గిరిజనులకు అనాదిగా అన్యాయమే!

 

Tribal
Tribal

గిరిజన సంక్షేమం అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామని దేశవ్యాప్తంగా ఏటా వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని, ఒకపక్క నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా.. మరొకపక్క కనీస మౌలిక వసతులు, వైద్యసదుపాయాలు లేక లక్షలాది మంది గిరిపుత్రులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వైద్యసదుపాయాలు అటుంచి కడుపునిండా తిండిలేక పోష్టికాహారం లోపించి లక్షలాది గిరిపుత్రులు అనేక వ్యాధుల బారినపడుతున్నారు. ముఖ్యంగా సీజన్‌ మారినప్పుడల్లా రకరకాల వ్యాధులు ఏజెన్సీ ప్రాంతంలో విజృంభిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయినా.. ఇప్పటికీ కనీస వైద్యసదుపాయాలు కల్పించలేకపోతున్నాం. రాజ్యాంగంలో వారి అభ్యున్నతి గురించి, సంక్షేమంవైపు తీసుకోవాల్సిన చర్యల గూర్చి ఎన్నో రాసుకున్నా ఆచరణకు వచ్చేసరికి అవి కాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి. గత పది, పదిహేను రోజులుగా పెరిగిపోయిన చలి ఇతర ప్రాంతాలతోపాటు గిరిజన ప్రాంతాలను గడగడవణికస్తున్నది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌తోపాటు అటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖ, గోదావరి జిల్లాల్లోని తదితర గిరిజన ప్రాంతాల్లో చలిధాటికి ఇప్పటికే అనేకమంది గిరిజనులు మృత్యు వాతపడినట్లు వార్తలు అందుతున్నాయి. వేలాది మంది స్వైన్‌ఫ్లూ, డెంగ్యూలాంటి విషజ్వరాల బారినపడినట్లు కూడా సమాచారం. వీటన్నింటికంటే మించి భావిభారత పౌరులుగా ఎదగాల్సిన వేలాది మంది మన్యం బాలలు రేచీకటి, గ్లోకోమా, క్యాట్‌రాక్‌, విటమిన్‌-ఎ లోపంతో అంధులుగా మారుతున్నారనే సమాచారం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నది. సర్వేంద్రియాల్లో కళ్లు అత్యంత ప్రధానమై నవి. ఇవే మూసుకుపోయి అంధులుగా మారితే ఆ వ్యక్తితో పాటు కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అవిద్య, అజ్ఞానం, మూఢత్వం, దారిద్య్రం, ప్రకృతితోపాటు తోటి మానవ్ఞడి దోపిడీలతో గిరిజన ప్రాంతాలు అతలాకుతలం అవ్ఞతున్నాయి. గిరిజనులకు ప్రత్యేక ప్యాకేజీలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న కోట్లాది నిధుల్లో నాలుగో వంతు కూడా వారికి చేరడం లేదనేది కాదనలేని వాస్తవం. వారికోసం ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటిడిఎ)లు ఏర్పాటుచేసినా ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మన్యం గ్రామాలకు రహదారి లేదు. నడవడానికి కూడా సరైన బాటలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వేదికలు ఎక్కి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఓట్లకోసం పాలకులు పాకులాడుతున్నారేతప్ప ఆచరణలో చిత్తశుద్ధి కన్పించడం లేదు. వైద్యం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే చెప్పొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పులవల్ల ముందుగా బలవ్ఞతున్నది గిరిజన ప్రాంతాలే. ఇతర విషయాలు ఎలా ఉన్నా గిరిజనుల విషయంలో వైద్యసేవలు నిర్లక్ష్యం చేయడంమాత్రం క్షమార్హం కాదు. వైద్యం, విద్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి కేటాయించిన నిధులు వారికే అందేలా చూడటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవ్ఞతున్నాయి. వాస్తవంగా చూస్తే 1970లో సాంఘిక సంక్షేమశాఖ నుంచి విడదీసి ప్రత్యేకంగా గిరిజన సంక్షేమశాఖను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన కోట్నాక్‌ భీమ్‌రావ్ఞను తొలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఎంతో కాలంగా మూలనపడి ఉన్న హైమాండర్స్‌ నివేదికలోని సిఫార్సులను అమలుచేసేందుకు నడుంబిగించారు. అప్పుడే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటిడిఎలు ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది ఐటిడిఎల ద్వారా ఏటా వందలాది కోట్లు వెచ్చించారు. భవనాలు నిర్మించారు. ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. డాక్టర్లతోపాటు సిబ్బందిని నియమించారు. కానీ వారిని అక్కడికి పంపడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీనికితోడు వారికి సరఫరా అవ్ఞతున్న మందుల్లో కూడా నాసిరకం ఉండటంతో రోగాలు తగ్గక నమ్మకం సన్నగిల్లి గిరిజనులు నాటువైద్యంవైపు మొగ్గుచూపుతున్నారు. చెట్టు వేర్లు, పసర్లతో వచ్చీరాని వైద్యం చేసుకుని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఫలితంగా ఇక్కడేకాదు దేశ వ్యాప్తంగాకూడా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అస్తవ్యస్తమైనవని చెప్పొచ్చు. ఇక ప్రభుత్వాలు వెళ్లలేని గిరిజన ప్రాంతాలకు వైద్యం, విద్య సౌకర్యాలు కల్పించేందుకు 1997లోనే ‘గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ టు వాలెంటరీ ఆర్గనైజేషన్‌ వర్కింగ్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఈ నిధులు మింగేందుకు పుట్టుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలకు ఇవి కల్పతరువ్ఞగా మారాయి. ఇక హక్కుల విషయంలోకూడా వారికి అన్యాయం జరు గుతున్నదేమోననిపిస్తున్నది. దీనికి సంబంధించి చట్టాలు చేస్తున్నా.. అవి త్రికరణశుద్ధిగా అమలుచేసేందుకు పాలకు లకు చేతులు రావడం లేదు. 2006లో పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టానికి సంబంధించిన నిబంధనలు 2008లో అమలులోకి వచ్చాయి. అమలులో ఎదురవ్ఞతున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2012లో సవరణలు చేసినా ఏమాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి రాగానే ప్రభుత్వం ఆదివాసుల వ్యక్తిగత, ఉమ్మడి అటవీ ఆధారిత హక్కులపై సర్వే జరిపి అమలు చేస్తుందని భావించారు. కానీ నేటికీ అవి అమలుకు నోచు కోలేదు. గిరిజనాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నమాట వాస్తవమే. కానీ ఆమేరకు ఆశించిన ప్రయోజనాలు, లక్ష్యం చేకూర లేదు. ఇప్పటికైనా పాలకులు రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలను గిరిజనులకు కల్పించడంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి. – దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌,హైదరాబాద్‌ ====