ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

ధరలను పెంచకూడదు: :- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. జానెడు పొట్టకోసం ఇతర రాష్ట్రాలు పోయిన వలస కూలీలు గోడకు కొట్టిన బంతిలా ఏ ఊరుకాఊరు వందల కిలోమీటర్లు నడిచి తిరిగి వస్తున్నారు.

కరోనా మహమ్మారి శివతాండవంతో గడపదాటని దుస్థితికి తీసుకువచ్చింది. డీజిల్‌ ధర పెరగడంతో ఆటోలు కూడా మొండికేశాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ సరుకుల ధరలు పెంచడం మూలిగే నక్కపై తాడికాయపడ్డట్టు ఉంది. రేషన్‌ సరుకులు తెచ్చుకుని ఒక్క పూటైనా కలోగంజితో బతకుతుంటే ప్రభుత్వం దయ చూపే పరిస్థితి కనపడటం లేదు.

సంక్షేమ పథకాలకు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తామంటున్న ప్రభుత్వం తిండిలేక అలమటించే బడుగు లకు ఇచ్చే రేషన్‌ సరుకుల ధరలు పెంచడం అమానవీయం. రేషన్‌ సరుకుల ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలి.

తిరుమలలో దర్శనం అద్భుతం: -సింగంపల్లి శేషసాయి కుమార్‌, రాజంపేట

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌ అనంతరం భక్తులను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం అమలు చేయడంలో కచ్చితంగా సఫలీకృతం అయ్యారు అనే చెప్పవచ్చు.

ఎందుకం టే ఒక భక్తుడు తన జీవితకాలంలో ఇలాంటి దర్శనం చేసు కుంటానని కనీసం ఊహించి అయినా ఉండడు. ఎక్కడా మని షినితగలకుండా కేవలం నిర్దేశించినసమయంలో భక్తుడు వెళితే అరగంటలో బయటకు రావడం నిజంగా అభినందనీయం.

బంగారు వాకిలి నుండి స్వామిని చూస్తూ వెళుతుంటే నిజంగా ఇది తిరుమలేనా అన్న అనుమానం కలిగింది. ఇకపై కూడా భక్తులకు ఇలాంటి దర్శనం కల్పిస్తే మంచిది..

లాక్‌డౌన్‌ విధించాలి:-పూసాల సత్యనారాయణ, హైదరాబాద్‌

విచ్చలవిడిగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడు తున్న మహమ్మారి కరోనాను లాక్‌డౌన్‌తో కళ్లెం వేయాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వ నిర్ణయం మంచిదే.

కఠిన ఆంక్ష లు విధించి కట్టడి చేయాలి.

ప్రభుత్వేతర ఆస్పత్రులలో కూడా కాలపరిమితి లేకుండా కరోనా పరీక్షలు పట్టణ నలుమూలలో నిర్వహించడానికి అనుమతులిస్తే అందరికి అందుబాటులో ఉంటుందని ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.

అంటురోగాలపై దృష్టి సారించాలి:-శ్రీనివాస్‌ చిరిపోతుల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్ల్లా

అంటురోగాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. రాష్ట్రంలో ఇప్ప టికే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా సమృద్ధిగా వానలు కురిసే అవకాశాలున్నాయి.

ఈ తరుణంలో అంటురోగాలపై ప్రభుత్వంప్రత్యేకంగా దృష్టిసారించాలి.

ఇప్పటికే కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. దీనికి తోడుచాలాప్రాంతాల్లో చెత్తాచెదారంమురుగునీరు పేరుకుపోయి పారిశుద్ధ్యం పడకేసింది. దీంతో అంటురోగాలు ప్రబలే అవకా శాలు ఎక్కువగా ఉన్నాయి.

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరం. అంటురోగాలు అధికంగా ప్రబలే గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి.

గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేపంచాయతీ కార్యదర్శులు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.

పదవీ విరమణ వయసు పెంచవద్దు: -బి.ఆర్‌.నార్సింగ్‌రావు,,హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా రెగ్యులర్‌ ఉద్యోగి అయిన అటెండర్‌కు నెలనెల సుమారు 45వేల వేతనం ఉంది. అలాగే ఉపాధ్యాయులు కనీసం సుమారు ఒక లక్ష నెలనెలా పొందుతున్నారు.

అలాగే ఒక ఆఫీసర్‌ నెలకు కనీసం ఒక లక్ష 50వేలు పొందుతున్నారు.

ఈ పైఉద్యోగులు అన్ని డిపార్ట్మెం ట్స్‌లో కనీసం 30నుండి36 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరు ఉద్యోగంలో స్థిరపడి సొంత ఇల్లు, కనీస బ్యాంకు బ్యాలెన్స్‌తో ఉన్నారు.

కావున అన్ని డిపార్ట్మ్‌ంట్‌లో పనిచేస్తున్న వారికి 58 సంవత్సరాల వయస్సు పూర్తికాగానే పదవీవిరమణ తప్పనిసరి చేయాలి.

నేడు ప్రభుత్వఉద్యోగులకు మరో రెండు సంవత్సరాలు పదవీవిరమణ పెంచడం ఎందుకు?

విజయవాడ ఆకాశవాణి అధ్వానం: -కొవ్వూరు వెంకటేశ్వర ప్రసాదరావు, ప్రకాశంజిల్లా

బహుముఖ ప్రసిద్ధి చెందిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఒక రోజు పనిచేస్తే మూడు రోజులు మూతపడుతుంది.

ఎప్పుడూ ఏవో శబ్దాలు వినిపించడం ఒకసారి లోవాయిస్‌తో అనేక విధాలైన చిత్రవిచిత్రాలు ఈ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపిస్తున్నాయి.

మధ్యాహ్న కార్యక్రమాలు మూగబోయాయి.

ఇకనైనా సరిగ్గా ప్రసారం అయ్యే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ప్రసార మాధ్యమంలో ఆటంకాలు రాకుండా చూడాలి.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/