వెక్కిరిస్తున్న వృద్ధి మందగమనం!

Financial
Financial

భారత్‌ ఆర్థిక వృద్ధి 4.5 శాతంగా ఉంది. జులై సెప్టెంబరు మాసంలో గతం కంటే మరింతగా తగ్గింది. ఆరేళ్ల కనిష్టానికి దిగజారిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెపుతు న్నాయి.అంతకుముందు కూడా 2012-13 ఆర్థికసంవత్స రం జనవరి మార్చి త్రైమాసికం 4.3శాతానికి వచ్చింది. జిడిపి 2018-19లో ఒక్కసారి మాత్రమే ఏడుశాతంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలే చెపుతున్నాయి. ఆరునెలల కాలంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో భారత్‌ ఆర్థికవృద్ధి 4.8శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో7.5శాతంగా ఉన్నవృద్ధి ఏడాది గడిచే సరికి భారీగా కుంగిపోయింది.భారతీయ రిజర్వు బ్యాంకు కూడా జిడిపివృద్ధి అంచనాలను 6.1శాతానికి తగ్గించింది. అంతకుముందు పూర్తి సంవత్సరానికిగాను 6.9శాతంగా వెల్లడించింది. ప్రస్తుత, స్థిరమైన ధరలవద్ద చూసిన టోకు ధరలసూచీ ద్రవ్యోల్బణం రిటైల్‌ ద్రవ్యోల్బణంవంటివి ఈ త్రైమాసికంలో వరుసగా 3.5శాతం,0.9శాతంగా నమోద య్యాయి. సెప్టెంబరు త్రైమాసికంలో జిడిపి 1.5శాతం తగ్గిపోయింది. ఈ రెండు ద్రవ్యోల్బణ గణాంకాలేఇప్పుడు ఆర్థికవృద్ధికి కీలకం అవుతున్నాయి. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు ప్రకటించినా రానున్న కాలంలో పెరుగుతాయే మోకాని ఇప్పటికిప్పుడు పెట్టుబడుల వృద్ధి కనిపించదనే చెప్పాలి. పన్నులతగ్గింపు కారణంగా భారత్‌ఖజానాపై 1.45 లక్షలకోట్ల భారం పడుతున్నదని ప్రభుత్వమే అంగీకరించింది. ఇప్పుడు ఈలోటు భర్తీకి అవసరమైన కార్యాచరణ ముఖ్యం. ఇందుకు పన్నురాబడులు పెంచు కోవడం, పన్నుల చట్రం పరిధిలోనికి ఇప్పటివరకూ ఉన్న ఎగవేతదారులను తీసుకురావడం, ఆర్థికవ్యవస్థలో లీకేజి లను అరికట్టడం అనేది ముఖ్య ఘట్టం. అంతేకాకుండా 2014నుంచి చెపుతున్నట్లుగా నల్లధనస్వాముల గుట్టు బైటికి తీయాల్సి ఉంది. ఇప్పటికీ ఈ కార్యాచరణ అంతంత మాత్రంగానే ఉంది. స్విస్‌బ్యాంకుల నుంచి గంపగుత్తగా సాధించిన సొమ్మేమీలేదు. ఈ దిశగా స్విస్‌ బ్యాంకుల దేశాలతో ఇప్పటికీ చర్చల రూపంలో కొనసాగు తూనే ఉన్నాయి. ఇక దేశీయంగా చూస్తే పన్నులరాబడి తగ్గింది. జిఎస్‌టి వసూళ్లు లక్షకోట్లకు కూడా చేరుకోలేక పోయాయి.ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకూ ఆర్థికలోటును చూస్తే పూర్తిసంవత్సర బడ్జెట్‌ లక్ష్యాలను సైతం దాటి పోయింది. ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై ఆర్థికవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తిరంగ వృద్ధి ప్రతికూలంగా ఉంది. కీలకరంగాలు అంటే ఎనిమిది ముఖ్య పారిశ్రామికరంగాల్లో ఉత్పత్తి ఆరుశాతానికి పడిపోయింది. ఆర్థికవ్యవస్థకు ఇప్పుడు ఉత్పత్తిరంగ వృద్ధి కీలకంగా మారుతోంది. ఇక ఆహారద్రవ్యోల్బణం మరొక కీలక పరిణామం. గణాంకాల ప్రకారం చూస్తే గడచిన రియల్‌ఎస్టేట్‌, వృత్తిపరమైన సేవలు,ప్రజాపాలన, రక్షణరంగం,ఇతర సేవలపరంగా వృద్ధి 4.3శాతంగానే ఉన్నాయి.వ్యవసాయం, అటవీశాఖ, మత్స్యపరిశ్రమశాఖ, మైనింగ్‌, క్వారీవిభాగాల్లో 2.1శాతం,0.1శాతంగా ఉంది. ప్రస్తుత త్రైమాసికానికిగాను దేశ ఆర్థికరంగంలో డిమాండ్‌ తగ్గింది. బహుళసంవత్సరాల కనిష్టానికి ఆటో అమ్మకాలు పడిపోయాయి. పారిశ్రామిక ఉత్పత్తి నీరసించింది. ఆర్థిక వేత్తల అంచనాల ప్రకారం చూస్తే జిడిపి వృద్ధి రానున్న నెలల్లో పెరుగుతుందని చెపుతున్నారు. అందుకు ప్రభు త్వం కల్పించిన ఉద్దీపనలు ఎంతమాత్రం సరిపోవని మరింతగా రాయితీలు ప్రోత్సాహకాలు, సడలింపులు ఉండాలని సూచిస్తున్నారు. అదిసరే ఇన్వెస్టర్లకు అవసర మైన వాతావరణం మరింతగా కనిపించాల్సిన అవసరం ఇప్పుడు నెలకొంది. ఎయిర్‌ఇండియా, బిపిసిఎల్‌ వంటి వాటిని ప్రైవేటీకరించడం, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా 1.05 లక్షలకోట్లు సమీకరించగలమన్న ధీమాతో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం నిధులు ఆర్థికలోటు భర్తీకి మాత్రమే పనికొస్తాయి. ఇక కరెంటుఖాతాలోటు, వాణిజ్యలోటు వంటి వాటిని కూడా సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు ట్రేడ్‌వార్‌ పుణ్యమా అని భారత్‌మార్కెట్‌కు కొన్ని దేశాల్లో గిట్టుబాటయిన వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని కొత్త మార్కెట్లను అన్వేషించుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. యూరోపియన్‌ యూనియన్‌ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలవైపు భారత్‌ ఎగుమతులు కీలకంగా మారాలి. అంతేకాకుండా దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితిని తొలగించేందుకు మరింతగా రోడ్‌మ్యాప్‌ ఇన్వెస్టర్లకు చూపించగలగాలి. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఆ దిశగానే చేపడుతున్న కార్యాచరణ మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. కనీసం రానున్న త్రైమాసికం నుంచి అయినా ఆర్థికవృద్ధిని పెంచుకుని, పన్నుల రాబడులు పెంచుకోగలిగితే కొంతమేర పెట్టు బడులు రావచ్చని అంచనా. ఆర్థికవృద్ధి వ ుందగించడంతో వచ్చే రెండుమూడు తేదీల్లో సమీక్ష నిర్వహించనున్న రిజర్వుబ్యాంకు రెపోరేట్లు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించక తప్పదని ఈ ధోరణులు మరింతగా స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న ఆర్థికవృద్ధిపరంగా భారత్‌ శరవేంగంగా వృద్ధిచెందుతున్న దేశం ట్యాగ్‌ను కోల్పో యింది. అలాగే 2024 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా చేరడం కూడా ఈ తీరుతో కష్టమే. ఉత్పత్తిరంగం, మౌలికవనరుల రంగం వృద్ధిలోనికి రాగలిగితే ఆర్థికవృద్ధికి బాటలు వేసినవారం అవుతామని ఆర్థిక నిపుణులు మాజీ ఆర్థికవేత్తలు, ఆర్‌బిఐ మాజీ గవర్నర్లు చెపుతున్న వాస్తవాలను పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వం ముందుకు కదలితే తప్ప ఆర్థిక మాంద్యం నుంచి బైటపడలేమన్నది సుస్పష్టం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/