ఓటింగ్‌ హక్కులపై ఐఎంఎఫ్‌ అంతర్మథనం!

IMF
IMF

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే ఐఎంఎఫ్‌ నిధుల కోటా, ఓటింగ్‌ అంశాలపై సభ్యదేశాలు విభేదిస్తున్నాయి. అత్యధిక వాటా కలిగిన అమెరికా ఓటింగ్‌ హక్కులు వదులుకునేందుకు ఇష్టపడటంలేదు. ఐఎంఎఫ్‌కు సభ్య దేశాల నుంచి సుమారు లక్షకోట్ల డాలర్ల నిధులు అందు తుంటాయి. అమెరికా ఈ నిధుల్లో అతిపెద్ద వాటాతో ఉంది.ఓటింగ్‌ హక్కులు పునఃసమీక్ష చేయడంవల్ల చైనాకు ప్రయోజనం అవుతుందని దీనివల్ల అమెరికాకే కాకుండా సభ్యదేశాలకు ప్రయోజనాలు దెబ్బతింటాయన్న వాదన తెస్తోంది.ఈ వారంలోజరిగిన సమావేశాల్లో ఇదే ఇప్పుడు అత్యవసరంగా ప్రస్తావనకు వచ్చింది. ప్రపంచదేశాలపై ఆధిపత్యంతో వ్యవహరించే అమెరికా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై తన పెత్తనాన్ని వదులుకునేందుకు సుతరామూ ఇష్టపడదు. అందులోనూ ట్రంప్‌ అధ్యక్షుడిగా వచ్చాక ఈ పరిరక్షణ వాదం మరింత పెరిగింది. వాస్తవానికి 1998 నుంచి అమలులో ఉన్న రెన్యువల్‌ నిధుల యంత్రాంగమే అంటే కొత్త పరపతి ఏర్పాటు అమలుచేస్తూ వస్తున్నారు. ద్వైపాక్షిక నిధుల సమీకరణ కింద సభ్యదేశాలనుంచి రాబడుతోంది.

2008 ఆర్థిక సంక్షోభం తర్వాత తన రుణపరపతి సామర్ధ్యాన్ని సైతం పెంచుకుంది. ఐఎంఎఫ్‌ కోటాలను నాలుగంచెల విధానంలో ఆయా దేశాలకు కేటాయింపులు జరుపుతారు. ఆ దేశ జిడిపి ఆధారంగా కోటా నిర్ణయం జరుగుతుంది. ఆర్థిక స్తోమత, అంతర్జా తీయ రిజర్వులను సైతం పరిగణనలోనికి తీసుకుని కోటా లను నిర్ణయిస్తారు.

ఇక కొందరు సభ్యదేశాల ప్రతినిధులు మాత్రం ఐఎఎంఫ్‌లో సంస్కరణలు తీసుకురావాలని కొంతకాలంగా పట్టుపడుతున్నారు.చైనా,భారత్‌లుఇప్పుడు ప్రపంచంలో ఆర్థికవృద్ధిపరంగా పోటీపడుతుండటంతో ఐఎంఎఫ్‌లో కూడా సంస్కరణలు రావాలని పట్టుబడుతు న్నారు. ఇప్పటివరకూ చూస్తే ఐఎంఎఫ్‌లో భారత్‌కోటా 2.76శాతంగా ఉంది. చైనా 6.41శాతం, అమెరికా కోటా మాత్రం 17.46శాతంగా ఉంది. దీనితో అమెరికా ఓటింగ్‌ హక్కులు కూడా 16.52శాతంగా ఉన్నాయి. అంతేకా కుండా కీలక నిర్ణయాల్లో వీటో అధికారాలు కూడా ఉన్నా యి.ఇప్పుడు ఓటింగ్‌ విధానం, హక్కులు, నిధులకోటా లను మారిస్తే చైనాకు ప్రయోజనం ఎక్కువ ఉంటుందని అమెరికా తీవ్రంగా అడ్డుకుంటున్నది. ప్రతి ఐదేళ్లకోసారి సభ్యదేశాల కోటాలను ఐఎంఎఫ్‌లో సమీక్ష చేస్తారు.

14వ సమీక్ష పరంగాచూస్తే 2010లో పూర్తిచేసింది. అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. 2016వరకూ ఈ సమీక్ష పూర్తికాలేదు. ఆ సమీక్ష సమయంలోనే భారత్‌కు ఓటింగ్‌ వాటా కూడా పెరిగింది. ప్రస్తుతం 15వ కోటా సమీక్ష కొనసాగుతోంది. ఈలోపే ఐఎంఎఫ్‌ పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాలని, 16వ కోటా సమీక్షలోపే సంస్కరణలు పూర్తికావాలని కొన్ని సభ్యదేశాలు పట్టుబడుతున్నాయి. ఈ సమీక్షను 2020 నుంచి 2023 డిసెంబరు వరకూ కూడా కొనసాగించేం దుకు వీలుగా కొత్త కోటా మార్గదర్శకాలు రావాలని కోరుతున్నాయి.

ఇప్పటికిప్పుడు సంస్కరణల కంటే ముందు ఐఎంఎఫ్‌ వనరులకు సంబంధించి ఆయా దేశాల కోటాలను సమీక్షించాల్సిన అవసరం ఉంటుందని, అగ్రరాజ్యాల ఆర్థికవ్యవస్థలకు అనుగుణంగా కోటాలు నిర్ణయిస్తే వర్ధమాన దేశాలు, చిన్న దేశాల హక్కులను హరించినట్లవుతుందని ఈదేశాల సమాఖ్యలు వాదిస్తు న్నాయి.అంతర్జాతీయంగా ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చే సంస్థగా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లపేర్లే ముందుకు వస్తాయి. 189 దేశాలసభ్యుత్వం ఉన్న ఈ సంస్థ విశ్వ వ్యాప్తంగా పేదరిక నిర్మూలన, ఉపాధికల్పన, సుస్థిర ఆర్థికవృద్ధి సంస్థ లక్ష్యాలుగా పనిచేస్తుంది.లక్షకోట్ల డాలర్ల వరకూ ఐఎంఎఫ్‌ సభ్యదేశాలకు పరపతిని అందించే వీలుంది.ప్రస్తుతం 36రుణపరపతి ఒప్పందాలు కొనసాగి స్తోంది.అల్పాదాయం ఉన్న దేశాలకు వడ్డీలేని రుణాలను సైతం అందిస్తుంది.అంతేకాకుండ ఆసభ్య దేశాల రిజర్వు లను పరిరక్షించేందుకుగాను ఐఎంఎఫ్‌ అంతర్జాతీయంగా స్పెషల్‌డ్రాయింగ్‌రైట్స్‌ జారీచేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేటాయింపులు 283 బిలియన్‌ డాలర్ల ఎస్‌డి ఆర్‌లు జారీచేసింది.

సంస్థ నుంచి ఎక్కువగా అర్జంటైనా, ఉక్రెయిన్‌, గ్రీస్‌, ఈజిప్టు దేశాలు పరపతిని అందుకున్నా యి. మెక్సికో కొలంబియా, మరాకోదేశాలకు ముందస్తు అవసరాలకు రుణాలిచ్చింది.మొత్తంగాచూస్తే సుమారు 661 బిలియన్‌డాలర్లుగా ఉన్న నిధులవనరుల కోటాలను మార్పు చేసేందుకు సైతం అగ్రరాజ్యాలు అంగీకరించడం లేదు. ఐఎంఎఫ్‌లో ఉన్న 24మంది డైరెక్టర్లబోర్డు నిధుల సమీకరణ కోటాలను నిర్ణయిస్తుంది.పాలనా సంస్కరణలు రావాలని చిన్న,మధ్యతరహా దేశాలు డిమాండ్‌ చేస్తున్నా అమెరికా మోకాలొడ్డుతున్నట్లు ఇప్పుడున్న పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. చైనాతో వాణిజ్యపరంగా తరచూ విభేదిస్తున్న అమెరికా ఇప్పుడు యూరోపియన్‌ కూటమి తో కూడా ట్రేడ్‌వార్‌కు దిగింది. ఈనేపథ్యంలో ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ వంటిసంస్థల్లో తనకున్న ఆధిపత్యం నిరూపించుకోవాలంటే నిధుల వాటాశాతం ఎక్కువ ఉండాల్సిందే.

ఆ దిశగానే ఇప్పుడు అమెరికా ఆలోచించి పాశ్చాత్య ఆధిపత్యం వీగిపోకుండా పరిరక్షించుకుంటూ వస్తోంది. నిధుల సౌలభ్యత పరంగాచూస్తే ఐఎంఎఫ్‌ సైతం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆసియా, ఆగ్నేయాసి యా దేశాలతోపాటు అగ్రరాజ్యాలను సైతం సమన్వయం చేసుకుంటూ సుస్థిర అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లేందుకు వీలుగా ఉన్న వనరులను సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లాల్సి వస్తున్నందున ఓటింగ్‌ హక్కులపరంగా ఆచితూచి వ్యవహరించిందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/