శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు

శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇంట్లో ఆదివారం ఉదయం ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచల్‌ భూ స్కాం కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. పత్రాచల్‌ భూ స్కాం లో సంజయ్ రౌత్ కు ఇప్పటికే రెండుసార్లు అధికారులు సమన్లు ఇచ్చారు . అయితే సంజయ్ రౌత్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈరోజు ఉదయం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించి సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఈడీ దాడులపై సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ పగతో టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యం లేదని..కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా శివసేనను వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే ఎలా పోరాడాలో నేర్పించారు. తాను శివసేన కోసం పోరాడుతూనే ఉంటానని ఆయన మరాఠీలో ట్వీట్ చేశారు.