హబుల్‌

హబుల్‌

గత వారం రోజులపై టెలీస్కోప్‌

 

Drinking Water Problem
Drinking Water Problem

సాగు, తాగునీటి సంక్షోభంలో తెలుగు రాష్ట్రాలు

బ్రి జేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తాజా తీర్పుతో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ తాగు,సాగునీటి సంక్షోభం లో పడ్డాయి. కృష్ణానది నీటి వాటాలో గతంలో ఉమ్మడి ఏపికి కేటాయించిన వాటిలోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పంచుకోవాలని, ట్రిబ్యునల్‌ ఈ రెండు రాష్ట్రాలకే పరిమితమని తేల్చిచెప్పింది. మహారాష్ట్ర,కర్ణాటకల కేటాయింపుల్లో మార్పులుండ వని స్పష్టం చేసింది. దీంతో కృష్ణా నదిపై ఆధారపడి ఏపి, తెలంగాణలో సాగవుతున్న లక్షలాది ఎకరాలకు సాగు నీటితో పాటు ఈ నదీ జలాలపైనే ఆధారపడి ఉన్న తాగునీటికి కటకట ఏర్పడనుంది. ట్రిబ్యునల్‌ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించినా ఈ సంక్షోభం నుంచి బయటపడా లంటే కేంద్రం తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. కారణం ఇప్ప టికే ఉమ్మడి ఏపి సుప్రీంను ఆశ్రయించిన దానికే అది పరిష్కారం చూపలేదు. 2013 నవంబర్‌ 29న ట్రిబ్యునల్‌ ఇచ్చిన అంతిమ అవార్డే ఇప్పటికి గెజిట్‌ రూపం పొందలేదు. నిర్ధిష్టమైన అభ్యంతరాలతో ఉమ్మడి ఏపి సుప్రీం కోర్టులో ఎస్సెల్సీ వేసింది. రాష్ట్రాల మధ్య నీటిపంపకాల అమలుకు ఆ తీర్పే ప్రాతిపదిక అవు తుంది. ఈ తీర్పు ఇంకా వెలువడలేదు. దీని కోసం నిరీక్షించడమా, ఈలోపే మరో మారు కోర్టుకెక్కడమా అన్నది తెలుగు రాష్ట్రాల ముందున్న ప్రశ్న. ఏపి పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం నీటి పంపకాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే జరగాలని, ఈ సెక్షన్‌ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినదేనని చెప్పడం సబబే. కాని ఇక్కడే ట్రిబ్యునల్‌ ఒకవిషయాన్ని పెడచెవిన పెట్టింది. నదీజలాల పంపిణి అన్నది అన్నదమ్ముల మధ్య ఆస్థిపంపకాల వంటిదని ట్రిబ్యునల్‌ భావించడమే తప్పు. అన్నదమ్ములకు ఉన్న ఉమ్మడి సంపద, ఆస్థి ఏరూపంలో ఉన్నా ఒకే సారి పంపకాలు చేయవచ్చు. కాని నదీ జలాలు అలా కాదు. అందుకే తెలుగు రాష్ట్రాలు రెండు ముఖ్య మైన అంశాలనే లేవనెత్తాయి. ఇందులో మొదటిది రాష్ట్ర పునర్వి భజన తర్వాత ట్రిబ్యునల్‌ అంతరాష్ట్ర వివాద పరిష్కారంతో పాటు తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పుడు నీటి నిర్వహణ, నిబంధనా వళి(ఆపరేషన్‌ ప్రోటోకాల్‌) ఖరారు చేయడం. దీనికోసమే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు అన్న అంశం తెరపైకి వచ్చింది. ఎగువ రాష్ట్రాల్లో జలాలకు స్థూల కేటాయింపులు జరిపి దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటికేటాయింపులు అంటే సమతూకం లేకుండా ఆపరేషన్‌ ప్రోటోకాల్‌ ఆచరించడం కుదరదన్నది తెలుగు రాష్ట్రాల అభ్యంతరం.ఈ వాదనను ఏపి న్యాయవాది ఎకె.గంగూలి ట్రిబ్యునల్‌ ముందు సమర్థవంతంగా వినిపించే ప్రయత్నం చేసినా ట్రిబ్యునల్‌ అంతగా పట్టించుకోలేదు. రెండవ అంశం ట్రిబ్యునల్‌ కేటాయింపల ప్రకారం ఎగువ రాష్ట్రాలు తమ ప్రాజెక్టుల్లో నీటిని నింపుకుంటూ పోతే పరిస్థితి ఏంటి. సీజన్‌ ఆలస్యమైనప్పుడు, వర్షాలు తక్కువ పడినప్పుడు దిగువ రాష్ట్రాల పరిస్థితి ఏంటి. వారి కోటా వారు నింపుకునే వరకు చుక్క నీరు కూడా దిగువకు వదల రు. అంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితి దారుణంగా తయారవుతుంది.

లక్షలాధి ఎకరాలు బీడు భూములుగా మారతాయి. అన్నం పెట్టే అన్నదాత హాహాకారాలు పెడతాడు. ఈ విషయంలో ట్రిబ్యునల్‌ చేసిన ప్రత్యామ్నాయాలేంటి అని తెలుగు రాష్ట్రాలు లేవనెత్తిన అతి ముఖ్యమైన అంశం. దీనిపై ట్రిబ్యునల్‌ చూపెట్టిన ప్రత్యామ్నాయం శూన్యం. అందుకే తాజాగా ఇచ్చిన ట్రిబ్యునల్‌ తీర్పుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు భారీనష్టం వాటిల్లనుంది. రెండోఅంశంలో ప్రత్యా మ్నాయం చూపకుండా దిగువ రాష్ట్రాలకు ఎన్ని టిఎంసీల నీటిని కేటాయిస్తే మాత్రం ఏమి ప్రయోజనం. అందుకే సీజన్ల వారీగా నీటి లభ్యతను బట్టి దామాషా పద్ధ్దతిన అన్ని రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరపాలి. ఇది లేకనే అక్టోబర్‌ వరకు ఇప్పుడు నీటిని వదలడం లేదు. ఈ కారణంగానే నాలుగు రాష్ట్రాలను కలిపి నీటి కేటాయింపులు చేయాలని తెలుగు రాష్ట్రాలు కోరుతున్నాయి. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల ఫిర్యాదు మేరకు 2004లో కేంద్రం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఇప్పటి వరకు 2010 డిసెంబరులో ఒక మధ్యంతర తీర్పును, 2013నవంబర్‌లో తుది తీర్పును ఇచ్చింది. తుది తీర్పును ఏపి, తెలంగాణలు వ్యతిరేకించాయి. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీంతో ఈ తీర్పును కేంద్రం ఇప్పటికీ గెజిట్‌లో ప్రచురించలేదు. ఈతీర్పులో బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుకు అదనంగా 194టిఎంసీలను కేటాయించింది. క్యారీ ఓవర్‌ కింద 150టిఎంసీలను మినహాయిస్తే బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అదనంగా ఇచ్చింది44టిఎంసీలే. ఇందులో పర్యావరణానికి నదిలో వదలాల్సింది పోనూ మిగిలేది 38టిఎంసీలు. దీనిలో ఏపిలోని తెలుగు గంగకు 25టిఎంసీలు, ఆర్డీఎస్‌ కుడి కాలువకు 4టిఎంసీ లు, తెలంగాణలోని జూరాలకు 9టిఎంసీలు కేటాయించింది.

ప్రాజె క్టుల వారీగా నీటి కేటాయింపులు చేసినందున తీర్పులో మార్పు ఉండదని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. నీటి పారుదల వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బచావత్‌కు బ్రిజేష్‌కు మధ్య తేడా బచావత్‌ ట్రిబ్యునల్‌, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ వ్యవహరించిన తీరులో తేడా ఉండడం కూడా తెలుగు రాష్ట్రాలకు శరాఘాత మైంది. 1976లో బచావత్‌ ట్రిబ్యునల్‌ తన తుది తీర్పును ఇచ్చింది. అప్పటి పరిస్థితులను బట్టి కృష్ణా నదిలో 75శాతం నీటి లభ్యత కింద 2060టింఎంసీల నీరు ఉందని,పునరుత్పత్తి ద్వారా మరో 70టిఎంసీలు లభిస్తాయని బచావత్‌ ట్రిబ్యునల్‌ లెక్క గట్టింది. ఈ లెక్క ప్రకారం ఉన్న మొత్తం 2130టిఎంసీల నీటిని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు కేటాయించింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811టిఎంసీలు కేటాయించింది. ఏపి దిగువ రాష్ట్రమైనందున 150టిఎంసీల మిగులు జలాల వినియోగానికి అవకాశం కల్పించింది. 1960 సెప్టెంబరు నాటికి ఉన్న నీటివినియోగం, ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకుని మూడు రాష్ట్రాలకు కలిపి1693.36టిఎంసీలు అవసరమని నిర్ణయించింది. మిగిలిన 366.64టిఎంసీల నీటిని మూడు రాష్ట్రాలకు పంచింది. వీటి నుంచి ఉమ్మడి ఏపికి 50.84టిఎంసీలు కేటాయించింది. వీటిలో జూరాలకు 17.84టిఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి ఆవిరి కింద 33టిఎంసీలు కేటాయించింది. ఉమ్మడి ఏపిలో 116టిఎంసీలు చిన్న నీటి వనరుల కింద ఉన్నాయి. ఈ వాదనను ఏపి వినిపించడంతో బచావత్‌ ట్రిబ్యునల్‌ కూడా కేటాయింపులు అలాగే చేసింది. ఈనీటిని ఏపి ఎలాగైనా వినియోగించుకోవచ్చని అవసరాన్ని బట్టి మార్పులు చేసుకోవచ్చని సూచించింది.

దీని కి అనుగుణంగానే 181.20టిఎంసీలు కృష్ణా డెల్టాకు కేటాయించారు. ఆధునీకరణ ద్వారా 29 టిఎంసీలు మిగులుతాయని భావించి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భీమా ఎత్తిపోతల పథకానికి 20 టిఎంసీలు, పులిచింతలకు 9టిఎంసీలు, కేసి కాలువకు 39.9 టిఎంసీలు కేటాయింపులు చేశారు. ఆధునీకరణ ద్వారా 8టిఎంసీ లు మిగిలాయని వాటిని ఎస్పార్బీసీకి కేటాయించారు. తేడా ఎక్కడ వచ్చిందంటే బచావత్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా నదిలో ఉన్న 75శాతం డిపెండబులిటీని పరిగణలోకి తీసుకోగా బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ మాత్రం 65శాతం డిపెండబులిటీని పరిగణలోకి తీసుకుని నదిలో ఎక్కువ నీరు ఉందనే అంచనాకు వచ్చారు. దీని కారణంగా ఉమ్మడి ఏపికి నీటి వాటాను పెంచినప్పటికి దీని ముసుగులో మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా నీటి కేటాయింపులు భారీగా పెంచారు. మొదటి తీర్పు ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకలకు 1319టింఎసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. రెండవ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఈ వాటా 1577టిఎంసీలకు పెరిగింది. అంటే రెండు రాష్ట్రాలకు కలిపి 254టిఎంసీల నీటిని అదనంగా కేటాయించారు. అదనపు కేటాయింపుతోనే నష్టం మహారాష్ట్ర, కర్ణాటకలకు అదనంగా కేటాయించిన నీటితోనే తెలుగు రాష్ట్రాలకు నష్టం వాటిల్లనుంది. వాటికి కేటాయించిన అదనపు నీటి లెక్క ప్రకారం అవి మరిన్ని ప్రాజెక్టులు నిర్మించే అవకాశాలున్నాయి. ముందుగా వారి ప్రాజెక్టులు నిండిన తర్వాతే దిగువకు నీటిని వదులుతారు. వారికి కేటాయించిన నీటిని ముందు గానే వారు ఉపయోగించుకుంటే దిగువకు ప్రవాహం తగ్గిపోతుంది. వర్షాభావ పరిస్థితుల్లో బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం రెండు రాష్ట్రాలకే పరిమితం చేస్తే దీని ప్రభావం ఏపికి కొంత తక్కువగా, తెలంగాణకు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్‌ 89ప్రకారం ఏపి, తెలంగాణలకు మాత్రమే ప్రాజెక్టుల వారీ కేటాయింపులను చేయాల్సి ఉంటుంది. ఎగువ రాష్ట్రాలకు లేని ఈ నిబంధన దిగువ రాష్ట్రాలకు ఎందుకనే ఏపి, తెలంగాణలు వాదిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల బేసిన్‌ నదుల నుంచి కాకుండా తెలంగాణకు కృష్ణా నది నుంచి 447టిఎంసీల నీరు రావాల్సి ఉంది. దిగువకు 28టిఎంసీల నీరు మాత్రమే రానుంది.

తెలంగాణలో కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత 188టి ఎంసీలు ఉన్నట్లు గుర్తించారు. భీమా నది బేసిన్‌లో ఉన్న 342టిఎంసీలలో ఎక్కువ భాగం నీటిని మహారాష్ట్ర, కర్ణాటకలకే కేటాయించారు. ఈబేసిన్‌ నుంచి తెలంగాణకు 25టిఎంసీల నీరు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. తుంగభద్ర, వేదవతి బేసిన్‌ల నుంచి తెలంగాణకు 18టింఎసీలతో పాటు ఏపికి అంతో ఇంతో నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూసిన తెలుగు రాష్ట్రాలకు ఈ తీర్పు తీరని నష్టాన్నే కలిగించనుంది. విడిపోవడంతోనే తలెత్తిన వివాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి తెలంగాణ, ఏపిలుగా ఏర్పడ డంతోనే ఈ వివాదం తలెత్తింది. నిజానికి కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు నీటిని కేటాయిస్తూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ 2010లోనే కేంద్రానికి అవార్డు ఇచ్చింది. ఈ కేటాయింపుల్లోనే అన్యాయం జరిగిందని ఏపి సుప్రీంలో పిటిషన్‌ వేసింది. దీంతో ఈ అవార్డుపై సుప్రీం స్టే ఇచ్చింది. ఇది ఎటూ తేలకముందే కోర్టులోనే ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చింది.
దీంతో నీటి కేటాయిం పులపై వేసిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువును కేటాయింపులు జరపడం కోసం కేంద్రం పొడిగించింది. దీని కోసం సెక్షన్‌ 89ను పునర్విభజన చట్టంలో పొందుపరి చారు. అయితే ఈ సెక్షన్‌ కొత్తగా ఏర్పడ్డ తెలుగురాష్ట్రాలకే కాదని మహారాష్ట్ర, కర్ణాట కలను కలిపి నాలుగు రాష్ట్రాలకు వర్తింప చేసి నీటి కేటాయింపులు జరపాలని తెలుగు రాష్ట్రాలు వాదించాయి.దీంతో నాలుగు రాష్ట్రా ల సమ్మతితోనే ఇటీవల ఇచ్చిన తీర్పు విష యంలో 9అంశాలను ట్రిబ్యునల్‌ విచారణ కు ప్రాతిపదికగా తీసుకుని విచారించింది. అయితే ఈ అంశాలపై తెలుగు రాష్ట్రాలు సరైన విధంగా వాదనలు వినిపించకపోవడంతోనే వాటికి నష్టం జరిగిందని స్వయంగా ట్రిబ్యునలే పేర్కొంది. మిగులు జలాలపై ట్రిబ్యునల్‌ దృష్టి మూడు రాష్టాలకు కేటాయింపులు జరిపినప్పుడు దిగువన ఉన్న ఉమ్మడి ఏపికి 150టిఎంసీల మిగులు జలాలను బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. ఈనీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్‌ లలో నిల్వ ఉంచుకుని అవసరమున్నప్పుడు వాడుకోవడానికి అవకాశం కల్పించింది. అప్పట్లో మూడు రాష్ట్రాలకు కేటాయించిన 2130టిఎంసీల తర్వాత వచ్చే నీటిని ఇలా క్యారీ ఓవర్‌ స్టోరేజీ కింద నిల్వ ఉంచుకోవచ్చు. అప్పట్లో 75శాతం నీటి లభ్యత కింద మూడు రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తే ప్రస్తుతం 65శాతం నీటి లభ్యత కింద కేటాయింపులు జరిపింది. దీనికింద ఈ జలాల లభ్యత 30టిఎంసీలు లభిస్తాయి. సరాసరి నీటి లభ్యత కింద మరో 120టిఎంసీలను కేటాయించింది. ఈ నీటిని ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయించడంపై ట్రిబ్యునల్‌ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.

శ్రీరాంభట్ల శశికాంత్‌