ఆర్థిక విధానాలపై ఆత్మపరిశీలన అవసరం

Financial
Financial

ఆర్థిక విధానాలపై ఆత్మపరిశీలన అవసరం

శక్తికిమించిన సహకారంకానీ, సహాయంకానీ, చివరకు కార్యక్రమాలుకానీ చేయడం అంత మంచిది కాదంటారు. మోయలేని భారం తలకెత్తుకుంటే అసలుకే మోసం వచ్చేవిషయం విస్మరించకూడదు. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ అదేపనిగా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా అందినకాడికి అప్పులుతెచ్చి ఇష్టానుసారంగా వెచ్చిస్తుంటే అది వ్యక్తికి కానీ, సంస్థకుకానీ, ప్రభుత్వానికికానీ ఏదో ఒకనాటికి చేతులెత్తకతప్పదు. దివాలాబాటపట్టక తప్ప దు. ఇదేమీ కొత్త విషయంకాదు.

ఎన్నోసంస్థలు వ్యక్తులు ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొంది ఆ బాటలో నడిచి పతనావస్థకు చేరుకున్న ఉదాహరణలు కోకొల్లలు. దివాలా సంకేతం ఆస్తులు అమ్ముకోవడం అది ఒక దశ. అవికూడా ఆవిరైపోయిన తర్వాత చివరి అంకం దివాలా. దివాలా అనేది వ్యక్తి విషయంలో తీవ్రంగా పరిణమించే విషయం. ఒక రకంగా సమాజం బహిష్కరణకు గురై నట్లే. దివాలాతీసిన వ్యక్తినికానీ, కుటుంబాన్నికానీ సమా జం ఎలా చూస్తుందో వేరే చెప్పక్కర్లేదు.

తెలుగు రాష్ట్రా ల్లో పాలకులు వ్యవహరిస్తున్నతీరు.. చేపడుతున్న కార్య క్రమాలు వెచ్చిస్తున్న నిధులు వస్తున్న ఆదాయం చేస్తున్న అప్పులు పరిగణనలోకి తీసుకునిపరిశీలిస్తే పాలకులు ఆ బాటవైపు నడుస్తున్నారేమోననిపిస్తున్నది. అప్పులమీద అప్పులుతెస్తున్నారు.ఇష్టానుసారంగా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఇలాఎంతకాలం కొనసాగిస్తారు? అప్పు లు దొరకడం కష్టమైనప్పుడు ఏంచేస్తారు? ఎంతకాలం పన్నులమీద పన్నులువేసి ప్రజల నడ్డివిరుస్తారు? అన్నీ జవాబులు లేని ప్రశ్నలే. మనది సంక్షేమ ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిందే.

దారిద్య్రరేఖకు దిగువనున్న లక్షలాది నిరుపేద బడుగు, బలహీన వర్గాలకు చేయూతనివ్వాల్సిందే.వారికి అన్నిరకాల సహ కారాలు అందించాల్సిందే.అందులోమరో అభిప్రాయానికి తావ్ఞలేదు. ప్రజాస్వామ్యవాదులు ఎవరూ దీనిని వ్యతి రేకించరు. కానీ వారి పేరుమీద జరుగుతున్న దోపిడీ మాట ఏమిటి? వారినిచూపి అనర్హులకు వందలాది కోట్లు అప్పనంగాఅప్పగించడం ఎంతవరకు సమంజసం. వేలాది కోట్ల రూపాయలు వడ్డీకి అప్పు తెచ్చుకుంటున్న డబ్బులు ఇలాదుర్వినియోగం చేయడం ఎంతవరకు న్యా యం? ఒక్కసారి పాలకులు మనసుపెట్టి ఆలోచించాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి గ్రామీణాభివృద్ధి శాఖ వివిధ పద్దులకింద ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఖర్చు పెట్టింది కూడా తక్కువేమీకాదు. అసలు ఏ పద్దుకింద ఎన్నివేలకోట్లరూపాయలు వెచ్చించారోఅధికారులకే లెక్క లు దొరకని పరిస్థితి నెలకొంది. దారిద్య్రరేఖకు దిగువ నున్న లక్షలాది కుటుంబాలను ఆదుకుని వారిని ఆ దుర్భరపరిస్థితుల ఉంచి దాటించామని అంకెలతోసహా వివరిస్తున్నారు.కానీ పౌరసరఫరాలశాఖ ఇచ్చిన రేషన్‌ కార్డులను పెండింగులో ఉన్న కార్డులనుపరిశీలిస్తే దారి ద్య్రం ఊహించనిరీతిలో పెరుగుతున్నట్లు స్పష్టమవ్ఞ తున్నది. రెండూ ప్రభుత్వ విభాగాలే. ఇందులో ఏది సత్యం? ఏదసత్యంఅన్నది పాలకులకు తెలియందికాదు. పేదలకు అందిస్తున్న సబ్సిడీ బియ్యం భోంచేయడానికి తెల్లకార్డుల రూపంలో లక్షలాది మంది పుట్టుకొస్తున్నా రు. కొందరు డీలర్లే బినామీ పేర్లతో కార్డులు సృష్టించి దశాబ్దాల తరబడి భోంచేస్తున్నారు. ఆదాయపన్నుశాఖ జాబితాలో ఉన్నవారుసైతం తెల్లకార్డుల జాబితాలో చేరి పోతున్నారు. ఇవేకాదు ఏ ఆధారం లేని నిర్భాగ్యులైన నిరుపేదలకు ఇచ్చే పింఛన్లు ఇతర కార్యక్రమాలలో దళా రులవాటాలు పెరిగిపోతున్నాయి.

కొందరికి ఇది ఆదాయ మార్గంగామారిపోయింది. ఇది తమహక్కుగా వారు భావిస్తున్నారు. అధికారులకు ఆ దళారులను నిరోధించ లేని నిస్సహాయ స్థితి. ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగాయని, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమై అనర్హులు లబ్ధిపొందా రని వచ్చిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం దర్యా ప్తునకు ఆదేశించింది. సిఐడి సమగ్రదర్యాప్తుచేసి నివేదిక ఇచ్చింది.అయినా చర్యలుతీసుకోలేనిపరిస్థితి. కొన్ని విభా గాల్లో అవినీతి తారాస్థాయికి పెరిగిపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో అదుపులేకుండాపోతున్నది. ఒకపక్కఎసిబి అధి కారులుచేసిన దాడుల్లో కోట్లాది రూపాయలు అక్రమ సంపాదన వెలుగుచూస్తున్నది. అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు.

ఐనా ఇదేమీ ఆగడంలేదు. నిధు ల కొరత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తు న్నది. మూడేళ్లయినా రాజధానికి సంబంధించిన నిర్మా ణం ఒక్క అడుగు కూడా ముందుకువేయలేకపోయారు. డిజైన్లు, ప్లాన్లు,విదేశీ పర్యటనలతోనే కాలం గడుపుతు న్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంతమేరకు పురో గతిసాధించినా నిర్ణీత గడువ్ఞలో పూర్తయ్యే అవకాశాలు కన్పించడంలేదు. ప్రతి రూపాయికి వెతుక్కోవలసిన పరి స్థితులు కన్పిస్తున్నాయి. తెలంగాణాలో ఇంతటి పరిస్థితి లేకపోయినా అప్పుల తిప్పలు తప్పడంలేదు. పొదుపు అన్న విషయాన్ని ఏనాడో మరిచిపోయారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల జీతభత్యాలతోపాటు విదేశీ పర్యటనల కు భారీగానే వెచ్చిస్తున్నారు.

జనాకర్షణకోసం ప్రవేశపెట్టిన, పెడుతున్న కొన్ని పథకాలు తలకుమించిన భారంగా పరిణమిం చాయి. అయినా భరించక తప్పని పరిస్థితులు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కార్యక్రమా ల్లో దళారులపాత్ర అంతకంతకూ పెరిగిపోతున్నది. ప్రభుత్వ పథకాలు, విధానాలు ఆహ్వానించదగ్గవే అయినా.. వాటి అమలులో జరుగుతున్న లోపాలతో నష్టం జరుగుతున్నది. ఇప్పటికైనా ఈ అవకతవకలను అరికట్టకుండా మితిమీరిన వ్యయం చేస్తే ఆశించిన ఫలితాలు లభించకపోగా అప్పుల భారం ప్రజలకు తప్పదు.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌