భాగ్యనగరానికి మరో మణిహారం!

               భాగ్యనగరానికి మరో మణిహారం!

METRO
METRO

హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టే మెగాప్రాజెక్టుల్లో ఒకటి మెట్రోరైల్‌ నిర్మాణం. ఆకాశ మార్గాన రైలుప్రయాణం నగర వాసులకు చేరువచేసినపాలక యంత్రాంగం రెండుదశలను పూర్తిచేసుకుంది. నగరానికి మణిహారంగా నిలిచే ఈప్రాజెక్టు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మాటనిజమే, అలైన్‌మెంట్లు, ఇటు బ్లూప్రింట్లు పలురకాలుగా మార్చి,జనాభిప్రాయసేకరణ అనంతరం ఎట్టకేలకు ఎల్‌అండ్‌టిసంస్థక ఈనిర్మాణ బాధ్యతలు అప్పగించారు. మొదటిదశ నిర్మాణం ట్రయల్‌బేస్‌గా పూర్తిచేసుకుంది. ఇపుడు నగరవాలసులకుఅ త్యంత కీలకమైన అమీర్‌పేట్‌ ఎల్‌బినగర్‌ రైలుమార్గం సిద్ధంచేసిప్రజలకు అంకితంచేసింది. దీనితో ఐటికారిడార్‌ను నగరవాసులకు మరింత చేరువచేసినట్లయింది.

రవాణా వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న 500ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్‌ అవసరాలు ఎంతమాత్రం తీర్చలేకపోతున్నది. అలాగని సిటీబస్‌ రవాణా కూడా కష్టంతో కూడుకున్నపనే. తరచు ట్రాఫిక్‌ రద్దీతోపాటు అడుగడుగునా ఎదురవుతున్న ఆటంకాలతో సకాలంలో గమ్యస్థానాలకు చేరలేనిప్రయాణీకులకు ఇపుడు మెట్రోరైల్‌ ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. నగరంమొత్తం అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన స్టేషన్లలో ఒకటి రెండునిమిషాలకు మించి ఆగకుండానిర్దేశించిన వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేర్చగలిగే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటుచేసింది. దేశంలో ఢిల్లీ తర్వాత అత్యంత ఆధునిక ప్రాజెక్టును ఏర్పాటుచేసింది ఒక్క హైదరాబాద్‌లోనే అని ప్రత్యేకించి చెప్పనవసరంలేదు.

ఇపుడున్న బెంగళూరు,చెన్నైనగరాలను సైతం అధిగమించింది. పబ్లిక్‌ప్రైవేటు భాగస్వామ్యంలోనిర్మించిన ప్రపంచ మెట్రోప్రాజెక్టుల్లోనే అతిపెద్ద ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ అని చెప్పాలి. అందులోనూ ప్రాజెక్టు వ్యయంలో 90శాతం ఖర్చును ఒక ప్రైవేటుసంస్థ భరించడం ఇదే ప్రథమం. పక్షి,వెన్నెముకను రెక్కలనుప్రేరణగా తీసుకని మెత్తం మెట్రో స్టేషన్లను రోడ్డుమధ్య స్తంభాలపై ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించడం నిజంగా ఒక ఇంజనీరింగ్‌ అద్భుతమే. మెట్రోకు అనుసంధానంగా ఫీడర్‌ బస్సులు, కాలుష్యరహిత విద్యుత్‌ వాహనాలు, సైకిళ్లు, హరితారణ్యాలను తరలపించేవిధంగా మెట్రోస్టేషన్లను తీర్చిదిద్దడం అంతర్జాతీయ ప్రమాణాలకు నిదర్శనం అని చెప్పాలి.

అంతేకాకుండా నిజాం కాలంనాటి 500 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌కు మణిహారంగా నిలుస్తున్న ఈ ప్రాజెక్టు నగర వాయవ్య ప్రాంతాలను, ఈశాన్య ప్రాంతాలను నగరం మధ్యనుంచి ఈ కారిడార్‌ కలుపుతోంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకరైలును అందుబాటులోనికి తెచ్చిన ఎల్‌అండ్‌టి మెట్రోరైల్‌ ఈప్రాజెక్టు నిర్వహణలో తన సత్తాను చాటిందనే చెప్పాలి. తాజాగా ప్రారంభించిన అమీర్‌పేట్‌-ఎల్‌బినగర్‌ మార్గం మొత్తం 16 కిలోమీటర్లు బస్సులో వెళ్లాలంటే గంటన్నరకుపైగా పడుతుంది. అదే మెట్రోలో అయితే కేవలం 52నిమిషాల్లోనే చేరుకోవచ్చని మెట్రో యంత్రాంగం భరోసా ఇస్తోంది. నిత్యం ఐటికారిడార్‌కు వెళ్లే లక్షలాదిమంది ఉద్యోగులకు మెట్రో ఒక వరంగా లభించిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

పైగా ఎక్కడా మారాల్సిన అవసరం లేకుండానే మియాపూర్‌వాసులు నేరుగా ఎల్‌బినగర్‌వరకూ ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. నగరంలోనేఅంతర్గత రవాణా వ్యవస్థలోనేడు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ అత్యంత కీలకరవాణా వ్యవస్థగా రూపాంతరం చెందింది. గత ఏడాది ప్రధానిమోడీ 30 కిలోమీటర్ల నిడివికిగిననాగోల్‌నుంచి అమీర్‌పేట్‌వరకూ ఉన్న కారిడార్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరుసటిరోజునుంచే మెట్రోలో ప్రయాణీకులను అనుమతించారు. రెండోవిడతగా ఇపుడు ఎల్‌బినగర్‌నుంచి అమీర్‌పేట్‌వరకూ ఏర్పాటుచేసారు. దీనివల్ల మియాపూర్‌నుంచి అమీర్‌పేట్‌ తిరిగి నాగోల్‌నుంచి అమీర్‌పేట్‌, అలాగే అమీర్‌పేట్‌నుంచి ఎల్‌బినగర్‌లకు ప్రయాణానికి మరింత సుళువవుతుంది.

అత్యాధునిక సిగ్నల్‌ వ్యవస్థతోపాటు, విదేశీ తయారీ రైలు బోగీలు, ట్రాకింగ్‌ వ్యవస్థ మొత్తం విదేశీ సాంకేతికపరిజ్ఞానంతోనే ఏర్పాటుచేసారు. మొత్తం ఇపుడు నగరంలో 46 కిలోమీటర్లమేర మెట్రోరైల్‌ విస్తరించింది. ఇప్పటివరకూ రెండుమూడుస్థానాల్లో ఉనన బెంగళూరు 42.3 కిలోమీటర్లు, చెన్నై 35.3 కిలోమీటర్ల మెట్రో స్థానాలను హైదరాబాద్‌ వెనక్కి నెట్టేసింది. ఇక్కడ చెప్పుకోదగిన మరోవిశేషం ఏమిటంటే ఎల్‌బీనగర్‌ మియాపూర్‌ మార్గంలోని ఎంజిబిఎస్‌ బస్‌స్టేషన్‌. ఆసియాలోనే అతిపెద్ద మెట్రోస్టేషన్లలో ఒకటిగా చెప్పవచ్చు. మియాపూర్‌, ఎల్‌బినగర్‌, జెబిఎస్‌ ఫలక్‌నుమా మెట్రోమార్గాలకు ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌గా ఏర్పాటుచేసారు.

ఒకటిరెండు అంతస్తుల్లో ఎల్‌బినగర్‌, మూడునాలుగు అంతస్తుల్లో జెబిఎస్‌ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటుచేసి అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించారనే చెప్పాలి. అత్యంత ఎత్తుగా 58 స్తంభాలు, ఆరుగ్రిడ్స్‌తో ఏర్పాటయిన ఈ స్టేషన్‌ ఆసియాలోని అతిపొడవైన స్టేషన్లలో ఒకటి. 140 మీటర్లపొడవు, 45 మీటర్ల వెడల్పుతోఈ స్టేషన్‌ ఉంటుంది. మరోముఖ్యమైన నాగోలు హైటెక్‌సిటీ మార్గం కూడా పూర్తయితే హైటెక్‌సిటీ ఐటి కారిడార్‌కు అతిచేరువ అవుతుందని అంచనా. అలాగే ఎంఎంటిఎస్‌ మార్గాన్ని యాదాద్రివరకూ పొడిగించేయోచన, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టువరకూ ఎంఎంటిఎస్‌ నిర్మాణం వంటివిచేపడితే కీలక రవాణా వ్యవస్థలకు స్థానిక రవాణాను అనుసంధానం చేసినట్లవుతుంది.

తద్వారా మన పాలకులు ప్రయాణీకులకు మరింతమేలుచేసినవారవుతారు.సకాలంలో చేరుకోగలమోలేదోనని ఆదుర్దాతో పరుగులుతీసే సగటు నగర ఉద్యోగులకు మెట్రోరైల్‌లాంటి రవాణావ్యవస్థ నిరంతరాయంగా సేవలందుతుండటం వల్ల ట్రాఫిక్‌ రద్దీసైతం తగ్గుతుందని నిపుణుల అంచనా. మొత్తంగా అస్తవ్యవస్థ ట్రాఫిక్‌తో సతమతం అవుతున్న నిజాం నగరానికి కంఠాభరణంగా మెట్రోరైల్‌ నిలిచిందనడంలో సందేహంలేదు.
– దామెర్ల. సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌