ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

సత్ఫలితాలివ్వని పథకాలు:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం
బాలల సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఈ పథకాలు సత్ఫలితాలివ్వడం లేదని యునెస్కో తాజా నివేదిక తెలియ చేస్తోంది. 2015వ సంవత్సరంలో అంతర్జాతీయ సూచిలో 97వ స్థానంలో ఉన్న మనదేశం బాలల సంక్షేమం రంగంలో ఈ సంవత్సరం 102 స్థానానికి దిగజారిపోయింది. బాలల వికాసం కోసం నీతి ఆయోగ్‌ రెండేళ్ల క్రితం ఆవిష్కరించిన సామాజికభద్రతా పథకం నేటి వరకు కార్యరూపం దాల్చలేదు. రక్షిత మంచినీరు, పౌష్టికాహారం, ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణార్థం టీకాలు, పరిశుభ్రమైన వాతావరణంలో బాలలను పెంచడం వంటి అంశాలలో దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతుండడం శోచనీయం.

పటిష్ట ప్రతిపక్షం అవసరం:- ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
ఇటీవలి పార్లమెంట్‌ ఎన్నికల్లో మోడీ సారధ్యంలోని ఎన్డీయే 43.8 శాతం ఓట్లతో 350కుపైగా లోక్‌సభ స్థానాలు సాధించి చారిత్రాత్మక విజయం నమోదు చేయగా కేవలం 90 సీట్ల దగ్గరే కాంగ్రెస్‌ సారధ్యంలోని యుపిఏ ఉండిపోయింది. పైగా వరుసగా రెండవసారి కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షం హోదాను సాధించడంలో దారుణంగా విఫలమయింది. కాని 2014లో మాదిరిగానే గట్టి ప్రతిపక్షం లేనిలోటు ఈసారి భారత పార్ల మెంటరీ ప్రజాస్వామ్యానికి చేటుగా మారే ప్రమాదంపై ప్రజా స్వామ్యవాదుల ఆందోళన సహేతుకమైనది. పార్టీ దూకుడును నిలువరించి దిద్దుబాట్లకు ఆస్కారమిచ్చే పటిష్ట ప్రతిపక్షం లేకపోవడం మోడీ ప్రభుత్వానికి తీరనిలోటు.

డిటెన్షన్‌ విధానం:-కె.వి సుభాష్‌,విశాఖపట్నం

ఎనిమిదవ తరగతిలో డిటెన్షన్‌విధానం ప్రవేశపెట్టాలి. ఎందు కంటే పబ్లిక్‌పరీక్ష అంటే విద్యార్థులు చదువ్ఞమీద ఆసక్తి చూపు తారు. లేకపోతే ఆటపాటల్లో పడి చదువ్ఞ అశ్రద్ధ చేస్తారు. పాస్‌ మార్కులు 30 శాతం నిర్ణయించాలి. పాస్‌ అయిన వాళ్లకి సర్టిఫికెట్‌, పరీక్ష తప్పిన వారికి మార్కులిస్టు ఇవ్వాలి. మార్కులిస్టులో అభ్యర్థిపూర్తిపేరు, పుట్టిన తేదీ, అడ్రసు, వివిధ వివరాలను నమోదు చేయాలి. ఇది ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుంది. పదవ తరగతి చదవాలనుకొంటే తప్పని సరిగా పాస్‌ ధృవపత్రం దరఖాస్తుకి జతచేయాలి.

ముందుచూపు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ
పాకిస్థాన్‌ జైషేస్థావరంపై భారత క్షిపణిదాడులపై యావత్‌ అంతర్జాతీయసమాఖ్య దృష్టి సారించిన వేళ, అబుదాబిలో ఇటీవల జరిగిన ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ 46వ సమావేశంలో దాయాది దేశం, దాని దుశ్చర్యలకు మద్దతు ఇస్తున్న చైనా వైఖరిపై భారత ప్రధాని ఎండగట్టిన వైనం అపూర్వంగా ఉంది. పాకిస్థాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇండోనేషియా, తదితర ముస్లిం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసినా భారత్‌ తనదైన దౌత్యరీతి ప్రదర్శించడం అద్భుతంగా ఉంది. ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఆశ్రయం అందిస్తున్న దేశాలు వాటి వైఖరి తక్షణం మార్చుకోవాలని లేకుంటే వాటిపై పశ్చిమదేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాలన్న భారత్‌ వైఖరికి అన్ని దేశాలు స్పందించడం శుభపరిణామం.భవిష్యత్తులో భద్ర తా మండలి శాశ్వత సభ్యత్వ సాధనకు ఒఇసి మద్దతు కీలక మన్న భారత్‌ ముందుచూపు హర్షణీయం.

పనితీరుపై దృష్టి పెట్టాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌
నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి నూతన మున్సిపాలిటీలో మౌలిక వసతుల రూపకల్పన జరగాల్సిన అవసరం చాలా ఉంది. కొత్త మున్సిపాలిటీలో అధికారులను, ఉద్యోగులను నియమించాలి. ఇన్‌ఛార్జ్‌ అధికారులను పెట్టడం వలన ప్రజలకు జరగాల్సిన పనులు సకాలంలో జరగవ్ఞ. అంతే కాకుండాతాగునీటి, పారిశుద్ధ్యం సమస్యలు లేకుండా చూడాలి.

నిధుల కొరతను అధిగమించాలి: -బి.సురేష్‌, విజయవాడ
దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న మిషన్‌ భగీరథ, పాలేరు ప్రాజెక్టులకు కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వకపోవడం శోచనీయం. ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజ లందరికీ సురక్షితమైన నీరు, పూర్తిస్థాయిలో ఉపరితల జలా లను అందించే ఈ బృహత్తర ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో కనీసం 70 శాతం నిధులను కేంద్రం భరించాలి. 2015లో నీతి ఆయోగ్‌ సిఫార్సులు చేసినా రాజకీయ కారణాల వలన కేంద్రం ఒక్కపైసా కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సంఘం కల్పించుకొని ప్రజాహితమైన ఈ రెండు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. అలాగే కోటి ఎకరాలకు సాగునీరుఅందించే కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ స్థాయి ప్రాజె క్టుగా ప్రకటించి నిధులను తక్షణమే విడుదల చేయాలి.