పెడదారిపడుతున్న సాంకేతిక విద్య

students
students


సాం కేతిక విప్లవం విజ్ఞానాన్ని పెంపొందిస్తున్న మాట వాస్తవం. గతంలో మనకు ఏ చిన్న సలహా కావాలన్నా ఇతరుల మీద ఆధారపడేవారం. మన అను మానాలను నివృత్తి చేసే వారికోసం పడే వెతుకులాటలో అష్టకష్టాలు పడేవారం. ఇప్పుడా పరిస్థితి లేదు. క్షణాల్లో మనం సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అంతర్జాలం మంత్ర దండంలా మనముందు ప్రత్యక్షమవ్ఞతున్నది. సందేహాలకు సమాధానాలిచ్చే సకల విజ్ఞన సమాహారంలా మనముందు సాక్షాత్కరిస్తున్నది అంతర్జాలం. టివీలు, మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్లు, సాంకేతికరంగంలో పెనుమార్పులకు నాంది పలికాయి. సాంకేతిక విప్లవం మానవ జీవితాన్నే మార్చేసింది. సాంకేతిక పరికరాల వలన నేటి ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది.

క్షణాల్లో ప్రపంచంలో జరిగే సమాచారమంతా మనముందు ప్రత్యక్షమవ్ఞతున్నది. విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతూ మన జీవితాల్లో భాగస్వామ్యమైపోయాయి సాంకేతిక సాధనాలు. అయితే సాంకేతిక విద్యను సరైన దారిలో నడిపించకపోతే లాభాలకంటే నష్టాలే అధికంగా ఉంటాయి. విద్యతో వివేకాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే సాంకేతిక విద్యానైపుణ్యంతో నిర్మాణాత్మకమైన ఆలోచనలను పెంపొందించుకోవచ్చు. విధ్వంసానికి వినియోగించుకోవచ్చు.మన ఆలోచనా విధానంలోనే సర్వం ఇమిడి ఉన్నది.సద్వినియోగంతో అభివృద్ధిని పెంపొందించవచ్చు. దుర్వినియోగంతో పతనాన్ని కొనితెచ్చుకోవచ్చు. నేటి యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్ర మంగా ఉపయోగిం చుకోవడం లేదు.

విజ్ఞానాన్ని వినాశనా నికి ఉపయోగించడం దారుణం. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం విరివిగా ఉపయోగ పడుతున్నది. క్షణాలమీద పనులన్నీ జరిగిపోతున్నాయి. గతంలో తంతితపాలా ద్వారా సమాచారాన్ని అందించడానికి వారాల తరబడి ఎదరు చూసేవాళ్లం. ఇప్పుడు చరవాణి ఆ పరిస్థితిని తారుమారు చేసి సత్వరమే సందేహాలను ఇతరులకు చేరవేసేసౌలభ్యం ఏర్పడింది. ఇలాంటి సాంకేతిక విప్లవ పరిణామాలను యువత సరైనరీతిలో వినియోగించడం లేదు.సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మానవ మేధస్సుకు పదును పెట్టడం తగ్గిపోయింది. ఆలోచనా విధానం మారిపోయింది. పుస్తకపఠనం తగ్గిపోయి, అంతర్జాల విన్యాసం పెరిగిపోయింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల వాడకం పెరిగింది. మంచికోసం ఉపయోగపడాల్సిన సాంఘిక మాధ్యమాలు అసభ్యతకు, అశ్లీలతకు దారితీస్తున్నా యి. అన్ని రంగాలలోనూ ఈ సాంకేతిక విప్లవ పైశాచికత్వం కట్టలు తెంచుకుని నాట్యం చేస్తున్నది.

విద్యార్థులలో మొబైల్‌ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసభ్యకరమైన సన్ని వేశాలను తిలకిస్తూ చిరుప్రాయంలోనే చెడుదార్లు పడుతున్నారు. కొంతమంది యువతకు పగలూరాత్రి అనే తేడాలేకుండా కూర్చు నా, నిలుచున్నా,నడుస్తున్నా మొబైల్‌చాటింగే తప్ప మరో ధ్యాస లేదు.టిక్‌టాక్‌లు, పబ్జీగేమ్‌లతో కాలక్షేపంచేస్తూ అదే జీవితమనే భ్రమలో బతుకుతూ బద్ధకస్తులుగా మానసిక రోగుల్లా తయా రవ్ఞతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతికరంగంలో వస్తున్న వికృత పోకడలపై మంచి చెడు తారతమ్యం తెలిసేలా నేటి విద్యార్థులకు, యువతకు దిశానిర్దేశం చేయాలి.సాంకేతిక విద్య నిర్మాణాత్మకమైన కార్యక్రమాలకే కాని నైతిక విలువల విధ్వంసా నికి వినియోగించారాదన్న సత్యాన్ని విశదీకరించాలి.

  • సుంకవల్లి సత్తిరాజు