చట్టసభలు సజావుగా సాగేనా?

INDIAN PARLIAMENT
INDIAN PARLIAMENT

ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తమ జాతి భవిష్యత్తు ఎలా రూపుదిద్దుకోవాలని భావిస్తున్నారు? అనే ప్రశ్నలకు చట్టసభల నిర్మాణం పనితీరే జవాబులు. దేశ పురోభివృద్ధికి నిబద్ధత గల చట్టసభల పనితీరే కొలబద్ద. అందుకే భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం పార్లమెంటుకు విశేష అధికారాలను కట్టబెట్టింది. న్యాయస్థానాల పరిధిని నిర్ణయించడం దగ్గర నుండి సర్వోన్నత న్యాయమూర్తుల తొలగింపు వరకు రాష్ట్రపతి అభిశంసన మొదలుకొని రాజ్యాంగాన్ని కూడా సవరించుకునే వెసులుబాటు వరకు అన్ని అధికారాలు చట్టసభలకు సంక్రమింప చేసింది. చట్టసభల నిర్ణయాల ద్వారా నిర్మించబడ్డ శాసనాల ద్వారా రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు సాధించాలనే దూరదృష్టితో రాజ్యాంగ నిర్మాతలు చట్టసభావేదికలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు.

జా తి ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంటు భారతదేశంలో అతిపెద్ద పంచాయతీ అని జవహర్‌ లాల్‌నెహ్రూ అన్నారు. నెహ్రూ మాటల్లో చెప్పాలంటే పార్లమెంట్‌ ఒక పెద్ద చర్చావేదిక. ఇక్కడ దేశ ప్రజల సమస్యల దగ్గర నుండి జాతీయ, అంతర్జాతీయ విషయాల వరకు, ప్రభుత్వ నిర్ణయాల నుండి పాలకుల పనితీరు వరకు అన్ని విషయాలు కూలంకుశంగా చర్చించుకునే ప్రజాప్రతినిధ్య సభావేదిక. 130 కోట్ల మంది భారతీయుల ఆలోచనలకు ఆకాంక్షలకు చట్టసభలు నిలువెత్తు నిదర్శనాలు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తమ జాతి భవిష్యత్తు ఎలా రూపుదిద్దుకో వాలని భావిస్తున్నారు? అనే ప్రశ్నలకు చట్టసభల నిర్మాణం పనితీరే జవాబులు. దేశ పురోభివృద్ధికి నిబద్ధత గల చట్టసభల పనితీరే కొలబద్ద. అందుకే భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం పార్లమెంటుకు విశేష అధికారాలను కట్టబెట్టింది.

న్యాయస్థానాల పరిధిని నిర్ణయించడం దగ్గర నుండి సర్వోన్నత న్యాయమూర్తుల తొలగింపు వరకు రాష్ట్రపతి అభిశంసన మొదలుకొని రాజ్యాంగాన్ని కూడా సవరించుకునే వెసులుబాటు వరకు అన్ని అధికారాలు చట్టసభలకు సంక్రమింప చేసింది. చట్టసభల నిర్ణయాల ద్వారా నిర్మించబడ్డ శాసనాల ద్వారా రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు సాధించాలనే దూరదృష్టితో రాజ్యాంగ నిర్మాతలు చట్టసభావేదికలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ వేదికల నుండే కామరాజు నాడార్‌, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌, పుచ్చలపల్లి సుందరయ్య నిన్నమొన్నటి వాజ్‌పేయి వంటి ఎందరో మహానేతలు ప్రజల ఆకాంక్షలను రాజ్యాంగబద్ధంగా ప్రాతినిధ్యసభలలో ప్రతిధ్వనింపచేశారు. పార్లమెంట్‌ సమావేశాల కాలంలో ప్రతి క్షణాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకున్నారు. అయితే ఇదంతా గతకాలపు చరిత్ర. నాణెనికి ఒకపార్శ్వం. రెండో పార్శ్వంలో నేటి చట్టసభల పరిస్థితులు-పనితీరు సమయపాలన, ప్రజాపరిపాలన చూస్తే మనసు బాధించకమానదు.

ప్రజాసమస్యలను చర్చిండం, చట్టాలను రూపొందించడం విధానాలను విశ్లేషించడం, ప్రభుత్వ పనితీరును జవాబుదారీగా నిలబెట్టడం వంటి పార్లమెంటు విధివిధానాలు పక్కదారి పట్టాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ రాజకీయ పార్టీల సిద్ధాంత వైరుధ్యాలను, వ్యక్తిగత విమర్శలను పరస్పర దూషణలను చేసుకోవడానికి చట్టసభలను వేదికగా మార్చుకొని సభా సమయాన్ని హరిస్తున్నారు. పరనిందావ్యామోహానికి వాడుకుంటున్నారు. దినదినం కుంచించుకుపోతున్న సభా సంప్రదాయాలు, పెడదారిపడుతున్న రాజకీయ పార్టీలు, నిందారోపణలు చేసుకుంటున్న రాజకీయ నాయకులను చూస్తుంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రజల బాగోగులు నుండి దారి మళ్లింపునకు గురయింది అనిపిస్తుంది. గత పార్లమెంట్‌ (16వ పార్లమెంట్‌) సమావేశాలు విశ్లేషిస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవ్ఞతుంది. 16వ లోక్‌సభ 2014-19 కాలంలో కేవలం 331 రోజులు మాత్రమే సమావేశమయింది.

దీనికిముందు చట్టసభలు సగటున 468 రోజులు సమావేశమయ్యాయి. గతంలో లోక్‌సభలు ఐదేళ్లకాలంలో సగటున 2681 గంటలు సమావేశం కాగా 15,16 లోక్‌సభ సమావేశాల కాలాలు తగ్గిపోయాయి. 16వ లోక్‌సభ 1615 గంటలు మాత్రమే సమావేశం కావడం సగటు పార్లమెంట్‌ పనిగంటలతో పోల్చుకుంటే సగానికి కుదించబడడం దేశ సమస్యలపై చట్టసభల పనితీరు అంచనా వేయవచ్చు. ఇక బిల్లుపై సమగ్ర అధ్యయనం విషయానికి వస్తే 14,15 లోక్‌సభల్లో 60 శాతం, 71 శాతం బిల్లులను సభా సంఘాలు అధ్యయనం చేస్తే 16వ లోక్‌సభ మాత్రం కేవలం 26 శాతం బిల్లులు మాత్రమే సభ సంఘాల అధ్యయనానికి పంపించి మిగిలినవి ఆదరాబాదరాగా ఎటువంటి అధ్యయనం, చర్చ లేకుండా ఆమోదించాయి. కీలకమైన ఆధార్‌బిల్లు (2016)ను కూడా ద్రవ్యబిల్లు అని తప్పుగా చిత్రీకరించి రాజ్యసభ ప్రమేయం లేకుండా చట్టం చేశాయి.

పార్లమెంటు నేలపై సాష్టాంగం సాగిలపడిన నాయకత్వం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగునా? పార్లమెంటు అధికారాలలో ముఖ్యమైన అధికారం శాసనాలను నిర్మించడం, సవరించడం. కేంద్ర జాబితాలో 100 అంశాలు, ఉమ్మడి జాబితాలో 52 అంశాలు, అవశిష్ట అంశాలు వంటి వాటిపై ప్రజల కోరికలను దేశ అవసరాలకు అనుగుణంగా చట్టాలు తయారు చేయడం లేక మార్చడం వంటివి చట్టసభల కనీస ప్రాథమిక బాధ్యత. దేశ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఆచరిస్తున్న విధానాలు పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండాలి. అనునిత్యం పాలనాపరమైన చర్చోపచర్చలకు సభాసమయం సద్వినియోగం కావాలి. ఇది చట్టసభలకు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించి సభలో నడుచుకోవడం అంటే రాజ్యాంగ ఉద్దేశ్యాన్ని ధిక్కరించడమే. ఒక నిమిషం పార్లమెంట్‌ సమావేశానికి అయ్యే ఖర్చు సుమారు 2.5 లక్షలు.

ఈ విధంగా సంవత్సరానికి 80 రోజులు రోజుకి ఆరుగంటల చొప్పున ఒక ఏడాదికి పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చు అక్షరాలా సుమారు 720 కోట్ల రూపాయలు. ఇంత ప్రజాధనాన్ని వినియోగిస్తున్న పార్లమెంట్‌ సభలు ప్రజాప్రాయోజక ఉత్పాదకతను ఎంత సాధిస్తున్నాయి? అని ప్రశ్నించుకోవాలి. ఇవికాక పార్లమెంట్‌ సభ్యుల వేతనాలు, అలవెన్స్‌లు, ఎంపిలాడ్స్‌ నిధులు, చట్టసభలు జరుగుతున్నంత కాలం రోజుకు రెండువేల రూపాయల అదనపు అలవెన్సులు, ప్రయాణ ఖర్చులు మొత్తంగా చూసుకుంటే ప్రాతినిధ్యసభ్యుల పనితీరుకు వారి ఖర్చులకు ఎక్కడా పొంతన కుదరదు. ఒకప్పుడు దేశం కోసం పోరాటం చేసిన నాయకులు సమాజ క్షేమాన్ని కాంక్షించిన సంఘసంస్కర్తలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించి నిరంతరం దేశ సమైక్యత సమగ్రతలే ఆశయాలుగా నడుచుకునేవారు.

ప్రజల బాగోగులే వీరి అంతిమ లక్ష్యం. కానీ నేడు చట్టసభల్లో వ్యాపారవేత్తలు, నీతిరహితులు, నేరచరితులు, అధికార వ్యామోహ దాహార్తులు కొలువ్ఞతీరుతున్నారు. వీరి లక్ష్యం అరాచకాలు సృష్టించడం అడ్డదారులు తొక్కడం సంపద పోగుచేసుకోవడం తప్ప ఇంకేం ఉంటుంది? ప్రజల ఆలోచనలకు అవసరాలకు అనుగుణంగా దేశ పురోభివృద్ధి జరగాలని ప్రజలను కూడా పాలనలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థను ప్రతిష్టించారు. చట్టసభలలో జాతి అవసరాలపై నిరంతర అధ్యయనం జరగాలని ఆకాంక్షించారు. చట్టసభలు అందుకు వేదిక కావాలని అతి సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చారు.

కానీ ఈ రోజుల్లో ‘కర్ర ఉన్న వాడిదే బర్రె అన్న తరహాలో డబ్బు దౌర్జన్యం ఉన్న వాళ్లదే రాజ్యాధికారం అవ్ఞతుంది. వారి ఆలోచనలు, ఆచరణలు ప్రజా ప్రయోజనాలకు అతీతంగా సాగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు దేశ సంకటస్థితికి నిదర్శనాలు. ఎంతో మంది మేధావ్ఞలు రాజ్యాంగ నిపుణుల ద్వారా ఉన్నతీకరించబడ్డ పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థకు మూలప్రమాణమైన చట్టసభావేదికలు తమ మొత్తం సమయాన్ని ప్రజాసమస్యలపై దేశపురోభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాం.

  • మాణిక్యం దుర్గారావు