పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులు!

missing cases
missing cases


దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న మిస్సింగ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు అంతగా శ్రద్ధచూపడం లేదనే విమర్శలు కూడా పెల్లుబుకుతున్నాయి. దీంతో కొందరు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని న్యాయస్థానం కొన్ని కేసుల్లో జోక్యం చేసుకోవడమేకాక అదృశ్యమైన వారిని కోర్టుకు హాజరుపరచాల్సిందని కూడా ఆదేశాలు ఇచ్చిన సంఘట నలు కోకొల్లలుగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కూడా అంతకంతకు ఈ మిస్సింగ్‌ కేసులో విషయంలో పెరిగిపోతున్నది.

హైదరాబాద్‌లో ఆదివారం ఒక్క రోజే ఐదుగురు యువతులు కన్పించకుండాపోయినట్లు వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గాంధీనగర్‌, హబీబ్‌నగర్‌, మల్కాజ్‌గిరి, జవహర్‌నగర్‌, ఎస్సార్‌ నగర్‌ పోలీసు స్టేషన్లలో ఈ కేసులు నమోదు చేశారు. యధాప్రకారం అదృశ్యమైనవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. మల్లెపల్లె వాంబే కాలనీలో నివసిస్తున్న 25ఏళ్ల యువతి సాయంత్రం ఏడుగంటల సమయంలో బయటకు వెళ్లి ఎంతకు తిరిగిరాకపోవడంతో ఆమె తల్లి హబీబ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే జ్యూస్‌తీసుకురావడానికి వెళ్లిన మరొక యువతి అదృశ్యమైనట్లు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఇక జవహర్‌నగర్‌ పరిధిలో ఒక ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువ్ఞకుంటూ సమీప హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినీ అదృశ్యం కావడంతో కాలేజీ యాజమాన్యం తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన తమ కుటుంబ సభ్యుల కొరకు వేలాది కుటుంబాలు ఏళ్లతరబడి కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూస్తు న్నాయి. అనారోగ్యం కారణంతోనో, ప్రమాదవశాత్తు లేక, ఇతర కారణాలతో మరణిస్తే బాధ ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావడం, ఇతర పనుల ఒత్తిడితో క్రమేపీ ఆ బాధను మరిచిపోతారు.

ఆ లోటు పూర్తిగా మరిచిపోకపోయినా మృతిచెందిన వ్యక్తులకు సంబంధించిన జ్ఞాపకాలు అప్పుడప్పుడు నెమరవేసుకుంటుంటారు. కానీ ఆకస్మికంగా ఎవరైనా అదృశ్యమైపోతే నెలల తరబడి, ఏళ్లతరబడి వారి ఆచూకీ తెలియకపోతే ఆ కుటుంబం ఎదురుచూపులతో అనుభవిస్తున్న నరకయాతను మాటల్లో వర్ణించలేం. మరికొన్ని కుటుంబాలు గుడులు, గోపురాల చుట్టూ తిరుగుతూ కన్పించిన ప్రతిస్వామికి, బాబాలకు మొక్కుతున్నారు. అంజనం వేసి జాడచెప్పేవారి ఆచూకీ తెలుసుకొని వారిని ఆశ్రయిస్తున్నారు. అదృశ్యమైతున్న వారిలో అధికశాతం మహిళలే ఉండటం ఆందోళన కలిగించే అంశం.

పోలీసులరికార్డుల్లో నమోదు అవ్ఞతున్న కేసుల కంటే అసలు పోలీసు దృష్టికి రానివి ఎన్నో ఉన్నట్టు కూడా సమాచారం. మారుమూల గ్రామాల్లో యువతీయువకుల అదృశ్యాల గురించి ఫిర్యాదు చేయడానికి కుటుంబ సభ్యులే వెనుకంజవేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ గౌరవప్రతిష్టలకు భంగం వాటిల్లు తున్నదని పక్కింటివారికి కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పోయిన యువతి తిరిగి వచ్చినా వివాహం, తదితర విషయాల్లో సమస్యలు ఎదురవ్ఞతాయని నోరు విప్పలేకపోతున్నారు. ఇలా ఎన్నో కేసులు నమోదు కావడం లేదు.

అయితే నమోదు అయిన కేసులను కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వారికి ఉన్న పనుల ఒత్తిడి, ప్రాధాన్యతల దృష్ట్యా వీట ివైపు దృష్టిసారించలేకపోతు న్నారు. అసలే సిబ్బంది కొర తతో ఉన్న పోలీసు విభాగా నికి నేరాలతోపాటు అటు సైబర్‌ నేరాలు,ఉగ్రవాదం వీటన్నింటిని మించి విఐపిల భద్రతలాంటివి పెరగడంతో వీటిపై అంత శ్రద్ధచూపలేకపో తున్నారు. అందుకే ఎన్నో కేసులు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఎవరైనా విఐపిలో, వారి కుటుంబ సభ్యులో అదృశ్యమైనప్పుడు మాత్రం కొద్దిగా పట్టించుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కన్పించినా ఫలితాలు రావడం లేదు.

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జి.వెంకటస్వామి మనువడు వికాస్‌ అదృశ్య మైన కేసును అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలీసు శాఖ ప్రతిష్టాకరంగా తీసుకొని ఆ తర్వాత సిబిఐకి అప్పగించారు. ఇంతవరకు ఆచూకీ లభిం చలేదు. అలాగే సాక్షాత్తు ఉమ్మడిరాష్ట్ర శాసనసభలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ 1990లో మాయమైన అజ§్‌ు కుమార్‌ ఆచూకీ నేటికీ లభ్యంకాలేదు. ఎంసెట్‌ టాప్‌ ర్యాంకర్లు, వైద్య, ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులు నలుగురు అదృశ్యమైన కేసు నేటికీ కొలిక్కి రాలేదు. ట్రాన్స్‌పోర్టు విభాగంలో అడిషనల్‌ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన సైదులు ఇంటి నుండి బయటకువెళ్లి అదృశ్యమైపోయారు.

ఇప్పటికీ ఆచూకీలేదు. ఇలా ఎన్నో కేసులు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. ఆ కుటుంబాలు అనుభవిస్తున్న బాధ మాటలకు అందదు. భర్త బతికి ఉన్నాడో లేడో చెప్పలేరు. హిందూసంప్రదా యం ప్రకారం ఖర్మకాండలు నిర్వహించాలో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి. ముత్తైదువ్ఞగా ఉండాలో లేదో తెలియని అయోమయం. ఏ శుభకార్యలకు వెళ్లినా అవమానాలు తప్పవ్ఞ. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు. నెలకాదు, ఏళ్ల తరబడి ఆ కుటుంబాలు అనుభ విస్తున్న మానసిక వేదన ఎలాంటిదో చెప్పక్కర్లేదు.

అదృశ్యమైన వ్యక్తికి సంబంధిం చిన వారసత్వపు హక్కుల ధృవీకరణ పత్రం రాదు. పింఛన్‌ లాంటి అవకాశాలు అంత సులభం కాదు. ఏడు సంవత్సరాలు ఎదురుచూడా ల్సిందే. ఏడేళ్ల తర్వాత ఆచూకీ దొరకకపోతే అప్పుడు ఆయన మరణించినట్లుగా భావించి పింఛన్‌, ఇతర సౌకర్యాలు వారసత్వం కుటుంబ సభ్యులకు కల్పిస్తుంది. ఈ విషయంలో శ్రద్ధ చూపాలి. అవసరం అనుకుంటే చట్టానికి మార్పులు చేయాలి.పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌