ఫీజుల మోతకు అడ్డుకట్టవేయలేమా?

School Fees
School Fees

విద్యాసంవత్సరం ఆరంభమైంది. తల్లిదండ్రులకు ఫీజులవాత విద్యార్థు లకు పుస్తకాల మోత తప్పడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే ఏ మాత్రం ఎక్కువ వసూలు చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పాలకులు పదేపదే హెచ్చరిస్తున్నా కొన్ని సంస్థలకు నోటీసులు జారీ చేస్తున్నా ఇవేమీ తమకు పట్టనట్టుగా, తమనేమీ చేయలేవన్నట్టుగా కొన్ని యాజమా న్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు అయితే గత ఏడాది కన్నా ఇప్పటికీ ఫీజులు రెట్టింపు చేశాయి. మరికొన్ని చోట్ల రెండు,మూడు రెట్లు కూడా పెంచుకున్నాయి. ఈ దోపిడీ ఎల్‌కెజి నుండే ఆరంభమవ్ఞతున్నది. ఎల్‌కెజికి లక్షలాది రూపాయలు వసూలు చేసే పాఠశాలలు పుట్టు కొచ్చాయి. పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను కూడా ఇంటర్‌వ్యూలు చేసి ఆర్థిక స్థోమతలను అంచనా వేసుకొని సీట్లు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలకులోబడే తాము సీట్లు కేటాయిస్తున్న ట్లు నామమాత్రపు రసీదులు ఇస్తున్నారు. ఈ దోపిడీని భరించలేక అడిగిన ఫీజులు కట్టలేక కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. గత ఏడాది కూడా ఈ పరిస్థితి దాపురించడంతో కొందరు తల్లిదండ్రులు ఆందో ళనకు దిగారు. నిర్దిష్టమైన ఆరోపణ లతో ఏయే యాజమా న్యాలు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారో సమగ్ర వివరాలతో ఫిర్యాదులు కూడా చేశారు. దీనిపై గతఏడాది ప్రభుత్వం స్పందించి కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టారు. అయినా ఈ దోపిడీని అదుపు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టం కానీ, అధికారులు కానీ నిబంధనలు కానీ అలాంటి వారిని ఏమీ చేయలేకపోతున్నాయి. విద్యనే కాదు విద్యార్థులతో సహా అమ్ముకునే రోజులు దాపురించాయి. పుస్తకాల మోత కూడా నిబంధనలకు విరుద్ధంగా పెరిగిపోయినా కూడా పట్టించుకున్న దాఖలాలు కన్పించడం లేదు. ఇందులోనూ ఆదాయం చూసుకుంటున్న సంస్థలు లేకపోలేదు. తల్లి దండ్రులకు ధనభారం మోయలేనంతగా పెరిగిపోయింది. ఈ విద్యావ్యాపారం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాకపోయి నా ఏనాటి నుంచో ఉన్నా రానురాను పెరిగి పోవడం ఆందోళన కలిగించే అంశం. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధనల ప్రకారం కనీస వసతులు ఉన్నాయంటే అవి కాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేయడంలో హైదరాబాద్‌ నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో పాఠశాల గుర్తింపునకు సంబంధించి జీవో ఒకటిని తీసుకువచ్చారు. దానిప్రకారం ప్రైవేట్‌ విద్యాసంస్థ లకు వచ్చే మొత్తం ఆదాయంలో ఐదు శాతం మాత్రమే యాజ మాన్యానికి వస్తుంది. వచ్చిన ఆదాయంలో పదిహేను శాతం నిర్వహణ ఖర్చుకు, మరో పదిహేనుశాతం నిర్మాణ ఖర్చుకు, యాభైశాతం టీచర్ల జీతభత్యాలకు, ఇంకో పదిహేను శాతం ఉపాధ్యాయుల గ్రాట్యూటీ, పిఎఫ్‌, బీమా, తదితర అవసరాలకు కేటాయించాలి. అలాగే దరఖాస్తు ఫీజు వందరూపాయలు, ప్రవేశ ఫీజు ఐదువేల రూపాయలు వసూలు చేయాలి. ఒకవేళ విద్యార్థి పాఠశాల మానితే తిరిగి ఆ ప్రవేశరుసుమును విద్యార్థికే ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలను తొంభైశాతం పైగా పాఠశాలలు పాటించడం లేదు. లెక్కల్లో బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసి తప్పుడు నివేదికలు తయారు చేసి కోట్లాది రూపాయలు భోంచేస్తున్న పాఠశాల యాజమాన్యాలు ఎన్నో ఉన్నాయి. అలాగే కార్పొరేట్‌ విద్యాసంస్థలను నియంత్రించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2008లో జీవో 91 తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా నియంత్రణ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పరిస్థితులను బేరీజు వేసి ప్రతి మూడేళ్లకు ఒకసారి రుసుమును పెంచేందుకు వీలుకల్పించారు. ఒకవేళ ఖర్చులు పెరిగి ఏటా రుసుము లు పెంచాలనుకుంటే ఆదాయ వ్యయాలను చూపించి కమిటీ అనుమతితో ముందుకు వెళ్లాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ అసలు నియంత్రణ కమిటీ దృష్టికి వెళ్లకుండానే తమ ఇష్టానుసారంగా పెంచుకుంటున్న విద్యాసంస్థలు ఎన్నో ఉన్నాయి. విద్యాహక్కుల చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 2010లో ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఏమేరకు ఫీజు వసూలు చేయాలో పేర్కొంటూ మరొక జీవో 42ను తీసుకువచ్చారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఈ నిబంధనలను పక్కన పెట్టి యధేచ్ఛగా దోపిడీ కొనసాగిస్తుండటంతో తెలంగాణ ఆవిర్భావం తర్వాత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరొక కమిటీని వేసింది. ఆ కమిటీ ఈ విషయంలో సుదీర్ఘ అధ్యయనం చేసి అనేక సూచనలు ఇచ్చి జోనల్‌ స్థాయిలో రుసుముల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేశారు. అయినా ఆదాయ,వ్యయాల వివరాలను సమర్పించే పాఠశాల యాజమాన్యాలు సగం కూడా లేవ్ఞ. విద్యార్థుల నుంచి వసూలు చేసే సొమ్ములో యాభై శాతం ఉపాధ్యాయుల జీతాలకే వెచ్చించాలని నిబంధనలో స్పష్టంగా ఉన్నా అవి చాలా యాజమాన్యా లు అమలు చేయడం లేదు. వాస్తవంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకుల కన్నా ప్రైవేట్‌ పాఠశా లల్లో పనిచేసే అధ్యాప కులకు పనిభారం రెండుమూడు రెట్లు ఎక్కువగాఉంటుంది. అయినా వారి శ్రమకు తగిన ప్రతిఫలం అందడం లేదు. విద్యార్థుల నుంచి పన్నెండు నెలల పాటు ఫీజులు వసూలు చేస్తున్నా కొన్ని పాఠశాల యాజమాన్యాలు కేవలం పదినెలలు మాత్రమే అధ్యాపకు లకు జీతాలు చెల్లిస్తున్నారు. ఈ విద్యావ్యాపారాన్ని గూర్చి పాలకులకు తెలియంది ఏమీ లేదు. అంతా బహిరంగమే. ఆయా విద్యాసంస్థల్లో చదివిన వారిని, చదువ్ఞకొంటున్నవారిని ఎవరిని అడిగినా కథలుకథలుగా చెప్తారు. ఇప్పటికైనా పాలకులు కళ్లుతెరవాలి. బాలబాలికలను భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యావ్యవస్థను ఇంతటి దారుణ పరిస్థితుల్లోకి నెట్టడం దురదృష్టకరం. మారిన పరిస్థితులకు అనుగుణంగా పటిష్టమైన చట్టాలు రూపొందించాలి. విద్యను వ్యాపారంగా చూసేవారిపై ఉక్కుపాదం మోపాలి.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌