కవిత విషయంలో ఈడీ పరిధికి మించి వ్యవహరిస్తోందిః జగదీశ్ రెడ్డి
బిజెపి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపాటు

హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ పరిధికి మించి వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. చట్ట ప్రకారం విచారణ జరగడం లేదని విమర్శించారు. ఒక మహిళను రాత్రి వరకు విచారించడమంటే వేధించడమేనని చెప్పారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని అన్నారు. బిజెపి నేతల ఆలోచనల ఆధారంగానే ఈడీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ సంస్థలకు దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వేధిస్తోందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గాలు పెరిగిపోయాయని చెప్పారు. కవిత ఎక్కడకీ పారిపోదని, విచారణకు సహకరిస్తానని ఆమె చెప్పినా కూడా రాత్రి వరకు విచారించడం సరికాదని అన్నారు. మహిళలను గౌరవించడం మానేసి, చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని వేధింపులకు గురి చేస్తున్న బిజెపిని ప్రజల్లో ఎండగడతామని, దేశాన్ని కాపాడతామని చెప్పారు.