుకొచ్చారు. ఇక సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ఈ కేసులో సుప్రీంకోర్టు అప్పీళ్ళను ముందుగానే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని యోచించింది.

ఇందుకుగాను మధ్యవర్తిత్వ ప్యానెల్‌నుసైతం ప్రకటించినా చర్చలు, సంప్రదింపులు ఏమాత్రం ఓ కొలిక్కి రాలేదు. మధ్యవర్తిత్వ ప్యానెల్‌కు రెండు పర్యాయాలు గడువు పొడిగించినా.. ఫలితం రాబట్టలేకపోవడంతో.. ఇక రోజువారీ విచారణకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం శ్రీకారం చుట్టింది. 1500 చదరపు అడుగుల స్థలానికి సంబంధించిన వివాదం కానేకాదని, రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం విభిన్న మత విశ్వాసాలకు ముడిపడిన అంశమని సుప్రీంకోర్టు విచారణలోనే వ్యాఖ్యానించింది.

మధ్యవర్తిత్వ ప్యానెల్‌ ఆధ్వర్యంలో కోర్టు బయట పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే వాస్తవంగా 1950లో ఈ కేసు దాఖలుచేసిన పిటిషనర్‌ గోపాల్‌సింగ్‌ విశారద్‌ తరపున పిటిషన్‌ దాఖలు చేసిన రాజేంద్రసింగ్‌ మధ్యవర్తిత్వ కమిటీ ఎలాంటి ఫలితాలను రాబట్టలేకపోయిందని, విచారణ చేపట్టాలని కోరడంతో సుప్రీంకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించింది. 40 రోజులకు ఎట్టిపరిస్థితుల్లోను ఈ కేసు వాదనలు పొడిగించే ప్రశ్నేలేదని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగో§్‌ు స్పష్టం చేసారు. అనుకున్నట్లుగానే బుధవారం వాదనలను ముగిస్తున్నట్లు ప్రకటించి పిటిషనర్లకు లిఖితపూర్వకంగా తెలియజెప్పేందుకు మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఇక తీర్పు వెలువడటమే తరువాయి.

ఇప్పటికే అయోధ్యలో దీపారాదన, పూజలు నిర్వహిస్తామంటూ విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ ఇతర హిందూత్వ సంస్థలు అనుమతులు కోరిన నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఇక తీర్పు ఏరూపంలో ఉంటుందన్నదే ఇప్పుడు అందరి నోటా నలుగుతున్న చర్చ. అత్యధిక దస్త్రాలను దాఖలుచేసిన పిటిషనర్లు పురావస్తుశాఖ ప్రాచీన వివరాలనుసైతం అందచేస్తూ ఈ స్థలంలో రామాలయాన్ని నిర్మించారని, రామ జన్మభూమి అయోధ్యలోనే శ్రీరాముడు జన్మించాడనడానికి తమ వద్ద ఉన్న ఆధారాలను సుప్రీంకు నివేదించి చివరి నిమిషం వరకూ అదే వాదనను కొనసాగించారు. బ్రిటిష్‌ కాలంలో కూడా ఆనాటి పాలకులు బాబర్‌ కాలం నాటి సాంప్రదాయాన్నే గుర్తించారు. నవాబులు ఇదే కొనసాగించారు. 1885 నుంచి ఉన్న దస్త్రాలను ఈ వివాదాస్పద స్థలంపై దాఖలు చేసారు.

ఆ దస్త్రాలను చూస్తే.. మసీదు ఉందని చూపిస్తున్నాయి. 1949 వరకూ ముస్లింలు ఈ స్థలాల్లోనే ఈద్‌ ప్రార్థనలు నిర్వహించే వారని ఉన్న రికార్డులను ముస్లిం సంఘాల నేతలు సుప్రీంకు వివరించారు. ఎంతమాత్రం నిజం కాదంటూ చరిత్రకారులు పలు ప్రభుత్వ గెజిట్‌లను ఈ సందర్భంగా ఉదహరిస్తూ మసీదు ఉందన్న వాదనల్లో పస లేదని మందిరం ఉందని అందుకు సంబంధించిన ఆధారాలు వారివంతుగా వారు దాఖలుచేసారు.

అవన్నీ దిగువ కోర్టు నుంచి అలహాబాద్‌ హైకోర్టు వరకూ సాగిన విచారణగా భావించవచ్చు. ఇకపై వాదనలు ఏవైనా సుప్రీంకోర్టు అప్పీళ్లలో కేవలం వాదనలు మాత్రమే ఆధారంగా జరిగాయి. నిర్మోహి అఖారా, రామ్‌లాల్ల, ముస్లిం బోర్డు పిటిషనర్లు, ప్రతివాదులుగా సాగిన ఈ కేసుపై వెలువడే తీర్పు భారత్‌లో చరిత్రాత్మకం అవుతుం దనే చెప్పాలి. పురావస్తుశాఖసైతం తన నివేదికలో మసీదు అంతర్భాగంలో దేవాలయం ఉందని, అయితే కాలక్రమం లో ధ్వంసమైందని నివేదిక ఇస్తూ శాస్త్రీయంగా రుజువులు లేవని కోర్టుకు నివేదిక ఇచ్చింది.

ఇప్పుడు మధ్యవర్తిత్వ ప్యానెల్‌సైతం తనవంతుగా సంప్రదింపులు, చర్చల్లో వెలువడిన సారాంశాన్ని ధర్మాసనానికి నివేదిక ఇచ్చింది. శతాబ్దాల కాలం క్రితమే నిర్మించిన మసీదుపై దశాబ్దాల కాలంగా నలుగుతున్న ఈ వివాదాన్ని వచ్చే నెల మొదటి పక్షంలోనే తీర్పు వెలువరించే కృతనిశ్చయంతో ధర్మాసనం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఇక అయోధ్యలో కొనసాగే భవిష్యత్‌ కార్యాచరణ హింసకు తావులేకుండా కొనసాగిం చేలా చూడాల్సిన బాధ్యత పాలకులదేనని చెప్పకతప్పదు.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/