భారత జవాన్లకు జేజేలు

Indian Army
Indian Army


పొరుగుదేశం పాకిస్తాన్‌ పెంచిపోషిస్తున్న జైషేముహ్మద్‌ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో ఆత్మాహుతి దాడికి తెగబడి 40 మంది భారతీయ జవాన్లను పొట్టనపెట్టుకున్న తర్వాత ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆకాంక్ష దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతున్నది. దెబ్బకు దెబ్బ తీస్తేనే పాకిస్తాన్‌ ఆగడాలకు అడ్డుకట్టవేసినట్లవుతుందని ఏమాత్రం ఓర్పువహిస్తే అది అసమర్ధత కింద వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అదేధోరణిలో ముందుకు అడుగులు వేస్తున్నది. అందులోభాగంగానే మంగళవారం వాస్తవాధీన రేఖవెంబడి ఉన్న ఉగ్రవాద సంస్థల స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి.

అంతకుముందు కూడా ఈ పుల్వామా దాడులకు సంబందించిన ఉగ్రవాదులను ఆరడజనుమందికిపైగా భారత జవాన్లు మట్టుపెట్టారు. యుద్ధం అనివార్యం అనిపిస్తున్నా ఆ మాట ఎత్తకుండా భారత సేనలు ఉగ్రవాదంపై పోరుకు సమాయత్తం అయినట్లు సంకేతాలిస్తూ దాడులు నిర్వహిస్తున్నారు. మరొకపక్క పాకిస్తాన్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక పక్క అన్నింటికంటే ముఖ్యంగా సింధు నదిజలాలను పాకిస్తాన్‌కు పోకుండా అడ్డుకునేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

వాస్తవంగా సింధూనది జలాలు పాకిస్తాన్‌ భూభాగంలో పారకపోతే లక్షలాది ఎకరాలు బీడుగా మారిపోవడమే కాక మంచినీటికి కూడా కోట్లాది మంది ప్రజలు కటకటలాడే పరిస్థితులు ఏర్పడతాయి. సింధూనది జలాల ఒప్పందానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. భారత్‌ పాక్‌లమధ్య 1960లో ఈ ఒప్పందం కుదిరింది. ఇన్నేళ్లలో భారత్‌ పాక్‌లమధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డా రెండు యుద్ధాలు చోటుచేసుకున్నా మరెన్నో ఒడిదొడుకులు ఎదురైనా దశాబ్దాల తరబడి ఈ ఒప్పందం అమలవుతూనే ఉన్నది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

టిబెట్‌లోని మానససరోవరం కైలాష్‌ పర్వతాల్లో సిందూనది పుట్టి జమ్ముకాశ్మీర్‌లోని లడక్‌మీదుగా గిల్గిత్‌, బాల్టిస్టాన్‌నుంచి పాకిస్తాన్‌లోని పంజాబ్‌రాష్ట్రంలోనికి ప్రవేశించి అక్కడ బీడుభూములను సస్యశ్యామలం చేస్తూ కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలుస్తున్నది. సిందూనది ఉపనదుల్లో అనేకం భారత్‌లోని జమ్ముకాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా రాజస్థాన్లమీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లోప్రవేశిస్తాయి. నదిమొత్తం 3180 కిలోమీటర్లు పొడవుతో ప్రపంచంలోనే పెద్దనదుల్లో సింధూ 21వ స్థానంలో ఉంది.

చైనాభారత్‌, ఆఫ్గనిస్తాన్‌,పాకిస్తాన్‌లలోప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం దాదాపు పదకొండున్నర లక్షల చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్‌కు సింధూ నది జీవనాడిలాంటిదే. ఆదేశంలో నిర్మితమైన కాలువలు, ప్రాజెక్టులు ఆయకట్టులకింద దాదాపు 90శాతానికిపైగా భూములు ఈ నీటితోనే సస్యశ్యామలం అవుతున్నాయి. మూడు భారీ డ్యామ్‌లు అనేక చిన్నా చితకా పథకాలు సింధూపరీవాహక ప్రాంతంలోనివే. సింధూనది సాగునీటి అవసరాలతోపాటు విద్యుత్‌ అవసరాలను కూడా తీరుస్తున్నది. స్వాతంత్య్రానంతరం దేశ విభజన జరిగినపుడు సిందూనది విషయంలో భారత్‌ తమను కట్టడిచేస్తున్నదన్న అనుమానంతో నదీజలాల ఒప్పందానికి పాక్‌ గట్టిపట్టేపట్టింది.

అధికారికంగా ఒప్పందం కుదిరేవరకూ యధాతథ స్థితిని కొనసాగించాలని రెండుదేశాలు అంగీకారానికి వచ్చాయి. బెలూచిస్తాన్‌, కాశ్మీర్‌ విషయంలో పాక్‌ ఒప్పందాలను కాలరాసింది. ఒకవేళ ఆకారణంగా సిందూ ఒప్పందాలవిషయంలో భారత్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్తాన్‌ మొత్తం ఎడారిగా మారుతుందని అప్పట్లోనే ఆదేశ నాయకత్వం తీవ్ర ఆందోళనకు గురయింది. ఆ అనుమానంతోనే అమెరికాను ఆశ్రయించింది. పాక్‌ అభ్యర్ధనమేరకు అమెరికా అణుశక్తి కమిషన్‌ ఛైర్మన్‌ డేవిడ్‌ లీలెంతల్‌ను సమస్య పరిష్కారకర్తగా పంపించింది.

నదీజలాల అధ్యయనం జరిపిన లీలెంతల్‌ సింధూ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధిచేసుకోవడంద్వారా ఉభయదేశాలు అహార కొరతను అధిగమించవచ్చని చెప్పారు. ప్రపంచ బ్యాంకు కూడా సింధూనదీజలాల ఒప్పందం చేసే ప్రయత్నంచేసింది. ఆ తర్వాత 1960లో భారత్‌ పాక్‌ మధ్య కరాచిలో కుదిరిన ఒప్పందంపై ఆనాటి భారత ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ పాక్‌ అధ్యక్షులు ఆయూబ్‌ఖాన్‌ సంతకంచేసారు. కానీ ఈ ఒప్పందం పాకిస్తాన్‌కే అధికశాతం అనుకూలంగా ఉన్నట్లు అప్పట్లోనే విమర్శలు పెల్లుబికాయి.

ఆనాటి ప్రఛ్ఛన్న యుద్ధ వాతావరణపరిస్థితుల్లో రష్యాను కట్టడిచేయాలంటే పాక్‌ అవసరం అమెరికాకు ఉండటంతో అమెరికా బ్రిటన్‌లుపాక్‌ వైపే మొగ్గుచూపాయి. మరొకపక్క నిధులకోసం అమెరికా బ్రిటన్‌లపై ఆధారపడ్డ భారత్‌ విధిలేని పరిస్థితుల్లో ఆ ఒప్పందంపై సంతకంచేసింది. ఆ తర్వాత ఎన్ని విభేదాలొచ్చినా మరెంత ఉద్రిక్త పరిస్థితులు రెండుదేశాలమధ్య ఏర్పడినా చివరకు 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినపుడు కూడా భారత్‌ గౌరవిస్తూనే వచ్చింది. ఉగ్రవాదాన్ని నియంత్రించాలనే భారత్‌ అభ్యర్ధనను పాక్‌ నేతలు ఏనాడూ పట్టించుకోలేదు.

పైగా పాలుపోసి పెంచినట్లు నిరంతరం ఉగ్రవాద కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. అది ఎన్నోసార్లు భారత్‌ రుజువుచేసింది కూడా. ఇపుడు మళ్లీ పుల్వామా దాడిలో పాక్‌ హస్తం ఉందనేది జగద్విదితమే. అయినా ఆధారాలివ్వండి చర్యలు తీసుకుంటున్నామని ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంటూఏదో మాటలతో కాలం గడుపుతున్నారే తప్ప నిర్దిష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాక్‌ సరైన గుణపాఠం చెప్పాలని సింధూజలాల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈనిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. సిందూజలాల విషయంలో చర్యలు తీసుకునేందుకు ఇదే సరైన సమయంకూడా. సిమ్లా ఒప్పందం లాంటి అనేక కీలక ఒప్పందాలను కాలరాసిన పాక్‌ విషయంలో మనమెందుకు జల ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి? పాక్‌ను ఇటు జలాస్త్రంతోటే కాక అన్ని కోణాలనుంచి దిగ్బంధం చేయాల్సిన తరుణం ఇది.

  • దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌