ఆర్థిక మాంద్యం ఆందోళనకరం

గ త కొన్నేళ్లుగా భారత ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉంది. ఆర్థికవేత్తలు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై తమ ఆందోళన తెలియబరుస్తూనే ఉన్నారు. ఇది ఎప్పటిలా కొన్నేళ్లకు మళ్లీ మళ్లీ వచ్చే సైక్లికల్‌ మాత్రమే కాదు స్ట్రక్చరల్‌ అంటూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం ఆ విమర్శల్ని రాజకీయ విమ ర్శలుగా కొట్టేయడమో లేదా తేలికగా తీసిపారేయడమో చేస్తూ వస్తోంది. ప్రజలకు భయంలేదన్న భరోసా ఇస్తూనే ఉంది. అయితే రోగం తీవ్రమైనదైతే అందుకు తగ్గ మందు ఇవ్వాల్సిందే కానీ వైద్యుడు హితవచనలు చెప్తే మాత్రం సరిపోతుందా! ముందు రోగం ఏ రకమైనదో, తీవ్రత ఏమిటో అంచనా వేసి తగు చికిత్స మొదలెట్టాలి కదా! అందుకు సంబంధించిన నిపు ణులతో బయటపడవేసే మార్గం ఆలోచించాలి కదా! అలా కాకుండా లేని ప్రతిష్టకు పోతే ఒరగేదేమిటి? ఈ సంవత్సరం వరుసగా రెండో త్రైమాసికంలో జిడిపి దిగజారి 4.5కి చేరింది. ఇది ఆరున్నరేళ్లలో కనిష్టం. కనీసం ఏడు ఉండాలని, ఉంటుం దని ప్రభుత్వం అంచనా వేసింది. ఇంకో ఐదేళ్లలో ఐదు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా దేశం తయారవ్వాలంటే అది ఏటేటా 9శాతంగా పరుగులు పెట్టాలి. వాస్తవం ఇలా ఉండగా ఈ స్థితికి ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణమని, అయినప్పటికీ ఆర్థిక గమ్యం చేరగలమని ప్రభుత్వం చెప్తోంది. మరి ప్రజలకెలా నమ్మకం కలుగుతుంది? ఇంకా బాధాకరం ఏమిటంటే ఈ పరిస్థితి కేవలం మందగమనం మాత్రమే కానీ మాంద్యంకాదని వాదిస్తోంది. కొన్ని నిర్వచనాల ప్రకారం వరుసగా రెండో త్రైమా సికంలో వృద్ధి తగ్గుముఖం పడితే మాంద్యం ఉన్నట్టే లెక్క. అయినా నిర్వచనాల దేముంది అనుకోడానికి లేదు. ఎందుకంటే తీవ్రత గుర్తించేది వాటివల్లనే కదా! సరే వారిలెక్కలు వారివి అనుకున్నా వారు చేస్తున్న వైద్యం పనిచేస్తున్నట్టు దాఖలాలు లేవ్ఞ. సంపన్నులకు కార్పొరేట్‌ పన్ను తగ్గించారు. కొన్ని రాయి తీలు ప్రకటించారు. పెట్టుబడులు వస్తాయని చెప్పారు.అయితే రాయితీలకు తగినంత ఫలితం అటు నుండి కనబడలేదు. కొంత మంది ఆర్థిక నిపుణులు చెప్తున్నదేమిటంటే ఈ దుస్థితికి కారణం ప్రజల చేతిలో డబ్బులేకపోవడం. తద్వారా గిరాకీ తగ్గిపోవడం. ప్రభుత్వం గిరాకీ పెంచే యోచన చేయాలి. కానీ సప్ల§్‌ు వైపు రాయితీలు పెంచడం కాదని, నమ్మదగిందిగా ఉంది ఈ మాట. రాజకీయ ప్రేరేపిత సలహా అనిపించడం లేదు. నలభై ఏళ్లలో అధికస్థాయికి నిరుద్యోగిత ప్రబలింది. కొత్త ఉద్యోగాలు లేవ్ఞ. ఉపాధి ఎక్కువ మందికి కల్పించే వ్యవసాయం, నిర్మాణం తదితర రంగాలు నీరసంగా ఉన్నాయి. బ్యాంకులు రుణాలివ్వ డం తగ్గించేశాయి. వీటిని పట్టాలెక్కించడానికి ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమగ్ర వ్యూహాలు రచించాలి. భేషజాలకు పోకుండా సమస్య తీవ్రతను గుర్తించాలి. ఆలస్యం చేస్తూ మరింతగా దిగజారే పరిస్థితిని ఎగదోయ్యకూడదు. – డా.డి.వి.జి.శంకరరావు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/