సాహో! ప్రపంచ బ్యాడ్మింటన్‌ బాహుబలి!

p.v.sindhu
p.v.sindhu


తెలుగు తేజానికి ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌!’ఎన్నాళ్లో వేచిన ఉదయం కిందటి ఆదివారం రానే వచ్చింది.! ఎంత తీయని కబురు! తెలుగువాడి గుండె ఆనంద ఆత్మవిశ్వాసాలతో కదనుతొక్కింది! కిందటి సారి 2016 రియోడిజెనీరో ఒలింపిక్స్‌లోనే ‘స్వర్ణం రావచ్చుననుకుంటే ‘రజతంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది! అయినా, అక్కడికి అది గర్వకారణమే. అంతకు పూర్వం లభించినవి రెండు కాంస్య పతకాలే. అయితే సింధు అంతటితో సరిపెట్టుకోలేదు. అలా సరిపెట్టుకుంటే, తెలుగుతేజం ఎలా కాగలదు? ‘ఓటమికి కుంగిపోకు, విజయానికి పొంగిపోకు అన్న గీతాకారుని మహాత్సూక్తిని ఆమె మననం చేసుకున్నది. ఈసారి ప్రపంచం మెచ్చే, భారతీయులు గర్వించే, తెలుగువారు పొంగిపోయే విజయాన్ని సాధించింది! ‘జగజ్జేత సింధు అయింది!
అయితే, ఆ విజయం సామాన్య షట్లర్‌పై కాదే! రెండేళ్లక్రితం ఇదే టోర్నీలో తనను ఓడించిన జపాన్‌ ఛాంపియన్‌ షట్లర్‌ ఒకుహార పైనే! మరొకరైతే, తాను ఓటమిపొందిన వారిపైనే తలపడ్డానికి గుండెచాలదు. గుబగుబలాడుతుంది! ఆ వెన్ను చూపేతత్వం ఈ తెలుగుతేజానికి లేదు. కనుకనే, ఆమె జగజ్జేత అయింది!
ఇది ఆమె కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు కూడా దక్కలేదే! ఈ దెబ్బతో సింధు గురువ్ఞను మించిన శిష్యురాలు అయింది. ఆమెకంటే సీనియర్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌కు కాని, నిన్నటితరం దిగ్గజం ప్రకాష్‌పడుకోన్‌కు కాని దక్కని అఖండ గౌరవమిది!
కృష్ణాజిల్లా ముద్దుబిడ్డ
జగద్విజేత సింధు తల్లిదండ్రులు కృష్ణాజిల్లావారే. ఆమె తండ్రి రమణరావ్ఞ విజయవాడలోని కృష్ణలంకనివాసి. ఆయన చదువ్ఞసంధ్యలు విజయవాడలోనే. తల్లి విజయది కృష్ణాజిల్లా ఘంటసాల మండలం దేవరకోట. సింధు బంధుకోటి చాలా మంది విజయవాడలోనే వ్ఞంటారు. అందువల్లనే, ఆమె తల్లిదండ్రులు తరచుగా విజయవాడ వచ్చి వెడుతుంటారు.
‘అమ్మకే ఈ పతకం అంకితం
విచిత్రం! సింధుకు ఈ ప్రపంచ గౌరవం దక్కిన రోజునే ఆమె తల్లి విజయ జన్మదినోత్సవం. మాతృమూర్తికి జన్మదినోత్సవ బహుమతిగా ఏమిపంపిద్దామా? అని యోచిస్తున్న సింధు తనకు లభించిన అంతర్జాతీయ కాన్క స్వర్ణపతకాన్నే అంకితమిచ్చింది.
ఇలాంటి సంఘటనే ఇటీవల జరిగింది. జ్ఞాపకం వచ్చిందా, పాఠకమహాశయులారా? ‘మహానటి సావిత్రిలో కథానాయిక పాత్ర ధరించిన కీర్తిసురేష్‌ తనకు లభించిన ‘ఉత్తమ నటి అవార్డును కూడా తల్లి మేనకకు అంకితమిచ్చింది! ఔను! అమ్మలేనిదే సింధు ఎక్కడ వ్ఞండేది? కీర్తి సురేష్‌ కీర్తికి కూడా అంతేకదా! కాని, ఈ రెండు సంఘటనలు చూస్తూవ్ఞంటే ‘ ఏ సన్‌యీజ్‌ ఏ సన్‌టిల్‌ హిగెట్స్‌ ఏ వైఫ్‌, ఏ డాటర్‌ యీజ్‌ ఏ డాటర్‌ ఆల్‌ హర్‌ లైఫ్‌ అన్న ఇంగ్లీషు సూక్తి నాకు జ్ఞాపకం వస్తున్నది!
‘భారతరత్న
మరి, దేశానికే ఇంత గౌరవం తీసుకువచ్చిన సింధుకు భారత ప్రభుత్వం ఏమి గౌరవం ఇవ్వబోతున్నది? క్యాష్‌ అవార్డా? అది చాలామంది ఇప్పటికే ఆమెకు ప్రకటించారు. జాతికి ఇంత గౌరవం ఖ్యాతి తీసుకువచ్చిన ఈ భారతరత్నానికి ఇవ్వదగిన జాతీయ బహుమతి- ‘భారతరత్న అవార్డు మాత్రమే. దానికి అనువైన సమయం వచ్చే జనవరి 26 రిపబ్లిక్‌ దినోత్సవమే!