నామాకు చెందిన రూ.96 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ భారీ షాక్‌ ఇచ్చింది. నామాకు చెందిన రూ.96 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. రాజ‌కీయాల్లోకి రాక‌ముందే మ‌ధుకాన్ ప్రాజెక్ట్స్ పేరిట నామా నాగేశ్వ‌ర‌రావు ఓ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప‌లు రంగాల‌కు విస్త‌రించి త‌న పేరును మ‌ధుకాన్ గ్రూప్‌గా మార్చుకుంది. నిర్మాణ రంగంలో ఉన్న ఈ కంపెనీ గ‌తంలో రాంచీలో ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించింది. ఈ ప్రాజెక్టు కోసం రుణాలు తీసుకున్న మ‌ధుకాన్‌…వాటిని తిరిగి చెల్లించ‌లేద‌న్న ఆరోప‌ణ‌ల‌పై 2002లో ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులోనే కంపెనీతో పాటు కంపెనీ డైరెక్ట‌ర్లు, ప్ర‌మోట‌ర్ల‌కు చెందిన రూ.96.21 కోట్ల విలువ చేసే ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్‌ సంస్థల 105 స్థిర, చరాస్తులను జప్తు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ కేసులో ఆస్తులను జప్తు చేశారు. హైదరాబాద్‌, విశాఖ, బెంగాల్‌లో కూడా రూ.88.85 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

గ‌తంలో టీడీపీలో కొన‌సాగిన నామా నాగేశ్వర‌రావు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీఆర్ఎస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం లోక్ స‌భ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చిన య‌శ్వంత్ సిన్హాకు బేగంపేట ఎయిర్ పోర్టులో సీఎం కేసీఆర్‌తో క‌లిసి స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం జ‌ల విహార్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలోనూ ఆయ‌న పాలుపంచుకున్నారు. ఈ స‌మావేశంలో ఉన్న స‌మ‌యంలోనే నామా సంస్థ‌ల‌పై ఈడీ కొర‌డా ఝుళిపించడం గ‌మనార్హం.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈడీ సమన్లు జారీ చేస్తోంది. ఇటీవల మహారాష్ట్ర ఎంపీ సంజయ్‌ రౌత్‌కు సైతం ఈడీ నోటీసులు జారీచేసింది. బీజేపీ రెబల్‌ ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి శివసేన పార్టీని నామరూపం లేకుండా చేయాలని చూస్తున్నారని, అది కలలో కూడా జరగదని సంజయ్‌ రౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఈడీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మలా మారిందన్నారు. దీంతో ఆయనకు సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో పాలిటిక్స్‌, ఇవాళ జరిగిన పరిణామాల వల్ల ఈడీ నామాకు షాక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.