పతనం అంచున సహకార వ్యవస్థ!

Cooperative Banks
Cooperative Banks

అధిక దిగుబడులు రావాలంటే ముంద న్న కావాలా మందన్న కావాలన్నారు పెద్దలు. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం తో ఖరీఫ్‌కు ఆశించిన ప్రయోజనాలు చేకూరలేదనే చెప్పొచ్చు. దీంతో రైతు ఆశలన్నీ ప్రస్తుతం ప్రారంభం అవ్ఞతున్న రబీపైనే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఆలస్యంగానైనా వర్షాలు సమృద్ధిగా కురవడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతోసహా చిన్న, చితక చిన్ననీటి వనరులన్నీ జలకళ సంతరించుకున్నాయి. దీంతో రెట్టింపు ఉత్సాహంతో రబీకి రైతాంగం సమా యత్తం అవ్ఞతున్నారు. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో నారు మళ్లుపోశారు. దుక్కులు చేసుకోవడానికి కూడా సన్నద్ధం అవ్ఞతున్నారు.కానీ వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన సహ కార సంఘాలు చేతులు ఎత్తేయడం, పెట్టుబడికి రైతులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా రైతులు, కార్మికులు తదితర వర్గాలను వడ్డీవ్యాపారుల నుండి కాపాడి అవసరం మేరకు ఆర్థికసహాయం అందిం చి ఆధుకునే పవిత్ర ఆశయంతో ఏనాడో ప్రారంభించిన సహకార వ్యవస్థ నేడు పతనావస్థకు చేరుకున్నది. ఒకనాడు రైతులకు, కార్మికులకు ఇతర వర్గాలకు కల్పతరవ్ఞగా ఉన్న ఈ సహకార రంగం మితిమీరిన రాజకీయ జోక్యంతో రెండు, మూడు దశాబ్దాల నుంచి క్షీణదశలో పయనించడం ప్రారంభమైంది. ఎప్పటికప్పుడు సహకార రంగాన్ని మరింత పటిష్టం చేసి సంస్కరించి అన్ని వర్గాలకు సేవలు విస్తరింప చేస్తామని పాలకులు ఎన్ని చెప్పినా అంతకురెట్టింపు స్థాయిలో ఆ వ్యవస్థ దిగ జారిపోతున్నది. ఇప్పటికే కొన్నివేల సహకార సంఘాలు మూతపడ్డాయి. ఏ సంస్కరణలు చేసినా, ఏ చట్టాలు చేసినా అది ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఉండేలా తప్ప పరిస్థితిని మరింత దిగజార్చివారికి దూరం చేసే విధంగా ఉండకూడదు. అసలు సహకార సంఘాల ఉనికేప్రశ్నార్థకంగా మారుతున్నదని, అనేకమంది సహకార ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో మొత్తం సంఘాల్లో సగానికిపైగా రైతులకు అవసరం మేర కు చేయూత నివ్వలేకపోతున్నాయి. మరెన్నో సంఘాలు మూగనోము పట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే సహకార వ్యవస్థ పతానవస్థకు చేరుకున్నది. ప్రభుత్వం ఒకపక్క ప్రైవేట్‌ వడ్డీపై కట్టడిచేసి ఇంకొకపక్క ఈ సహకారవ్యవస్థ నుంచిసకాలంలో అవసరం మేరకు రుణాలు పొందే అవ కాశాలు లేకుండా చేయడంతో రైతుల పరిస్థితి వర్ణనాతీ తంగా ఉంది. పూర్వీకుల నుంచి గ్రామీణ రంగంలో రైతు లను, రైతుకూలీలను ఆదుకునేందుకు ఏదో ఒక రూపం లో అప్పులు అందించే వ్యవస్థ కొనసాగుతూనే ఉండేది. ఆ గ్రామంలోని అవసరాలను బట్టి రైతులకు రుణసహా యం అందించేవారు. దిగజారిపోతున్న మానవ విలువలను బట్టి ఆవ్యవస్థ కూడా కేవలం లాభాపేక్ష ధ్యేయంగా మారి అధికవడ్డీలు, అపరాధ వడ్డీలు అంటూ అమాయకులను దోపిడీ చేయడం ఆరంభించింది. రైతు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ‘నాగులంటూ పంట కాలానికి బస్తాకు రెట్టింపు వసూలు చేసే విధానం చోటు చేసుకున్నది. ఇది ప్రధానంగా తెలంగాణాలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ నాగులు, అపరాధవడ్డీలు చెల్లించలేక ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. దీని నుంచే వెట్టిచాకిరి ఆవిర్భవించింది. అప్పులు ఇవ్వడం, వడ్డీలకింద ఏళ్ల తర బడి చాకిరి చేయించుకోవడం ఆనాడు కొందరు భూస్వా ములకు అలవాటుగా మారిపోయింది. ఇలా అప్పులతో సతమతమవ్ఞతున్న గ్రామీణ పరిస్థితిని అర్థం చేసుకొని భారత్‌లోని ఆనాటి బ్రిటిష్‌ప్రభుత్వం 1904లో సహకార వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. 1911 మార్చి17న గుంటూ రులో జిల్లాస్థాయి సహకారబ్యాంకు ఆవిర్భవించింది. ఆ తర్వాత అయ్యదేవర కాళేశ్వరావ్ఞ, భోగరాజు పట్టాభి రామయ్యలాంటి పెద్దలు కలిసి విజయవాడ కో ఆపరేటివ్‌ బ్యాంకు స్థాపించారు.అందులో నుంచి విడిపోయిన పట్టా భిరామయ్య కొంతకాలానికి భూములను తనఖా పెట్టుకొని దీర్ఘకాల రుణాలు ఇచ్చే భూతనఖా బ్యాంకులను భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా కృష్ణజిల్లా గుడ్లవెల్లూరులో 1925అక్టోబరు31న శ్రీకారం చుట్టడంతో గ్రామీణ రంగం లో రుణవసతి కల్పించడంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1964లో సహకార చట్టానికి రూపకల్పన చేశారు. రైతు కష్టాన్ని, వడ్డీ,చక్రవడ్డీ రూపంలో దోచుకుంటున్న వ్యాపారులకు పెత్తందారులకు కొంతమేరకు ఇబ్బంది కలిగించినా రైతు లకు మాత్రం వరప్రసాదంగా పరిణమించింది. ఆనాడు వడ్డీవ్యాపారస్తులకు చెందిన వ్యక్తులు డబ్బులు వసూలు చేయడంలో ఎంత కర్కషంగా వ్యవహరించేవారో ఇప్ప టికీ కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద గ్రామీణరంగంలో సహకార పరపతి వ్యవస్థ ప్రవేశంతో ఆ బాధలన్నీ పోయాయని రైతులు ఎంతగానో ఆనందించారు. రైతుల ఆదరాభిమానాలతో సహకార వ్యవస్థ అంచలంచెలుగా ఎదిగి గ్రామగ్రామానికి విస్తరించింది. తెలంగాణ రాష్ట్రంలో ముల్కనూర్‌, అంకాపూర్‌ తదితర సొసైటీలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్నాయి. గత రెండుమూడు దశాబ్దాలుగా సహకార వ్యవస్థపతనం ఆరంభమైంది. రాజకీయ జోక్యం పెరగడంతో ఆదాయవ్యయాలతో సంబంధాలు లేకుండా ఇష్టానుసారంగా ఉద్యోగులను నియమించారు. ఇక అవకతవకలకు, అవినీతికి అంతేలేకుండాపోయింది. చివరకు సహకార వ్యవస్థ నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. ఇప్పటికైనా ఎంతో పవిత్ర ఆశయంతో ప్రారంభించిన ఈ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/