పేదరికంపై ఇది తుదిపోరేనా?

rahul gandhi
rahul gandhi


సారస్వత ఎన్నికల్లో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈసారి పెద్ద హామీనే గుప్పించింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే అత్యంత నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయం కింద ఏటా రూ.72వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆపార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం ప్రకటించారు.నెలకు రూ.12వేలు ఆదాయం ఉన్న దేశంలోని దాదాపు 5కోట్ల కుటుంబాల్లోని 25కోట్ల మందికి ఇది ప్రయోజనం కలుగుతుందని ఆయన వివరించారు. పార్టీ అత్యున్నత విదాన నిర్ణాయక సంఘం (సిడబ్ల్యుసి) సమావేశ అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడలేని విధంగా పేదలకోసం మొట్టమొదటిసారిగా తాము ఈపథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈపథకం భారత దేశం నుంచి పేదరికాన్ని తొలగించేందుకు ఇది ఆఖరి పోరాటం అవుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పుడే కాదు స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి పేదరికాన్ని పారదోలేందుకు పాలకులు పెద్దపెద్ద ప్రకటనలే చేస్తున్నారు. లక్షలాది కోట్ల రూపాయల వ్యయంతో పేదల అభ్యున్నతికి వారిని దారిద్య్ర రేఖకు దిగువనుండి దాటించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్ని లక్షల కోట్లు వెచ్చించారో అంచనాలకే అందవు. ఈ ఏడు దశాబ్ధాలలో పేదరిక నిర్మూలనకు చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, పేదల, ధనికుల మధ్య వ్యత్యాసం పెరిగిపోతూనే ఉంది. పేదలు మరింత నిరుపేదలుగా దిగజారిపోతూనే ఉన్నారు.

అసలు భారతదేశం మొత్తం సంపదలో 58శాతం సంపద కేవలం 57మంది గుప్పిట్లో చిక్కుకొని ఉందని గతంలో ఎన్నో నివేదికలు వెల్లడించాయి. ఒక్క భారత్‌లోనే కాదు…ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో ఈ అంతరాయం పెరిగిపోతున్నదని రెండేళ్ల క్రితం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్‌) సదస్సులో అమెరికాకు చెందిన ‘ఆక్సోఫోమ్‌ అనే సంస్థ ‘ఎకానమీ ఫర్‌ ది 99పర్సెంట్‌ పేరిట నివేదికలో అనేక విస్తుపోయే విషయాలు వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం భారత దేశంలో 84మంది మిలీనియర్ల చేతుల్లో రూ.16లక్షల కోట్లకు పైగా సంపద ఉన్నట్లు వెల్లడించారు. అందులో 57 అగ్రస్థాయి బిలీనియర్ల వద్ద 14.5లక్షల కోట్లు సంపద ఉంది. దేశ జనాభాలో 70శాతం మంది వద్ద ఎంత సంపద ఉందో కేవలం 57మంది వద్ద అంత సంపద చిక్కుకపోయింది.

98నుంచి 2011 వరకు నిరుపేదల ఆదాయం 10శాతం పెరిగితే లక్ష్మీపుత్రుల ఆదాయం మాత్రం 180రెట్లకు పైగా పెరిగింది. ఈ ఆర్థిక సమానత సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆసమావేశంలో పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితులు కొనసాగితే రెండు దశాబ్ధాల్లో తొలి ట్రిలీనియర్‌ ప్రపంచం వస్తుందని కూడా గుర్తుచేశారు. ఏదిఏమైనా ఒక పక్క సంపన్నుల సంపద అంతకంతకు పెరిగిపోతుండగా…పేదల సంపద దారుణంగా పడిపోతున్నదనేది అందరికీ తెలిసిందే. చైనా, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక తదితర దేశాల్లోని 10శాతం ధనికుల సంపద గత 20ఏళ్లలో 15శాతం పెరిగింది. అదే సమయంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10శాతం ప్రజల సంపాదన దాదాపు 15శాతానికి పైగా పడిపోయింది.

ఆసియా దేశాల్లో మహిళలపై వివక్షత తీవ్రంగా ఉంది. ఒకే పనిని చేస్తున్నా పురుషులకు ఇచ్చే కూలీ మహిళలకు ఇవ్వడం లేదు. వేతనాల చెల్లింపులో వివక్ష భారత్‌లోనే అధికంగా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద వస్త్ర కంపెనీలన్నింటికీ కాటన్‌, స్పిన్నింగ్‌ మిల్లులతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ మిల్లుల్లో బాలబాలికలతో తక్కువ వేతనాలతో పనిచేయిస్తున్నారనే విషయం కూడా ఆనాటి సదస్సు ముందుకు వచ్చింది. ఏదిఏమైనా భారత్‌ దేశంలో సంపద పెచ్చుమీరుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక బాల కార్మికుల వెట్టిచాకిరి జరుగుతున్న తీరును కూడా ఇటీవల పలు నివేదకలు ప్రపంచానికి ఎత్తి చూపించాయి.

బాల కార్మిక వ్యవస్థకు మూలాలు పేదరికమనేది అందరికీ తెలిసినా…ఆకోణంలో ఆలోచించకుండా వెట్టిచాకిరి నుంచి ఏటా లక్షలాది మంది బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఒడిస్సా, మహారాష్ట్ర, బీహార్‌ తదితర ప్రాంతాల నుంచి వలసలు పెరిగిపోతున్నాయి. దక్షిణ భారత దేశంలో అనేక ప్రాంతాల్లో ఇటుకబట్టీ కార్మికులుగా, డెయిరీల్లోనూ పనిచేస్తున్నారు. ఈ వెట్టిచాకిరి, బాలకార్మికులకు కానీ ప్రధాన కారణం పేదరికమే. తమ కళ్లముందు తోటి పిల్లలతో ఆడుకుంటూ విద్యాభ్యాసం చేయాల్సిన ఆచిన్నారి చేతులతో చేయరాని కష్టం చేయించేందుకు ఆ తల్లిదండ్రులు పంపుతున్నారంటే మూలాలు పేదరికమే. ఆపేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయకుండా ఈ వెట్టినుంచి విముక్తి కలిగించినా తిరిగి వారు అదే పనిలోకి ఏదో ఒక రూపంలో చేరిపోతున్నారు.

అందుకనే చట్టాలు ఎన్నిచేసినా..ఎన్ని కేసులు పెట్టినా పేదరికం కారణంగానే ఈవ్యవస్థ కొనసాగుతోంది. మన దేశానికి సంబంధించిందే కాదు…దక్షిణాసియాలోని కొన్ని ఆఫ్రికా దేశాల్లో పేదరికం చాయలు అధికంగానే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో పేదలు అధికంగా ప్రస్తుతం దక్షిణాసియా, సహార, ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 1990తో పోలిస్తే ఆదేశాల్లో జనాభా ఎంత పెరిగిందో అంతే స్థాయిలో పేదరికం కూడా పెరిగిపోతుంది. ఏదిఏమైనా భారత దేశంతో సహా అనేక దేశాల్లో పేదరికాన్ని ఆశించిన స్థాయిలో నిర్మూలించలేకపోతున్నారు. పేద కుటుంబాలకు ఆకలి బాధలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఎన్నో సబ్సిడీ పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.

ప్రజా పంపిణీ వ్యవస్థ అందులో అతిపెద్దదిగా చెప్పవచ్చు. దేశంలో సగానికి పైగా ప్రజలు ఈ పథకం కింద లబ్ధిపొందుతున్నారు. కానీ, లబ్ధి పొందేవారి సంఖ్య ఏడాదికేడాదికి పెరుగుతుండటం పేదల సంఖ్య పెరిగిపోతుందనే సంకేతాలిస్తుంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో…అధికార వర్గాలకే అర్థం కావడం లేదు. ఒకపక్క ఇదే ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించిన గ్రామీణ అభివృద్ధి సంస్థకు సంబంధించిన లెక్కలు పేదరికం తగ్గుతున్నట్లు వివరిస్తుంటే…ప్రజా పంపిణీ వ్యవస్థ రికార్డుల ప్రకారం పేదల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు స్పష్టం చేస్తున్నది.ఏది ఏమైనా పేదరికంపై పోరాటంలో ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం లేదు.

ఆఫ్రికా దేశాల్లోని ప్రభుత్వాలు కీలకమైన పాత్ర పోషిస్తూనే పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యపడుతుందనే విషయాన్ని టాంజేనియా అనుభవం చెబుతుంది. ప్రకటనలు,హామీలతో కాలం గడపకుండా ఆర్థిక అభివృద్ధితో పాటు సంపద పంపిణీ, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, వైద్యసేవల విస్తరణ, విద్య తదితర అంశాలపై కేంద్రీకరించాలి. అప్పుడే ఇది తుది పోరు అవతుందే తప్ప ఏదో ఏడాదికి కొంత డబ్బు ఆర్థిక సహాయం చేసినంత సమస్యకు పరిష్కారం కాదు.

  • దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌