ఎన్నికల వరకేనా మాతో పని

బాతాఖానీ

TRS RALLY
TRS RALLY (FILE)

ఎన్నికల వరకేనా మాతో పని

పార్టీ శ్రేణుల శ్రమ వల్లనే పార్టీ అధికారం చేపట్టినప్పటికీ, శ్రేణులను తిరిగి పార్టీ పరంగా క్రియాశీలం చేయడం లేదనే అసంతృప్తి టిఆర్‌ఎస్‌లో నెలకొంది. అధికారంలోకి వచ్చినంత మాత్రాన పార్టీని అంత నిర్లక్ష్యం చేయాలా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారని, ఇప్పుడు పార్టీ కమిటీలు లేకపోవడంతో వారిలో నిరుత్సాహం ఏర్పడిందని అంటున్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచీ ఏప్రిల్‌లో ప్రతి ఏటా పార్టీ ప్లీనరీ జరుపుకున్న తర్వాత రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలను నియామకం చేసేవారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కమిటీల నియామకం జరగడం లేదు. అంటే పార్టీ ప్లీనరీ కంటే ముందు, తర్వాత కూడా పార్టీ కమిటీలు శూన్యంగా మారాయి. నామినేటెడ్‌ పోస్టుల విషయంలో ప్రభుత్వంలో ఉన్న పోస్టులను, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను బట్టి ఇచ్చుకోవడం సహజమని, కానీ పార్టీ పోస్టులు ఇవ్వడానికి ఎందుకు తాత్సారం అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

ఎన్నికల వరకేనా మాతో పని అని వాపోతున్నారు. ఈసారి పార్టీ ప్లీనరీలో పార్టీ నియమా వళిని మార్చి జిల్లా కమిటీలను రద్దు చేశారు కదా, మిగతా కమిటీలను ఎందుకు నియామకం చేయడంలేదని అడుగు తున్నారు. పార్టీకి సంబంధించి పలు అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమాకం చేసినప్పటికీ, మరి కొన్ని అనుబంధ సంఘాలను వేసుకోవాల్సి వుంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు సిఎం కెసిఆర్‌ అక్కడే నామినేటెడ్‌ పోస్టుల కసరత్తు చేస్తున్నట్లుగా పరిస్థితి కల్పించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు హుటా హుటిన ఢిల్లీకి వెళ్లి తమ తమ నియోజకవర్గాల్లోని కీలకమైన కార్యకర్తల వివరాలను అందజేశారు. కానీ సిఎం నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయలేదు. హైదరాబాద్‌కు వచ్చాక కూడా ఆ విషయం పట్టించుకోలేదు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాధ్‌ కోవింద్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమం విజయవంతం చేసి, ఆయనకు తెలంగాణ భోజనం పెట్టి పంపారు. తర్వాత ఆయన మూడు, నాలుగు రోజులుగా మెదక్‌లోని ఫామ్‌ హౌజ్‌లోనే ఉండిపోయారు.

ఆదివారం సికింద్రాబాద్‌ బోనాలకు కూడా రాలేదు. కానీ 12న కరీంనగర్‌లో హరితహారంలో ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారు. అదే రోజు హైదరాబాద్‌కు వచ్చి మనుమడు హిమాంశురావు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని మరుసటి రోజే ఫామ్‌ హౌజ్‌కు వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల పార్టీ కమిటీలను ఇంత వరకు నియామకం చేయలేదు. అక్టోబర్‌లో ఎఐసిసి జాతీయ అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో అప్పటి వరకు పార్టీ కమిటీల ఖరారును వాయిదా వేశారని తెలుస్తోంది.

తెలంగాణలో 31 జిల్లాల పార్టీ కమిటీలను సిద్దం చేసి పెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష ఎన్నికల వరకు ఆగాలని నిర్ణయించారు. బిజెపి తెలంగాణ యూనిట్‌లో కూడా పార్టీ కమిటీల గోల కొనసాగుతుంది. వాటిని ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తోంది. పాత నేతలు అవే పోస్టుల్లో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టిడిపి, కమ్యూనిస్టు పార్టీల్లో జిల్లా కమిటీలపై పెద్దగా డిమాండ్‌ లేదు.

కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నల్లాల ద్వారా నీరు అందించే మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని పట్టణాలకు కూడా విస్తరించ బోతున్నారు. పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో నడుస్తున్న ఈ పథకాన్ని మున్సిపల్‌ పట్టణా భివృద్ది శాఖకు కూడా ప్రభుత్వం విస్తరించనుంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే లక్ష్యాన్ని పెట్టుకున్న ప్రభుత్వం పట్టణాల్లో కూడా మిషన్‌ భగీరథను చేపట్టనుంది. 24 మున్సిపాలిటీలతో పాటు మరో 53 మున్సిపాలిటీలు మొత్తం 77 మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. ఇందుకు మొదట రూ.3,700 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసినా, ప్రస్తుతం దాని ఖర్చు రూ.4400 కోట్లకు చేరుతుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో పాటు మున్సిపాలిటీల్లోని ప్రజలకు కూడా తాగునీరు అందించే పనులు ప్రారంభించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో 19 మేజర్‌ గ్రామ పంచాయితీలను నగర పంచాయతీలుగా ప్రభుత్వం అప్‌గ్రేట్‌ చేసింది. వీటిల్లో కూడా మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

– వైఎన్నార్‌