పటిష్ట చట్టమే పరిష్కారం

Indian law
Indian law

పటిష్ట చట్టమే పరిష్కారం

మానవుడు నిత్య జీవన పోరాటంలో ఏదో విధమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటు న్నాడు. ఇటీవల కాలంలో ఇది మరింత పెరిగిపోయింది. ఎండకు ఎండని, వానకు తడవని మానవుడు ఎలా ఉండడో కోరిక లేని మనిషే లేడని చెప్పొచ్చు. కోరికలు పెరిగే కొద్దీ మనశ్శాంతి కరవ్ఞ కాక తప్పదు.

వారి వారిస్థాయిని బట్టి ఈ కోరికలు పెరుగుతూ ఉంటాయి. రకరకాల సమస్యలతో కోరికలతో వ్యధలతో మనశ్శాంతి కరవైన పరిస్థితిలో ఆధ్యాత్మికం, భక్తి ప్రధానంగా స్వామిజీల ఉపన్యాసం, ప్రవచనాలతో కొంద రు, యాగాలు, యజ్ఞాలు చివరికి క్షుద్రపూజలవైపు కూడా మొగ్గి తమ సమస్యలకు కొంతవరకైనా పరిష్కారం దొరికి ప్రశాంతత లభిస్తుందనే ఆశతో ఆరాటపడుతున్నారు. ఇటీ వల కాలంలో ఇది పెరిగిపోయింది.

అయితే కొందరు స్వార్థపరులు స్వామిజీల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేయడమేకాదు చేయరాని పనులు చేస్తున్నారు. త్రికరణ శుద్ధిగా దైవాన్ని నమ్ముతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే స్వాములు కూడా ఉన్నారు. కానీ ఈ నకిలీ స్వాములు, బాబాల సంఖ్య రానురాను పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. ప్రజల బలహీనతల నాడిని పట్టుకొని విశ్వాసం కలిగించగలిగితే కనకవర్షం కురిసినట్లే. దీనికి కనీస అర్హతలు అంటూ ఏమీ లేవు.

వయస్సుతో నిమిత్తం లేదు. రాత్రికిరాత్రే కాషాయవస్త్రాలు ధరించి తెల్లవారేసరికి స్వామీజీలుగా, బాబాలుగా అవతారం ఎత్తవచ్చు. దీనికి ఏ లైసెన్సులు అక్కరలేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ సంస్కృతి విపరీ తంగా పెరిగిపోతున్నది. ఎక్కడికక్కడ ఈ బాబాలు స్వామి జీలు వెలుస్తున్నారు. కాషాయవేషధారణలో ఏవేెవో చెప్పి ప్రజలను నమ్మిస్తున్నారు. దక్షిణతాంబూలాలతో పాదపూజ లు చేయించుకుంటున్నారు.

వారిలో కొందరు చేసే వికృత చేష్టలు, క్షుద్రపూజలు అమాయక గ్రామీణుల ప్రాణం మీద కు కూడా తెస్తున్నాయి. తమ మంత్రాలు, క్షుద్రపూజలతో రోగాలను నయం చేస్తామంటూ కొందరు, సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మరికొందరు ప్రజలను నమ్మించి కిందపడేసి తొక్కడం, వాతలు పెట్టడం, చివరకు నరబలు లు ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. అప్పుడప్పుడు పోలీసులకు సమాచారం వచ్చినా కేసులు పెట్టి బాధ్యులైన వారిని అరెస్టు చేసి కోర్టుకు పంపి చేతులు దులుపుకుం టున్నారు.అందులో చాలా కేసులు న్యాయస్థానాల ముందు రుజువ్ఞలు లేక, సాక్ష్యాలు లేక వీగిపోతున్నాయి.

అలాంటి వారు మళ్లీ వచ్చి అదే వ్యాపారంలో మునిగిపోతున్నారు. ఇటీవల కాలంలో క్షుద్రపూజలు పెరిగిపోతున్నాయి. బాణా మతి, చేతబడి, చిల్లంగి వంటి అనేక పేర్లతో క్షుద్రపూజలు సాగిస్తున్నారు.మూఢవిశ్వాసాలు, మృత్యుపాశాలుగా మారి పోతున్నాయి. క్షుద్రత్వంపై ఉక్కుపాదం మోపకతప్పదన్న భారతప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బీహార్‌, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్‌, తదితర రాష్ట్రాలతోపాటు ఉభయతెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషసంస్కృతి అంత కంతకు విస్తరిస్తుండడం ఆందోళన కలిగించే అంశం.

పదేళ్ల కాలంలో దాదాపు మూడువేల మందికిపైగా హత్యలకు గురై నట్టు అనధికార సమాచారం. అందులో అధికశాతం మహిళలనేది జాతీయ నేరగణాంకాల నమోదు సంస్థ రికార్డుల్లో స్పష్టమవ్ఞతున్నది. జార్ఖండ్‌లో 2013లో చేత బడుల అనుమానంతో యాభైఎనిమిది మందిని చంపారు.

ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో విదర్బ ప్రాంతంలో తమకు పుత్రసంతానం కోసం పదకొండు మంది చిన్నారులను బలి ఇవ్వాలని ఒక భూతవైద్యుడు సలహా మేరకు ఒక జంట ఐదుగురు అభంశుభం తెలియని పసికందులను పొట్టన పెట్టుకున్నారు. ఈ విషయం బయటపడడంతో మిగిలిన వారు బతికిపోయారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇటు వంటి నేరాలు,ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న విజయవాడలో పవిత్రమైన కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు నిర్వహించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఏమి ఆశించి చేశారో? ఎవరి ఆదేశం మేరకు ఇవి జరిగా యో? అత్యంత రహస్యంగా ఎందుకు చేయాల్సివచ్చిందో ఇప్పటికీ వెలుగుచూడలేదు. ఆగమేఘాలపై కార్యనిర్వహణ అధికారిణిని బదిలీ చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నది.

మరొకపక్క మంత్రాలతో గ్రామానికి హాని కలిగిస్తున్నా రంటూ నిందలు మోపి ప్రాణాలను కబళిస్తున్నారు. అయి తే గతంలో జాతీయ మహిళా కమిషన్‌ సూచన మేరకు మహారాష్ట్ర, ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మూఢనమ్మకాన్ని నిరోధించే చట్టాన్ని ప్రవేశపెట్టారు. మంత్రగత్తే అని అనుమానించి ఆ మహిళపై శారీరక హాని కలిగిస్తే దోషులను గరిష్టంగా ఐదేళ్లు కారాగారశిక్షపడేలా బీహార్‌ ప్రభుత్వం దాదాపు ఒకటిన్నర దశాబ్దం క్రితమే చట్టం తెచ్చింది.

మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అమాన వీయంగా ప్రవర్తించే వారికి ఏడేళ్లు జైలు శిక్ష అని ప్రకటించింది. చట్టాలు ఎన్ని చేసినా, నిబంధనలు ఎన్ని విధించినా ఆచరణకు వచ్చేసరికి కొంత నిర్లక్ష్యం జరుగు తున్న మాట వాస్తవమే. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మళ్లీ పునరావృతం కాకుండా సమగ్రమైన దర్యాప్తు చేపట్టి నిందితులను తిరుగులేని సాక్ష్యాలతో న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షలు వేయించడంలో పోలీసు యంత్రాంగం విఫలమవ్ఞతున్నదనే చెప్పొచ్చు.

క్షుద్రపూజలపై ఈ నకిలీ బాబాల వింత,వికృత చేష్టలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు సంఘటన జరిగిన తర్వాత చర్యలు చేపట్టేకంటే ఇలాంటి వారిపై నిఘా పెట్టి ముందుగానే నివారించేందుకు త్రికరణశుద్ధిగా కృషి చేయాలి. అవసరం అనుకుంటే కేంద్రప్రభుత్వం దేశవ్యా ప్తంగా ఈ విషసంస్కృతిపై ఉక్కుపాదం మోపేందుకు పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌