నిరర్థకంగా మారిన ఫిరాయింపుల చట్టం!

`law
law

అ ది 1967వ సంవత్సరం. పార్లమెంటు, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు నగరా మోగింది. హర్యానా రాష్ట్రంలోని హూస్నాపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గ సిట్టింగ్‌ శాసనసభ్యుని పేరు గయాలాల్‌. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌పార్టీలో సీటు లభిస్తుందన్న నమ్మకం లేక ఒక రోజు వ్యవధిలో మూడు పార్టీలు మారాడు. గయాలాల్‌ ఫలానా పార్టీలో చేరాడు అని చెప్పుతుండగానే మరో పార్టీలోకి మారి నట్టు వార్తలు రావడంతో ఆయారామ్‌.. గయారామ్‌ (గయా వచ్చాడు.. వెళ్లాడు) అంటూ ఛలోక్తి వాడుకలోకి వచ్చింది. నిజా నికి నాయకులు పార్టీలు మారడం కొత్త కాకపోయినా 1970 తర్వాత నేతల బేరసారాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. జనతా పార్టీ ఆవిష్కరణ, జనతాపార్టీ పతనం సందర్భంగా కేంద్రంలో ఏర్పడిన వివిధ ప్రభుత్వాల సమయంలో, ఆ తర్వాత మరల ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పడం కష్టంగా ఉండేది. ఆనాడు నేతల పార్టీ మార్పిడి విధానంపై పెద్దఎత్తున విమర్శలు తలెత్తా యి. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి రికార్డుస్థాయిలో మెజారిటీ లభించడమే కాకుండా రాజీవ్‌ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. తల్లి మరణాంతరం రాజకీయాలలోకి కొత్తగా ప్రవేశించిన రాజీవ్‌ గాంధీ తనకు లభించిన అసాధారణ మెజారిటీని ఆసరా చేసుకొని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా 10 షెడ్యూల్‌ చేర్చి యాంటి డిఫెక్షన్‌ లా (పార్టీ మార్పిడి నిరోధక చట్టాన్ని) అమల్లోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం చట్టసభలకు పార్లమెంటు లేదా అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులుతాము ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. తాను ఎన్నికైన పార్టీని వదిలి వేరే పార్టీలోకి మారినా, చట్టసభల లో పార్టీ విప్‌ల ఉత్తర్వులను పాటించకపోయినా, పార్టీ నిర్ణయా నికి విరుద్ధంగా సభలో ఓటు వేసినా తమ సభ్యత్వాన్ని కోల్పో తారు. భారతదేశంలో ఎంత గొప్పచట్టం చేసినా ఎక్కడో ఒక చోట చట్టానికి రంధ్రం ఉంటుందనే నానుడి ప్రకారం ఈ చట్టాని కి కూడా కొన్ని మినహాయింపు ఇచ్చారు. ఎన్నికైన ఆ ప్రజాప్రతినిధి వ్యక్తిగతంగా కాకుండా కొంత మంది కలిసి సమూ హంతో అంటే మొత్తం సభ్యులలో మూడింట ఒక వంతు మంది కలిసి గుంపుగా పార్టీ మారిన పక్షంలో ఈ చట్టం వర్తించదు. ఈ మినహాయింపు చివరకు ఎంతో ఉన్నత ఆశయం ఏర్పాటు చేసిన పార్టీ మార్పిడి నిరోధక చట్టాన్ని నిరర్థకంగామార్చుతోంది. మూడింట ఒకవంతు 1/3 అంటే ఎవరికి వారే సులభంగా పార్టీ మారుతున్నారనే ఉద్దేశ్యంతో 2003వ సంవత్సరంలో చట్టాన్ని 1/3 బదులుగా మూడింట రెండువంతుల 2/3 మందిగా సవరణ చేశారు. అయినా ఎటువంటి ప్రయోజనం లేకుండాపో యింది. అంతేకాకుండా ఈ చట్టం మొత్తం లోక్‌సభ, విధాన సభల స్పీకర్‌ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. సభలోని సభ్యుడు తాను ఎన్నికైన పార్టీని వదిలి వేరే పార్టీలోకి మారినా, చట్టసభలలో పార్టీ విప్‌ల ఉత్తర్వులను పాటించకపోయినా, పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా సభలో ఓటు చేసినా ఆ విషయాన్ని ఆయా పార్టీ అధ్యక్షులు లేదా చీఫ్‌ విప్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదుపై స్పీకర్‌ విచారణ చేసి పార్టీ మారిన సభ్యుడిని కొనసాగించాలా లేదా అనర్హుడిగా ప్రకటిస్తారు. స్పీకర్‌పై ఒత్తిడి చేసే అధికారం కోర్టులకు కూడా లేదు. చట్టసభ లలో స్పీకర్‌ పార్టీరహితంగా వ్యవహరించాలన్న నిబంధన ఉంది. కాని స్పీకర్‌గా పోటీ చేసే వ్యక్తి కూడా ఒక పార్టీ నుంచి ఎన్నిక కావడం, ఆ పార్టీ సహాయంతోనే స్పీకర్‌గా ఎన్నికైన నాయకుడు పార్టీరహితంగా వ్యవహరిస్తారనుకోవడం అత్యాశే అవ్ఞతుంది. ఈ కారణంగానే కేంద్రంలో, రాష్ట్ర విధాన సభలలో నేతల బేరసారా లు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. రాజీవ్‌ గాంధీమరణాంతరం కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రధాన మంత్రి బాధµ్యతలు స్వీకరించిన పి.వి. నరసింహారావ్ఞ హయాం లో పార్టీ మార్పిడి నిరోధక చట్టం మరింత దిగజారిందని చెప్పవచ్చు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల సంఖ్య 232 మంది మాత్రమే. అధికారం చేపట్టాలంటే కనీసం 273 స్థానాలు కావాలి. ఆనాడు పి.వి. నరసింహారావ్ఞ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ లేదు. 1993లో పి.వి నరసింహారావ్ఞపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వందల కోట్ల రూపాయలు చేతులు మారడం, జార్ఖండ్‌ ముక్తి మోర్చ (జెఎంఎం) ముడుపులు కేసు విషయం గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా పి.వి మెజారిటీ సంపాదించడంలో భాగంగానే ఆనాడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ నుంచి ఎన్నికైన తొమ్మిది మంది సభ్యులలో అయిదుగురు సభ్యులు పార్టీ నుంచి గ్రూపుగా చీలిపోయి కాంగ్రెస్‌పార్టీలో చేరిపోయారు.
ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేసే విధంగా ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు పార్టీ మార్పిడి చట్టంలో స్పీకర్‌కు ఉన్న అధికారాన్ని ఆసరా చేసుకొని ప్రతిపక్ష సభ్యులను నయానా భయానా ఇచ్చి తమవైపు తిప్పుకొంటున్నారు. ఆ విధంగా సభ్యులను తమవైపు తిప్పుకోవడాన్ని ముద్దుగా ‘ఆకర్ష అని పేరు పెడుతున్నారు. తాను ఏం చేసినా ప్రశ్నించేవారు ఉండకూడదనే రీతిలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదనే ఆలోచనలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా రాష్ట్ర విభజన అనంతరం కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే తరహా ఆలోచనలు చేశారనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసనసభ్యులు పెద్దఎత్తున తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా నిలుపు కోవడం కూడా కష్టమని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయి మే 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రాజకీయ పార్టీనేతలు మాత్రం తమకు మెజారిటీ సంపాదించడం కోసం ఎవరిని ఏవిధంగా ఆకర్షించా లనే ఆలోచనలలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యం లో అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే ముఖ్యం. చట్టసభలలో చట్టాలు చేసే సమయంలో ప్రజాభిప్రా యం ప్రతిస్పందించాలంటే అర్థవంతమైన చర్చలు జరగాలి. పార్లమెంట్‌లో హిరేన్‌ ముఖర్జీ, పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్‌, ఎస్‌.ఎ.డాంగే వంటి నేతలు ప్రతిపక్ష నాయకులు చేసిన ప్రసంగాలతో సమర్థవంతమైన చట్టాలు రూపొందారు.చట్టసభలలో అర్థవంతమైన చర్చలు జరగాలంటే బలమైన, బాధ్యత కలిగిన ప్రతిపక్షం ఉండాలి. చట్టసభలు నీతినియమాలకు, ప్రజాభిప్రాయానికి అద్దంపట్టేలా ఉండాలంటే పార్టీ మార్పిడి చట్టాన్ని లోసుగులు లేకుండా పటిష్టం చేయడం ఒక్కటే మార్గం. కాని ప్రజోపయోగమైన చట్టాలను రూపొందించాల్సిన చట్టసభలలోని నాయకులే ఆకర్ష పథకాలు నిర్వహిస్తున్నప్పుడు పటిష్టమైన చట్టం వస్తుందనుకోవడం అత్యాశే అవ్ఞతుంది.

  • అన్నవరపు బ్రహ్మయ్య