పేదల పథకాలు పెద్దలపాలు చేయొద్దు

Govt. Subsidy Schemes
Govt. Subsidy Schemes


దారిద్య్రరేఖకు దిగువన ఉండి ఆకలితో అలమటిస్తున్న పేదలకు కొంతలో కొంత సహకారం అందించి ఆదుకునే పవిత్ర ఆశయంతో ప్రవేశపెట్టిన ప్రజాపంపిణీ వ్యవస్థ రాజకీయ సుడిగుండంలో చిక్కుకొని దశాబ్దాల తరబడి కొట్టుమిట్టాడుతున్నది. మితిమీరిన రాజకీయ జోక్యం, అవినీతి,ఆశ్రిత పక్షపాతం, దళారుల ఆధిపత్యం తో పేదల కంటే పెద్దలకే ఈ వ్యవస్థ కల్పతరువ్ఞగా మారుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి అటు మహారాష్ట్ర, ఇటు తమిళనాడుకు ఈ పేదల బియ్యం తరలిపోతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుడ ప్పుడు పట్టుబడుతున్నా ఏదో నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకోవడంతో ఈ అక్రమ రవాణా అంతకంతకు పెరిగిపోతున్నది. మరొకపక్క కొందరు రైస్‌ మిల్లర్లు ఈ బియ్యానికి మళ్లీ పాలిష్‌ చేసి మార్కెట్లోకి దించుతున్నారు. ప్రభుత్వానికి సమాచారం అందినప్పుడు దాడులు చేసి కేసులు పెడుతున్నప్పుడు తాత్కాలికంగా ఇవి కొంతమేరకు ఆగుతున్నా ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికితోడు అసలు వాస్తవంగా ఎంతమంది పేదలున్నారో కూడా తెలియకుండాపోయింది. ఈ పార్టీ, ఆ పార్టీ తేడా లేకుండా అధికారంలో ఉన్నప్పుడు విచక్షణారహితంగా కేవలం రాజకీయ ప్రయోజనాల ఆశతో కార్డులను పంపిణీ చేసి మొత్తం పౌరసరఫరాల వ్యవస్థనే అస్తవ్యస్తం చేశారు. ఒకపక్క పేదల అభ్యున్నతికి, సంక్షేమానికి వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వారిని దారిద్య్రరేఖ నుంచి దాటించేందుకు ఎనలేని కృషి చేస్తున్నట్లు అంకెలతోసహా వివరిస్తున్నా కుటుంబాల సంఖ్య చూస్తే ఈ నిధులు ఏమైపోతున్నాయనే ఆందోళన కలగకతప్పదు. ఒకపక్క స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గ్రామీణాభివృద్ధికి దేశవ్యాప్తంగా చూసినా లక్షలాది కోట్లు అనేక పథకాల ద్వారా వెచ్చించారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కోట్లాది మందికి ఆసరా కల్పించి వారిని దారిద్య్రం నుండి గట్టెక్కించినట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అంకెలతో సహా వివరిస్తున్నది. పేదరికం తగ్గుతున్నట్లు ఆ శాఖ నివేదికల మీద నివేదికలు ఇస్తున్నది. మరొకపక్క పౌరసరఫరాలశాఖ పేదలకు ఇస్తున్న తెల్లకార్డుల సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోతున్నది. రెండూ ప్రభుత్వ విభాగాలే. ఆ విభాగాలే పరస్పర విరుద్ధమైన లెక్కలతో నివేదికలు సమర్పిస్తున్నాయి. ఇందులో ఏది సత్యం? ఏది అసత్యం? అనే విషయంలో పాలకులు వాస్తవాలు బయటకి చెప్పరు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బినామీ పేర్లతో లక్షలాది తెల్లకార్డులు పుట్టుకొస్తున్నాయి. చివరకు బినామీ పేర్లతో రేషన్‌ దుకాణాలను కూడా నడుపుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. 2017లో ఈ బినామీ డీలర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో సర్వే ఆరంభించారు. ప్రాథమిక దశలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ తదితర జిల్లాల్లో 1500లకుపైగా దుకాణాలకు సంబంధించి అసలు వ్యక్తులెవరో? బినామీలెవరు? గుర్తించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాక్స్‌ఫోర్స్‌కు చెందిన అధికారులతో ఐదు బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. కొందరు డీలర్లు ఐదునుంచి ఏకంగా 20 దుకాణాల కుపైగా నడుపుతున్నట్లు ఆ శాఖకు స్పష్టమైన సమాచారం అందింది. ఆ తర్వాత ఎందుకోఏమో కానీ ఆ తనిఖీలు, చర్యలు ఆగిపోయాయి. పౌరసరఫరాశాఖ రాజకీయ సుడి గుండంలో కొట్టుమిట్టాడుతుందనే ఆరోపణలకు ఇలాంటి చర్యలు బలం చేకూరుస్తున్నాయి. వాస్తవంగా పౌరసరఫరా శాఖకు సుదీర్ఘచరిత్ర ఉంది. మన పెద్దలు ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేసిన పౌరసరఫరా విభాగం 1946 నుంచి 52 వరకు అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో హైదరా బాద్‌ కమర్షియల్‌ కార్పొరేషన్‌గా పనిచేస్తుండేది. 1952లో పౌరసరఫరా శాఖ ఏర్పాటు అయినా 1958 జులై ఒకటిన ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖగా ఆవిర్భవించింది. ఈ శాఖ మొదట్లో రెవెన్యూ బోర్డు విభాగంలో ఉండేది. 1977లో రెవెన్యూబోర్డు రద్దుకావడంతో పౌరసరఫరాల శాఖకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రారంభదశలో ఆ శాఖ కేవలం రెగ్యులేటరీ శాఖగా ఉన్నా క్రమేపీ విస్తరించి కనీస మద్దతుధర కింద ఆహారధాన్యాల సేకరణ, సబ్సిడీ బియ్యం పంపిణీ, ధరల పర్యవేక్షణ, వినియోగదారుల వ్యవహారం తదితర కార్యక్రమాలు చేపట్టడంతో ఈ విభాగం ప్రాముఖ్యత బాగా పెరిగింది. ముఖ్యంగా 1983లో రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టిన తర్వాత ఆ శాఖకు ఎక్కడలేని ప్రాధాన్యత సంతరించుకున్నది. కానీ కార్డుపంపిణీలు, డీలర్ల నియామకం, పంపిణీలలో రాజకీయజోక్యం పెరిగిపోవడంతో అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి అంతేలేకుండాపోయింది. ఇన్నేళ్లు జరిగినా కార్డు వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. లక్షలాది బోగస్‌ కార్డులున్నాయని, మరెన్నో కార్డులు అనర్హుల వద్ద డీలర్ల వద్ద కూడా ఉన్నాయని ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినా కోట్లాది రూపాయలు ప్రజాధనం దళారుల పాలవ్ఞతున్నా పట్టించుకునే సాహసం చేయలేక పోతున్నారు. కళ్లముందు జరుగుతున్న ఈ దోపిడీకి నిస్సహాయ సాక్షులుగా నేతలుండటం ఏమాత్రం సమంజసం కాదు. సంక్షేమ పథకాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవ్ఞతున్న మాట కాదనలేని వాస్తవం. ఇంత సుదీర్ఘచరిత్ర ఉన్న ఈ శాఖ సమర్థవంతంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నది? చట్టాల్లో ఏమైనా లోపాలున్నాయా? కారణాలు, కారకుల గూర్చి సమగ్రమైన అధ్యయనం చేయించాలి.రాజకీయ అవసరాల కోసం ఈవ్యవస్థను అస్తవ్యస్తం చేయడం ఏమాత్రం న్యాయంకాదు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధిసాధించాం. పంపిణీ వ్యవస్థలో కూడా మరింత సాంకేతికతను ఉపయోగించుకుంటూ సమర్థులైన అధికారులను నియమించి అర్హులైన నిరుపేదలకు ఫలాలను అందించాల్సిన గురుతర బాధ్యత పాలకులపై ఉంది.