బైటపడిన పాక్‌ కపటనాటకం!

                బైటపడిన పాక్‌ కపట నాటకం!

Pakisthan
Pakisthan

ఇండోపాకిస్తాన్‌ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు న్యూయార్క్‌లో ఏర్పాటుచేసిన ఇరుదేశాల విదేశాంగమంత్రుల సమావేశం రద్దయింది. పాక్‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ రెండుదేశాలమధ్య శాంతిచర్చలను పునరుద్ధరించాలని ప్రధాని మోడీకి ఓపక్క లేఖరాస్తూనేమరోపక్క సరిహద్దుల్లో మిలిటెన్సీని ప్రోత్సహిస్తున్నట్లుగా రెండురోజులుగాజరిగిన సంఘటనలు రుజువుచేస్తున్నాయి. భారత సైనికుడి పీకను తెగకోసి పాక్‌ ముష్కరులు తమ కిరాతకాన్ని ప్రదర్శించారు. పాకిస్తాన్‌ కపటవైఖరి ఈ దుశ్చర్యలతోమరోసారి బైటపడిందని, పైకి కనిపిస్తున్నట్లుగా శాంతిచర్చలకు రావాలన్న ఉద్దేశ్యం ఎంతమాత్రం కనిపించడంలేదన్న భావన భారత్‌లో వ్యక్తం అవుతోంది.

వాస్తవానికి విదేశాంగ మంత్రులుగా భారత్‌వైపునుంచి సుష్మస్వరాజ్‌, పాకిస్తాన్‌ మంత్రి షామహ్మద్‌ఖురేషిలు న్యూయార్క్‌లో సమావేశం కావాల్సి ఉంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశాలకు హాజరవుతున్ననేపథ్యంలో వీరిద్దరి భేటీతో శాంతిచర్చల పునరుద్ధరణకు మార్గం ఏర్పడుతుందని భావించారు. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలుచూస్తే శాంతిచర్చలు కొనసాగే అవకాశాలు చూచాయగా కూడా కనిపించడంలేదు ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశాలు ఈనెల 25వ తేదీ న్యూయార్క్‌లో ప్రారంభం కానున్నాయి.తొమ్మిదిరోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సమితి సభ్యదేశాలన్నీ హాజరవుతాయి. శాంతిచర్చలకు అమెరికా సరయిన వేదిక అనిభావించిన భారత్‌ ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీకి అంగీకరించింది.

అదేకనుక జరిగి ఉంటే రెండుదేశాలమధ్య ఇదే అత్యున్నతస్థాయి సమావేశంగా భావించాలి. అయితే ఇటీవల జరిగిన సంఘటనలు ఈ సమావేశానికి విఘాతం కలిగించాయి. సరిహద్దుల్లో చొరాబాటుదారులతో ఉగ్రవాదులు, వేర్పాటువాదశక్తులతోకలిసి పెచ్చుమీరుతున్న ఆగడాలు, 2016లోనే పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో జరిపిన ఉగ్రచర్యలతో భారత్‌ పూర్తిగా పాకిస్తాన్‌తో చర్చలను పూర్తిగా నిలిపివేసింది. అంతేకాకుండా మనరక్షణ సిబ్బందిని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థలు సానుభూతిపరులు ఘోరంగా హత్యచేయడం, అలాగే పాకిస్తాన్‌కూడా అధికారికంగా ఉగ్రవాదులను, ఉగ్రవాదచర్యలను ప్రశంసించి వెన్నుతట్టేవిధంగా 20 పోస్టల్‌ స్టాంపులను విడుదలచేయడం వంటి చర్యలతో ఇక పాకిస్తాన్‌ తన వైఖరిని ఎంతమాత్రం మార్చుకోదన్న భావన స్పష్టంఅయింది.

సరిహద్దుల్లో శాంతిచర్చలు విఘాతం కలిగేటటువంటి దుశ్చర్యలకు పాకిస్తాన్‌ప్రేరేపిత ఉగ్రసంస్థలు తెగబడుతున్న తరుణంలో చర్చలు జరిపి శాంతిస్థాపనకు కృషిచేయడం అనేది అర్ధరహితంఅని రాజకీయ పరిశీలకులు సైతం చెపుతున్నారు. సరిహద్దుల్లో సైనికులపై జరిపిన ఘాతుకానికి సరైనసమయంలో సరైన రీతిన స్పందిస్తామని భారత్‌ ఇప్పటికే స్పష్టంచేసింది. ప్రస్తుతం మారిన సమీకరణాలు, మారిన పరిస్థితుల దృష్ట్యా భారత్‌ పాకిస్తాన్‌లమధ్య ఇకపై చర్చలు ఉండవని, న్యూయార్క్‌ సమావేశాన్ని సైతం రద్దుచేస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. జమ్ముకాశ్మీర్‌కు చెందిన ముగ్గురు పోలీసులను కిడ్నాప్‌చేసి మిలిటెంట్లు శుక్రవారం ఘోరంగా హతమార్చిన సంఘటన కేంద్ర రాష్ట్రాలను తీవ్రంగా కలచివేసింది.

తరచూ జరుగుతున్న ఈఘాతుకాలు కాశ్మీర్‌లోయలో ఉగ్రవాదం ఇప్పటికీ వేళ్లూనుకునే ఉన్నదని స్పష్టంచేస్తోంది. ఇలాంటి చొరబాట్లు, రక్షణదళాల కాన్వా§్‌ులపై తరచూ దాడులకు పాల్పడటం సరిహద్దు రాష్ట్రంలో కొత్తేమీ కాదు. అయితే ఎప్పటికప్పుడు ఈదుశ్చర్యలపై భారత్‌ తగినరీతిన స్పందిస్తూనే ఉంది. అంతర్జాతీయ వేదికలపై తన నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉంది. అయినా పాకిస్తాన్‌ వైఖరిలో మార్పురాలేదు. క్రికెట్‌నుంచి రాజకీయాల్లోనికి ప్రవేశించిన ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పిటిఐ ప్రభుత్వంలో అయినా మార్పు వస్తుందని భావించింది. అందుకు తగినట్లుగానే ఇమ్రాన్‌ భారత ప్రధానికి లేఖరాసి శాంతిచర్చలు పునరుద్ధరించాలని కోరడంతో సానుకూల పరిణామాలకు తావిచ్చినట్లవుతుందని భారత్‌ భావించింది.

అయితే ఇదంతా కేవలం కపటనాటకమేనని జరిగిన సంఘటనలు రుజువుచేసాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై పాకిస్తాన్‌ ఉగ్రమూకలు చొరబడి కాల్పులుజరిపిన సంఘటన తర్వాత 2016 నుంచి పాకిస్తాన్‌తో చర్చలకు భారత్‌ విముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖవెంబడి తరచూ చొరబాట్లు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రతినిత్యం దాడులకు తెగబడటం భారత్‌కు ఆగ్రహం కలిగిస్తూనే ఉంది. దౌత్యసాంప్రదాయాలనుసైతం పాకిస్తాన్‌ ఉల్లంఘిస్తోందని ఈ సంఘటనలు రుజువుచేస్తున్నాయి. చర్చలపరంగా ఇరుదేశాల సైనికాధికారులమధ్య భారత్‌లో జరిగిన తర్వాత జాదవ్‌కు సైనికకోర్టు ఉరిశిక్ష విధించడం, అంతర్జాతీయన్యాయస్థానంలో భారత్‌ అప్పీలుచేయడంలాంటి కార్యాచరణ పూర్తయింది.

పాకిస్తాన్‌పరంగా శాంతిచర్చలకు తాము సిద్ధమేనని పైపైకి చెపుతున్నా అంతర్గతంగా కాల్పులను, ఉగ్రకార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నదని చెప్పడానికి భారత్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటనలేనని చెప్పవచ్చు. ముందు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను ఏకాకిని చేస్తే తప్ప పాక్‌ వైఖరిలో మార్పురాదన్న భావనను భారత్‌ గుర్తించి ఆదిశగా ముందుకదలాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఇప్పటికే సరిహద్దు చెక్‌పోస్టుల్లోను, అంతర్జాతీయ సరిహద్దువెంబడి ముష్కరుల జొరబాట్లను పాకిస్తాన్‌ ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్న సాక్ష్యాధారాలు ఎన్ని చూపించినా పాక్‌లో తెంపరితనం మరింతపెరిగింది. ఈ వైఖరిని కట్టడిచేయలేనిపక్షంలో విలువైన సరిహద్దుసైనికుల్లో మరికొందరి ప్రాణత్యాగాలనుసైతం మనం చవిచూడాల్సి ఉంటుంది.
– దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌