విలీనంతో బ్యాంకులకు జవసత్వాలు!

bank
bank

బ్యాంకింగ్‌ రంగానికి జవసత్వాలందించే దిశగా నరేంద్రమోడీ ఎన్‌డిఎ-2 సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. భారీ కార్పొరేట్‌ సంస్థలకు రుణాలిచ్చే స్థాయి ఇప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకులకు లేదు. వీటికితోడు ఆర్థికవృద్ధి మందగించడంతో బ్యాంకర్లకు రికవరీల బెడద కూడా ఎక్కువగానే ఉంది. విలీనం అయిన మొత్తం 27 బ్యాంకులకు ప్రభుత్వం వాటా మూలధనం చేకూర్చి ప్రతి ఏటా ఎంతో కొంత ఆదుకుంటూ వస్తోంది. ఇదే విధానం అనుసరిస్తే ఇక బ్యాంకులకు ఆర్థికపరిపుష్టి జీవితకాలంలో జరగదన్న భావన ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి బలంగా నాటుకునిపోయింది. చిన్నచితక బ్యాంకులను పెద్దబ్యాంకుల్లో విలీనం చేయడంతోపాటు, వాటికి నిర్దిష్టమైన కాలం వరకు మాత్రమే ఆర్థికవనరులు అందించడం వంటి వాటికి ప్రాధాన్యతనిచ్చింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన పది బ్యాంకుల విలీనంతో నాలుగు పెద్ద బ్యాంకుల ఆవిర్భావం నిజంగా బ్యాంకింగ్‌ రంగానికి అవసరమే. భారత ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వ్యవహరించే స్థాయి ఉన్న బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం. కేవలం భారీస్థాయి పరపతికేకాకుండా ఎంఎస్‌ఎంఇ సంస్థలు, ఎన్‌బిఎఫ్‌సిలకు రుణగ్యారంటీ పథకాలు వంటివి అందితే తప్ప ఆర్థికవ్యవస్థలో మందగమనాన్ని పారద్రోలే పరిస్థితిలేదు. ఏడాది క్రితం బ్యాంకింగ్‌ వ్యవస్థ లో నిరర్ధక ఆస్తులుగా పేర్కొంటున్న మొండిబకాయిలు 8.65 లక్షలకోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఎన్‌సిఎల్‌టికి బదలాయించడం, డెట్‌రికవరీ ట్రిబ్యునల్‌కు వెళ్లడం వంటి చర్యలతో ఇప్పుడు అవి కొద్దిమొత్తం తగ్గి రూ.7.9 లక్షలకోట్లకు చేరాయి. రుణరికవరీలు కూడా కఠిన మార్గాల కారణంగా 1.21 లక్షలకోట్లు చేయగలిగామని ఆర్థికమంత్రి వెల్లడించారు. ఇదంతా మంచి పరిణామాలే. కేవలం ఒక్క విలీనంతోనే సమస్య పరిష్కారం కాదు. వీటితో ఎదుర్కొనే సవాళ్లు కూడా కీలకమే. ఇప్పుడు భారత్‌ ఆర్థికవ్యవస్థకు పెట్టుబడులు ముఖ్యం. 100 లక్షలకోట్ల మౌలిక వనరులరంగానికి ప్రైవేటు పెట్టుబడులతోపాటు ప్రభుత్వ వ్యయం కూడా పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదే జరగాలంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కార్పొరేట్లు, ఇతర ప్రైవేటు సంస్థలకు విరివిగా రుణపరపతి లభించాలి. చిన్న బ్యాంకులను విలీనం చేస్తే వాటిని మోసే పెద్దబ్యాంకులు వీటి సమస్యలను కూడా భరించాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్లకు సైతం విలీనం ద్వారా కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయి. వాటాదారులకూ అదే పరిస్థితి. కొత్తబ్యాంకుల్లో వారికి కేటాయించే వాటాల నిష్పత్తి కీలకం అవుతుంది. కస్టమర్లకు అయితే డెబిట్‌, క్రెడిట్‌కార్డులు, పాస్‌బుక్‌లు మార్చుకోవడం, రుణాలు తీసుకున్న కస్టమర్లకు వడ్డీ చెల్లింపులు వంటివి కొంత సమస్యలు లేవదీస్తాయి. ఇక ఆర్థికవ్యవస్థ పరంగా చూస్తే ప్రపంచదేశాల్లోని బ్యాంకులతో పోలిస్తే కనీసం 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఇప్పటికీ ప్రభుత్వరంగ భారత్‌ బ్యాంకు ఒక్కటి కూడా లేదు. ఇప్పుడిప్పుడే ఎస్‌బిఐ వచ్చి చేరింది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న విలీనాల వల్ల దేశంలో ప్రపంచ స్థాయి లావాదేవీలు నిర్వహించే స్థాయికి ప్రభుత్వ బ్యాంకులు ఎదుగుతాయి. ఎస్‌బిఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలుండగా రెండో అతిపెద్ద బ్యాంకుగా ఇప్పుడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అవతరిస్తోంది. ఈ విలీనాలతో ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యకూడా 27 నుంచి 12కి తగ్గిపోతున్నది. దీనివల్ల మెగా రుణపరపతికి ఆస్కారం ఉంటుందని, కార్పొరేట్లు ఎక్కువగా విదేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి రాదని చెపుతున్నప్పటికీ కార్పొరేట్‌రంగంలో నెలకొన్న అనిశ్చితి రుణాల రికవరీకి ఆటంకం కలిగిస్తున్నదన్న అంశం పాలకులకు సైతం తెలియంది కాదు. అందరికీ పక్కాఇళ్లు నిర్మాణం లక్ష్యం నెరవేరాలంటే తక్కువ వడ్డీకే గృహరుణాలిచ్చేందుకు బ్యాంకులతోపాటు నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు సైతం ముందుకురావాల్సిన అవసరం ఎంతోంది. వీటికి బ్యాంకులు సైతం చేయూతనివ్వాలి. నిజానికి పెద్దబ్యాంకుల వల్ల సాధారణ కస్టమర్లకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. పెద్ద బ్యాంకులు తమ వ్యాపారం లాభాలు తప్పిస్తే కస్టమర్ల ప్రయోజనాలను పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. పైగా చిన్నబ్యాంకులకు కస్టమర్లతో సన్నిహిత సంబంధాలుంటాయి. పెద్దబ్యాంకులకు ఈ సంబంధాలు తక్కువే. ఈదృష్ట్యానే కస్టమర్లు ఇప్పుడు పెద్దబ్యాంకుల నుంచి వలసవెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. డిజిటైజేషన్‌, యాప్‌బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు పెరిగిపోతున్న నేటి తరుణంలో ఇప్పటికీ బ్యాంకులకువెళ్లి లావాదేవీలు నిర్వహించుకునే సాంప్రదాయ కస్టమర్లు లేకపోలేదు .ఇటువంటి వారికి ఈ విలీనం వల్ల ఒరిగే పెద్దప్రయోజనాలు కూడా ఏమీ ఉండవు. ఈ కస్టమర్ల పట్ల పెద్దబ్యాంకులు కూడా అంతగా ఆసక్తి చూపించవు. కేవలం లాభాపేక్ష ఒక్కటేమినహా సేవాభావం కొరవడుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. అన్నింటికంటే కార్పొరేట్‌ రంగంలో రుణాల సొమ్మును బదలాయించేందుకు వినియోగించే డొల్ల కంపెనీలన్నింటినీ సమూలంగా నిర్మూలిస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు బ్యాంకింగ్‌ రంగం మరింత చేదోడు వాదోడుగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.