ఉపాధికల్పనలో ‘చైనా’ మందగమనమే!


Un Employment
Un Employment

అగ్రరాజ్యం బడ్జెట్‌ అంటేనే సహజంగా ప్రపంచదేశాలకు ఆసక్తిపెరుగుతుంది. ఆసియాలో అతిపెద్ద దేశంగా విస్తరించిన చైనా ప్రపంచ దేశాలపై పట్టుసాధించేందుకు అవిశ్రాంతంగా తపనపడుతూనే ఉంది. ఇరుగుపొరుగు దేశాలతో చెట్టాపట్టాల్‌ వేసుకుని ఆపైదేశాలను తన గుప్పిట్లోనికి లాక్కోవాలని చూస్తున్న చైనా ఆర్థిక వృద్ధి ఈసారి భారత్‌కంటే తగ్గిందనే చెప్పాలి. భారత్‌ ఆర్థికవృద్ధి ఈ ఏడాది 6.6శాతంగా ఉంటుందని చెపితే చైనా వృద్ధి మాత్రం 6 నుంచి 6.5శాతం మాత్రమే ఉందని అంచనావేసింది. ఇక రక్షణ వ్యయాన్నిసైతం తక్కువగాపెంచింది. 7.5శాతం మాత్రమే పెంచింది. గత ఏడాది 8.1శాతంపెరిగితే ఈ ఏడాది మరింత తగ్గించింది. రక్షణ వ్యయం కంటే ఇతర మౌలిక వనరులరంగాలపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఆర్థికవృద్ధి, వాణిజ్యం, ఎగుమతుల్లో చైనాకు ఎప్పుడూ భారత్‌ పోటీగానేనడుస్తోంది. బంగారం వినియోగంలోకూడా ప్రపంచంలోచైనా తర్వాత భారత్‌ రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. భారత్‌నుంచి అల్యూమినియం, రాగి ఎగుమతుల్లో చైనాకే సింహభాగం వెళతాయి. ఇక ఫార్మారంగ ఉత్పత్తులు సరేసరి. భారత్‌ ఆర్థికవృద్ధికంటే నిరంతరం ఎక్కువ వృద్ధితో ఉంటే చైనా ఆర్థిక వ్యూహాలే వేరుగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్యంగా వాణిజ్య ఎగుమతులు పెంచుకునేందుకు చేపట్టిన బెల్ట్‌రోడ్‌ ఇనిషియేటివ్‌, రవాణా అంతర్జాతీయ కారిడార్‌ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఇకపోతే పాకిస్థాన్‌,శ్రీలంక వంటి దేశాలకు పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులకోసం తపనపడుతున్న చైనా దేశీయంగా మాత్రం ఆర్థికవృద్ధిలో వెనకబడటానికి కారణం అమెరికాతో ఎదురవుతున్న ట్రేడ్‌వార్‌ సమస్యలేనని చెప్పాలి. రిసిప్రోకల్‌ ట్యాక్స్‌పేరిట అమెరికా చైనాకు సంబంధించిన ఉత్పత్తులపై కనీసం 25శాతం సుంకాలు విధించింది. అందుకు ప్రతిగా చైనా కూడా సుంకాలు విధించేందుకు సిద్ధం అయింది. ముందు వీటిలోభాగంగా యాపిల్‌ఫోన్లు క్రమేపీ చైనానుంచి కనుమరుగ వుతున్నాయి. ఇక దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు ఎక్కువగా అమెరికాకే వెళతాయి. అటు అమెరికా ఎక్కువ సుంకాల కారణంగా ఇతర మార్కెట్లను అన్వేషించుకోవా ల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇ-కామర్స్‌ వంటి రంగాల్లో చైనా అగ్రభాగానే ఉన్నప్పటికీ పెట్టుబడుల పరంగా తగ్గినందువల్లనే ఆర్థిక వృద్ధికి కొంత విఘాతం కలుగుతున్నదని చెప్పాలి. ముందు విదేశీ నిధుల ఆధారిత రంగాలను మరింతగా పరిపుష్టంచేసేందుకు విదేశీ ఇన్వెస్టర్లలో ఉన్న పన్ను, ఆంక్షల అపోహలను తొలగించే లక్ష్యంతో ఉంది.ఈ గణాంకాల ప్రకారంచూస్తే గత ఏడాది కంటే ఉపాధి తక్కువగానే ఉంది. చైనా రక్షణరంగ వ్యయాన్ని సుమారు 1.90 లక్షలకోట్ల చైనాయువాన్‌లుగా నిర్ణయించింది. చైనా ఏర్పడిన 70వ వ్యవస్థాపక సంవత్సరం సందర్భంగా పెద్ద గణనీయమైన మార్పులుచేర్పులు చేపట్టకపోయినా స్వీయ ఆర్థికపరిపుష్టి కోసం ప్రణాళికలు వేస్తోంది. పైగా ఈ ఏడాది చివరినాటి కల్లా 11 మిలియన్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలు నిలబెట్టుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తోంది.

గత ఏడాది 13.61 మిలియన్ల కొత్త ఉద్యో గాలు కల్పిస్తే పట్టణప్రాంతాల్లో నిరుద్యోగం 5.5శాతంగా ఉంది. గత ఏడాది 4.9శాతంనుంచి కొంతపెరిగింది. ఇక ప్రస్తుతం ఉన్న ఆర్థికవృద్ధి 6.5నుంచి 7శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ఉద్రిక్తతలను సడలించుకుని ఎగుమతులు పెంచుకునేందుకు యుఎస్‌చైనా సంప్రదింపు లను ముమ్మరం చేస్తోంది.

ఇప్పటికే ప్రతినిధివర్గంస్థాయి చర్చలు పతాకస్థాయిలో జరుగుతున్న తరుణంలో చైనా జిన్‌పింగ్‌, డొనాల్డ్‌ట్రంప్‌ల భేటీలో సత్వరమే ఓ కొలిక్కివస్తుందని అంచనా. రక్షణరంగానికి స్వల్పంగా మాత్రమే పెంచినా సంక్షేమ రంగాలకు పెద్దపీటవేస్తోంది. పేదరిక నిర్మూలనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఈ ఏడాది చివరినాటికల్లా గ్రామీణ పేదల జనాభా 10 మిలియన్లు దాటకూడదన్న లక్ష్యంతో ఉంది.

పేదరిక నిర్మూలనకోసం 18.82 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయించిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి, స్వయం ఉపాధిని పెంచేందుకు శ్రద్ధచూపిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ముసాయిదాను చూస్తే ఏటికేడాది పేదరిక నిర్మూలన నిధులు పెంచుతున్నది. అయితే పేదరికం మాత్రం అదేస్థాయిలో ఉన్నట్లు నిధుల కేటాయింపులుచెపుతున్నాయి. గత ఏడాదికంటే 18.9శాతం నిధులు పెంచిందంటే పేదరికం ఏమాత్రం తగ్గలేదనే భావించాలి. ఇక పెట్టుబడులపరంగా విదేశీ పెట్టుబడులకు ఎక్కువ మార్గాలు చూపిస్తోంది. విదేశీ పెట్టుబడుల ప్రతికూలజాబితాను గణనీయంగా తగ్గించింది. ఆసియాలో అతిపెద్దఆర్థికవ్యవస్థగా ఉన్న చైనా ఆర్థికవృద్ధిలోకూడా ఎక్కువ సవాళ్లనే ఎదుర్కొంటున్నదని చెప్పాలి. వచ్చే పదిపన్నెండేళ్లలో ఓపక్క భారత్‌ పదిలక్షలకోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ ఉన్న దేశంగా మారుతుందన్న అంచనాలతో ముందుకు పోతోంది. చైనాకు పోటీగా ఎగుమతులుసైతం కొత్తకొత్త మార్కెట్లను అన్వేషిస్తున్ననేపథ్యంలో వాణిజ్యం, ఎగుమతులపరంగా ప్రపంచదేశాల్లో ముందుండే చైనా ఈసారి అమెరికాతో ఎదుర్కొంటున్న సమస్యలే ఆర్థికవృద్ధికి అడ్డంకి అవుతున్నట్లు ఆదేశ పాలకులు గుర్తించాల్సి ఉంది. ఆదిశగా ముందు అమెరికా వంటి అగ్రరాజ్యాలతో వాణిజ్యబంధాలను పెంచుకుంటే ఆర్థికవృద్ది, నిధులవరద పరంగా కొంత సమస్యలు అధిగమించే అవకాశం ఉందని నిష్కర్షగా చెప్పవచ్చు.

దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌