రాక్షసత్వానికి మించిన ఉన్మాదమిది!

HARASSMENT
HARASSMENT


చదువ్ఞ సంధ్యలు పెరిగే కొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పులు రావాలి. సభ్యతా సంస్కారాలు పెరగాలి. సాంకేతికంగా అభివృద్ధిచెంది విజ్ఞానం ఆర్జించేకొద్దీ మంచి ఏదో, చెడు ఏదో గ్రహించే విచక్షణాజ్ఞానం పెరగాలి.దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా తిరోగమిస్తున్నామేమోననిపిస్తున్నది. జరిగిన, జరుగుతున్న సంఘటనలు ఆవేదనే కాదు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థినిలపై జరుగుతున్న దాడులు కొందరు ఉన్మాదులు చేస్తున్న విన్యాసాలు సభ్యసమాజం తలవంచుకునేలా ఉన్నాయి. బుధవారం తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌జిల్లా హన్మకొండలో జరిగిన సంఘటన మళ్లీ ఒక్కసారి ఉల్లికిపరిచింది. ఏమిటిది? ఈ దారుణాలను నిరోధించలేరా?

ఇది నిరాటంకంగా జరగాల్సిందేనా? తదితర ప్రశ్నలు జవాబులు లేకుండా మిగిలిపోతున్నాయి. హన్మకొండ రాంనగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంగా ఒక ఉన్మాది మానవత్వం మరిచి అందరు చూస్తుండగా పట్టపగలు నడిరోడ్డులో తోటి విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పుఅంటించాడు. వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువ్ఞతున్న రవళి అనే విద్యార్థిని బుధవారం కాలేజీకి వెళ్తున్న సమయంలో అదే కాలేజీలో, అదే తరగతి చదువ్ఞతున్న సాయిఅన్వేష్‌ అనే యువకుడు పెట్రోలు పోసి దాడికి తెగబడ్డాడు.

దాదాపు అరవైశాతంపైగా కాలిన గాయాలతో రోడ్డుపై కొట్టుకుమిట్లాడుతున్న ఆమెను వరంగల్‌ ఎంజిఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవళి పరిస్థితి విషమంగా ఉందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. వరంగల్‌లో గతంలో కూడా ఇద్దరు యువతులపై ఆసిడ్‌ దాడి జరిగింది. అందులో ఒక యువతి మరణించగా మరో యువతి కోలుకోగలిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేశవ్యాప్తంగా విద్యార్థినిలపై ఈ అఘాయిత్యాలు, దాడులు అంతకంతకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. చట్టాలు ఎన్ని చేసినా, ఎంతమంది అధికారులను నియమించినా ఈచట్టాలు కానీ, ఆ అధికారుల కానీ వీటిని నియంత్రించలేకపోతున్నారు. పైగా అంతకంతకు పెరిగిపోతున్నాయి.

ఢిల్లీలోనిర్భయ కేసు అనంతరం చెలరేగిన ఆందోళనలతో కేంద్ర పాలకులు పకడ్బందీ చట్టం తీసుకువచ్చారు. కానీ ఆ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవి ఆగడం లేదు. అలాని పోలీసులు ఏమి చేయడం లేదని చెప్పడం లేదు. కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. జైళ్లకు పంపిస్తున్నారు. కొన్నింటిలో శిక్షలు కూడా వేయించగలుగుతున్నారు. కానీ అధికశాతం కేసులు వీగిపోతున్నాయి. ఈ కామాంధులకు పోలీసులన్నా, చట్టాలన్నా భయభక్తులు సన్నగిల్లుతుండటమే ఇందుకు కారణమనేది కాదనలేని వాస్తవం. అసలు ఈ సంఘటలన్నీ చూస్తుంటే సమాజం ఎటువైపు పయనిస్తుందనే అనుమానం రాకతప్పదు.

ఇవి మొదలు కాదు. చివర కూడా కాదు. కొన్ని కేసుల్లో పోలీసుల అసమర్థత, చేతకానితనాన్ని నేరస్తులు తెలివిగా వాడుకోగలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. హాస్టల్‌లోనే మానభంగం చేసి హత్యచేశారు. పోలీసుశాఖ సవాల్‌గా పరిగణించిన కేసులో పెద్దల హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైతేనేం పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వర్తించలేక నేరం ఎవరు చేశారో రుజువ్ఞ చేయలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడు నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. అంతేకాదు దర్యాప్తు ఎంత డొల్లగా ఉందో న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఇప్పుడు ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుంటే రికార్డులే మాయమైపోతున్నాయి. ఇలా ఎందరో విద్యార్థినిలు బలైపోతున్నారు. కొందరు తీవ్ర గాయాలతో బయటపడి జీవనం సాగిస్తున్నారు. అంతకుముందు విజయవాడలో ఎంసిఎ విద్యార్థి శ్రీలక్ష్మీని అదే కాలేజీకి చెందిన మనోహర్‌ అనే విద్యార్థి తనను ప్రేమించలేదని దారుణంగా హత్యచేశాడు. అంతకుముందు గుంటూరులో ఇంటర్‌ చదువ్ఞతున్న మరొక విద్యార్థినిని ఒక మేకానిక్‌ విద్యార్థులందరూ చూస్తుండగా ఏకంగా తరగతి గదిలోనే నరికిచంపాడు. ఇలా ఒకటి కాదు,రెండు కాదు. ఎన్నో సంఘటనల్లో విద్యార్థినులు బలైపోతున్నారు.

రక్తాన్ని పంచిపెంచిన బిడ్డ ఇలా అర్థరహితంగా ఉన్మాదానికి బలైతే ఆ తల్లి గర్భశోకాన్ని తీర్చేది ఎవరు? ఏమిచ్చి ఓదార్చగలరు? ఈ విష సంస్కృతి పెరిగిపోతున్న దనేందుకు జరుగుతున్న సంఘటనలు అద్దంపడుతున్నా యి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయనే విషయం పోలీసు రికార్డులు కూడా వెల్లడిస్తున్నాయి. విద్యార్థినిలపై వేధింపులకు అంతేలే కుండాపోతున్నది. చాలా వరకు ఇవి పోలీసు రికార్డుల్లోకి ఎక్కే అవకాశం తక్కువ. సంఘ టనలు జరిగినప్పుడో, గాయపడినప్పుడో, ప్రాణాలు పోయినప్పుడో తప్ప పోలీసు దృష్టికి వెళ్లడం లేదు. ఏ యువతీ తాను వేధింపులకు గురి అవ్ఞతున్నానని పోలీసు స్టేషన్ల మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి సాహసించడం లేదు.

పోలీసులు వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం అయ్యేపని కాదని ఒకవేళ అన్నీసమకూర్చిన వారు తీసుకునే చర్యలకు ఈ వేధింపులు ఆగిపోతాయని ఏ ఆడపిల్ల నమ్మే స్థితిలో లేదు. అలా నమ్మి పోలీసుల దృష్టికి తీసుకువచ్చిన కేసుల్లో కూడా ఏదో కౌన్సిలింగ్‌ పేరుతో కాలం గడిపి పంపుతున్నారే తప్ప నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు.మొన్న హైదరాబాద్‌ నడిబొడ్డులో జరిగిన సంఘటనలు ఇందుకు ఉదహరించవచ్చు. పాలకులు ఉక్కుపాదం మోపితే తప్ప ఈ దారుణాలు ఆగవ్ఞ.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌ , హైదరాబాద్‌