ఆధార్‌ చట్టబద్ధమే

                           ఆధార్‌ చట్టబద్ధమే

Aadhar card
Aadhar card

సుదీర్ఘ విచారణ తర్వాత భారత విశిష్ఠ ప్రాధాన్యత గుర్తింపు (ఆధార్‌కార్డు) రాజ్యాంగ బద్దమైనదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పును వెల్లడించ డంతో ఇప్పటివరకు ఈవిషయంలో ఉన్న వివాదాలకు తెరపడింది. అయితే కొన్ని షరతులతో సుప్రీం ధర్మాసనం ఈతీర్పు చెప్పింది. ప్రధానంగా ప్రైవేట్‌ వ్యక్తులు కంపెనీలు ఆధార్‌ కోరడానికి వీలు లేదని స్పష్టం చేసింది. సర్కార్‌ సేవలన్నింటికీ ఆధార్‌ తప్పని సరి అని చెప్పడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోప్యతకు భంగం కలుగుతుందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దీనిపై దాఖలైన పిటీషన్‌ లన్నీ ఒకకేసు కిందికి తీసుకువచ్చిన సుప్రీం కోర్టు దాదాపు ముప్పైఎనిమిది రోజులపాటు వాదనలు ప్రతివాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం బుధవారం సుస్ఫష్ట్టమైన తీర్పు వెల్లడించింది. ఈకేసుపై దాఖలైన పిటిషనర్లు అందరినీ లిఖితపూర్యకంగా తమ వాదనలను దాఖలు చేయమని కూడా సుప్రీంకోరింది. అవన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రధానంగా ఆధార్‌చట్టం లోని సెక్షన్‌-57ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు చరిత్రలోనే ఇంత సుదీర్ఘకాలం విచారణ సాగిన రెండో కేసుగా ఇది నమోదు అయ్యింది.

గతంలో కేశవానంద భారతికేసులో రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారాలను ప్రశ్నించింది. ఆ కేసు విచారణ 1973లో దాదాపు ఐదునెలలపాటు కొనసాగింది. ఆతర్వాత 38రోజుల పాటు సాగిన ఈ ఆధార్‌కేసు రెండోదిగా రికార్డుకెక్కింది. ఈతీర్పును అటు కాంగ్రెస్‌, తృణముల్‌ కాంగ్రెస్‌తోపాటు అధికారంలో ఉన్నభారతీయ జనతాపార్టీ కూడా స్వాగతించింది. ఆధార్‌కార్డు యుపిఏ-2 ప్రభుత్వం 2009-10లో కార్గిల్‌ రివ్యూకమిటీ ఆధారంగా కేంద్ర మంత్రిమండలి జాతీయ గుర్తింపు కార్డుగా ఉండాలని సిఫార్స్‌చేసింది. ఆతర్వాత ఆధార్‌ను జాతీయ గుర్తింపు కార్డుగా ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.

అదే ఏడాది పార్లమెంట్‌లో బిల్లుగా ప్రవేశపెట్టింది. ఈబిల్లు 2016లో బిజెపి ప్రభుత్వం చట్టరూపం కల్పించి అమల్లోకి తెచ్చింది. అయితే దీనిపై వివాదాలు మొదలయ్యాయి. ప్రధానంగా తమ గోప్యతకు భంగం కలుగుతుందని, ఆధార్‌ డేటాను ఇతరులు తస్కరించే అవకాశం ఉందని పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఇదిరాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తుందని కూడా వాదిస్తూ పలువురు పిటీషన్లు దాఖలు చేశారు. అయితే ఇది జాతీయ భద్రతకు తోడ్పడుతుందని డేటా స్టోరేజీ వల్ల రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుందని అక్రమ వలసదారులను అరికట్టవచ్చని ప్రభుత్వం వాదించింది.

అంతేకాదు లక్షలాదికోట్ల రూపాయల ప్రజాధనంతో అమలుచేస్తున్న వేలాది పథకాల్లో అక్రమార్కులు, అనర్హులు లబ్ధిపొందకుండా అధార్‌ద్వారా అరికట్టవచ్చునని కూడా ప్రభుత్వంవాదించింది. ముఖ్యంగా నకిలీల బెడద చాలా వరకు తగ్గిందని కూడా ప్రభుత్వ వాదన. 2018 జనవరి 17న ఐదుగురు సభ్యులు గల బెంచ్‌ మొదటిసారిగా వాదోపవాదనలు వినడం ఆరంభించింది. తీర్పును మే 10న ఇవ్వాల్సి ఉండగా కోర్టు రిజర్వు చేసింది. మొత్తం మీద వాదోపవాదనలు ,రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం ఆధార్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బంది లేదని అభిప్రాయపడింది.

అయితే మొబైల్‌ ఫోన్‌ నెంబర్లకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానిం చడం సబబు కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ సంస్థలో ఆధార్‌డేటాను షేర్‌చేస్తే 6నెలల లోపల దానిని తొలగించాలని స్పష్టం చేసింది. ప్రైవేట్‌ సంస్థలు తమ ఖాతాదారుల ఆధార్‌డేటాను సేకరించరాదని స్పష్టం చేసింది. అలాగే వీలైనంత త్వరగా సమాచార సంరక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరింది. అక్రమ వలసదారులను అరికట్టేందుకు ఆధార్‌ను ఉపయోగించుకో వచ్చునని వ్యాఖ్యానిస్తూ ఆధార్‌ ప్రక్రియ స్వచ్ఛందంగా కొనసాగాలని సూచించింది. పాన్‌కార్డులు, ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్న్‌లకు ఆధార్‌ అవసరమేనంటూ కానీ టెలికాం కంపెనీల సేవలకు, బ్యాంకు సేవలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులలో ముగ్గురు ఆధార్‌ రాజ్యాంగ బద్ధమేనని అభిప్రాయపడ్డారు. అట్టడుగు వర్గాలకు ఆధార్‌ గుర్తింపని మిగతా అన్ని గుర్తింపుకార్డులకంటే ఇది చాలా విశిష్టమైందని ప్రజలకు దీనివల్ల ఎంతో ఉపయోగాలున్నాయని కూడా ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. కేవలం 0.23శాతం విఫలమైన సందర్భాలను తీసుకుని వాటి కారణంగా వీటిని రద్దుచేస్తే ఇప్పటికే నమోదు చేసుకున్న 99శాతం జనాభాకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. ఒకే వ్యక్తి రెండు ఆధార్‌ కార్డులు పొందడం అసాధ్యమని ఇదే ఆధార్‌ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆధార్‌కార్డు చట్టబద్దత కల్పిస్తూ సుప్రీం ఇచ్చిన ఈ తీర్పుతో వివాదాలకు తెరపడింది. ప్రతిచిన్న విషయానికి ఆధార్‌ కావాలంటూ ప్రైవేట్‌ సంస్థలు, కొందరు వ్యక్తులు ఇకపై ఒత్తిడిచేసే అవకాశాలుఉండవు.

ఇప్పటివరకు అభ్యంతరంగా ఉన్న ఆధార్‌చట్టంలోని సెక్షన్‌-57ను రద్దుచేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అందుకే రాజకీయ పార్టీలు కూడా తీర్పును ఆహ్వానిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఆధార్‌కార్డులోని డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌ వ్యక్తులుగానీ, సంస్థలుగానీ తస్కరించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కోట్లాదిరూపాయల ఖర్చుతో చేపట్టిన ఆధార్‌కార్డు లక్ష్యమే దెబ్బతింటుంది. అంతే కాదు మన దేశానికి సంబంధించిన కోట్లాదిమంది భారతపౌరుల వ్యక్తిగత వివరాలు సరిహద్దులు దాటే ప్రమాదం కూడా పొంచిఉందన్న విషయం పాలకులు విస్మరించరాదు.
– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌