బోయింగ్‌ అంటేనే భయం..భయం..!

Boeing 737 Max
Boeing 737 Max

ప్రపంచ వ్యాప్తంగా విమానాల కూలిపోతున్న సంఘటనలు గడచిన ఐదేళ్లలో భారీగాపెరిగాయి. తాజాగా గత ఆదివారం ఇథియోపియా ప్రభుత్వ ఎయిర్‌లైన్స్‌ విమానం కూలిపోవడంతో విమాన తయారీ సంస్థలకు గడ్డుసమస్యలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి ప్రపంచ ఏవియేషన్‌ మార్కెట్‌లో 80శాతానికిపైబడిన వాటాతో నడుస్తున్న బోయింగ్‌ విమాన తయారీ సంస్థకు ఈ ప్రమాదం అనుకోని సమస్యలు తెచ్చిపెట్టింది. గడచిన వారంరోజుల్లోనే ప్రపంచ దేశాల్లో బోయింగ్‌ విమానాలను ఎక్కడికక్కడ నిలిపివేసాయి. అమెరికా, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, చైనా, భారత్‌దేశాలు ఈ విమానాలను అత్యధిక సంఖ్యలో నిలిపివేసాయి. బోయింగ్‌ 787 మాక్స్‌ విమానం కూలిపోయి సుమారు 157 మందికిపైగా మృతిచెందారు.

విమాన ప్రమాదానికి గలకారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అడ్డిస్‌ అబాబాకు 60 కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ క్షేత్రాల్లో కూలిపోయిన విమాన శకలాలనుంచి బ్లాక్‌బాక్స్‌ వగైరాలను సేకరించినా ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్లనేనని ప్రాథమికంగా వెల్లడి అయింది. గత ఏడాది కూడా లయన్‌ ఎయిర్‌ విమానయానసంస్థకు సంబంధించి ఇండోనేసియాలో బోయింగ్‌ విమానమే కుప్పకూలింది. వరుసగా ఐదేళ్లలోనే విమానప్రమాదాలు చోటుచేసుకంటుండటంతో భద్రతపై ఆయా దేశాలు ఇపుడు కలవరపడుతున్నాయి. ఈ వారంరోజుల్లోనే బోయింగ్‌ సంస్థకు 25బిలియన్‌ డాలర్లవరకూ నష్టం వాటిల్లిందంటే ఏమేరకు సంస్థ విమానాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయో తెలుస్తోంది.

ఇతర దేశాలతోపాటు బోయింగ్‌ స్వదేశం అయిన అమెరికాలో కూడా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు సైతం బోయింగ్‌ విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా బోయింగ్‌ విమానాలకు ఏవియేషన్‌ రంగంలోని వివిధ ఎయిర్‌లైన్స్‌సంస్థలుసైతం కొత్త విమానాలకు ఆర్డర్లివ్వడం మానేసాయి. బోయింగ్‌ 737 మాక్స్‌8 విమానాలు రెండుప్రమాదానికి లోనయినప్పటినుంచి ఎనిమిది, తొమ్మిది వెర్షన్లను కూడా కంపెనీలు వివిధ రూట్లలో నిలిపివేసాయి. సుమారు 45 అంతర్జాతీయ పౌరవిమానయానసంస్థలు సభ్యదేశాలు ఇప్పటికే ఆర్డర్లిచ్చినవాటిని నిలతిపివేసాయి.

చైనా, ఇండోనేసియా, జర్మనీ, యుకె, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌,కెనడాదేశాలు మొత్తం బోయింగ్‌ విమానాలను నిలిపివేసాయి. ఈ రెండు విమాన ప్రమాదాలపై విచారణపూర్తయ్యేసరికి కొన్నేళ్లు పడుతుందని, విచారణకు సాంకేతిక లోపమా లేక మానవతప్పిదమా అన్నది నిర్ధారించేందుకే మరింత వ్యవధి పడుతుందని చెపుతున్న తరుణంలో ప్రస్తుతం విమానాలను మొత్తం నిలిపివేయడం వల్ల కొన్ని ఎయిర్‌లైన్స్‌కు లీజుబకాయిలు నిలిచిపోయాయి. మరికొన్ని ఎయిర్‌లైన్స్‌కు వివిద రూట్లలో ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోయింది. అమెరికాపరంగాచూస్తే ఈస్టర్‌, విద్యాసంస్థలకు సెలవులు వస్తున్నందున ప్రయాణాల రద్దీకూడా పెరుగుతున్న తరుణంలో బోయింగ్‌ నిలిపివేత ఇపుడు ఆకంపెనీకి ఆర్ధిక భారం పెంచడమే కాకుండా ఇతర ఎయిర్‌లైన్స్‌సంస్థలకు నష్టాలను పెంచుతున్నది.

ఎయిర్‌చైనా, చైనా ఈస్ట్రన్‌, చైనా సదరన్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, సౌత్‌వెస్ట్‌ వంటి సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమతమ కస్టమర్లను చేరవేస్తున్నాయి. ఇక తక్కువధరల విమానయాన సంస్థలు తమతమ సామర్ధ్యాన్ని పరిమితంచేసుకుని ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకుంటున్నాయి. ఇక సిల్క్‌ఎయిర్‌, ఫిజి ఎయిర్‌వేస్‌ వంటివాటికి రెండేసి బోయింగ్‌మాక్స్‌ విమానాలున్నాయి. ఈ విమానాలను నిలిపివేస్తే మొత్తం సామర్ధ్యంలో 16 శాతం నష్టపోతామని కూడా ఆసంస్థలు వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటివరకూ వైమానికరంగంలో బోయింగ్‌, ఎయిర్‌బస్‌లు మాత్రమే గుత్దాఙపత్యంలో ఉన్నాయి. మొత్తం విమానాల ఆర్డర్లలో 99శాతం ఈ రెండుసంస్థలకే అందుతుంటాయి.

గడచిన కొన్ని దశాబ్దాలుగా వాతావరణసమస్యలపై కొన్ని ప్రమాదాలు జరగడంతో డిజైన్‌ మొత్తం మార్చి ఉత్పత్తి,సేవలను సైతం మార్పుచేసాయి. గత ఏడాది బోయింగ్‌ 806 విమానాలను డెలివరీ ఇచ్చింది. ఎయిర్‌బస్‌ మరో 800 విమానాలు డెలివరీ ఇచ్చింది. అన్నింటికంటే బోయింగ్‌ 737 మాక్స్‌కు డిమాండ్‌పెరిగింది. మార్కెట్‌ వాటా కూడా పెరిగింది. ఈపరిస్థితి ఇలా ఉంటే ప్రమాదాల్లోని మృతులకు పరిహారం చెల్లించడంతోపాటు వారి బీమా క్లెయింలను కంపెనీలు భరించాల్సి ఉంటుంది. బోయింగ్‌కు ఇపుడు 157 మందికి చెల్లించాల్సినపరిహారమొత్తం కూడా భారీస్థాయిలోనే భరించాల్సి ఉంటుంది. ప్రమాదాలు జరగడం ఒక ఎత్తయితే ఆయా కంపెనీలు ఈ నష్టంనుంచి కోలుకోవడానికి మరికొన్నేళ్లుపడుతున్నది.

ప్రమాదాలపై విచారణజరిగి అసలు కారణాలు తెలిసేసరికి పుణ్యకాలం కాస్తా గడచిపోతున్నది. విమానప్రమాదాలు ఎక్కువగా సాంకేతికలోపాలతో కొన్ని అయితే, పైలట్‌ల అనుచిత వైఖరివల్ల మరికొంతజరుగుతున్నట్లు ఇటీవలికాలంలోని విచారణలు చెపుతున్నాయి. అదే విధంగా ఒక్క విమానం కూలిపోవడంతోప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థ విమానాలను నిలిపివేసిన సంఘటనలు చరిత్రలో అత్యంత అరుదుగా మాత్రమే జరిగాయి. ప్రస్తుతం బోయింగ్‌ సంస్థ అదేపరిస్థితిని ఎదుర్కొంటున్నదనడంలో ఎలాంటి సందేహంలేదు. ఉన్న నష్టాన్ని పూడ్చుకోవడం ఒక ఎత్తయితే ప్రపంచదేశాల్లో మళ్లీ విమానాలను డెలివరీచేయడంద్వారా మార్కెట్‌ను స్థిరపరుచుకోవడం బోయింగ్‌కు ఇపుడు తలకుమించిన భారమే అవుతుందని నిష్కర్షగా చెప్పవచ్చు.

  • దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌