టిఆర్ఎస్ ఎంపీ ఆఫీసులో ఈడీ దాడులు

ED అధికారులు టిఆర్ఎస్ నేతలను టార్గెట్ గా పెట్టుకున్నారా..ప్రస్తుతం ఇదే చర్చ తెలంగాణ వ్యాప్తంగా నడుస్తుంది. బుధువారం టిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన ఆఫీస్ లలో , ఇళ్లలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు , నేడు టీఆర్ఎస్‌ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో ఈడీ, ఐటి అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలోని ఆఫీస్‌తో పాటు కరీంనగర్‌ కార్యాలయంలోనూ తనిఖీలు చేపట్టారు. ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నేతల్లో కలవరం మెుదలైంది. నిన్న కరీంనగర్‌లో ఉన్న గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్, మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో తనిఖీలు జరిగాయి. అలాగే పలు మైనింగ్ వ్యవహారాలపై పలుచోట్ల గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు.. 40 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. గ్రానైట్ కంపెనీలతో పాటు గ్రానైట్ కంపెనీల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు.

ఈడీ రైడ్స్ సంబంధించి ఐటీ, ఈడీ సంస్థ‌ల ద‌ర్యాప్తున‌కు సంపూర్ణ స‌హ‌కారం అందిస్తాన‌ని గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. నిజ‌నిజాలు తేల్చాల్సిన బాధ్య‌త ద‌ర్యాప్తు సంస్థ‌ల‌దే అని మంత్రి పేర్కొన్నారు. తాను విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు ఈడీ అధికారుల‌కు ఇంటి తాళాలు తీయ‌మ‌ని చెప్పింది తానే అని తెలిపారు. ఇంట్లోని ప్ర‌తి లాక‌ర్‌ను ఓపెన్ చేసి చూసుకోమ‌ని చెప్పానన్నారు. సోదాల్లో ఎంత క్యాష్ దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో దర్యాప్తు అధికారులే చెప్పాలన్నారు. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివని చెప్పారు. బయటి దేశాల నుంచి డబ్బులు హవాలా మార్గంలో తెచ్చామా అనేది ఈడీ.. డబ్బులు అక్రమంగా నిల్వ ఉంచామా అనేది ఐటీ విభాగం చూస్తోందన్నారు. వీటికి సంబంధించి తమ సంస్థల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మంత్రి గంగుల తేల్చి చెప్పారు.