పూరి , ఛార్మీలను 13 గంటలపాటు విచారించిన ఈడీ

లైగర్ సినిమా పెట్టుబడి విషయంలో చిత్ర దర్శక , నిర్మాతలైన డైరెక్టర్ పూరి జగన్నాధ్ , నిర్మాత ఛార్మి లను ఈడీ అధికారులు దాదాపు 13 గంటల పాటు విచారించినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ టైం ఏమాత్రం బాగాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ కావడం, డిస్ట్రబ్యూటర్స్ డబ్బుల కోసం బెదిరించడం..ఇవే అనుకుంటే ఇప్పుడు ఈడీ సైతం పూరి , ఛార్మీల ఫై పడ్డారు. చిత్ర నిర్మాతలుగా ఛార్మి, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మాత్రమే వ్యవహరించినట్టు బయటకు చెబుతున్నా.. దీని వెనుక చాలామంది ఉన్నారని… విదేశీ పెట్టుబడులు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి , నిర్మాత ఛార్మిను ఈడి విచారించింది. దాదాపు 13 గంటల పాటు సాగిన ఈ విచారణ లో పలు ఆసక్తికర విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. స్థానిక పెట్టుబడుల పైన కూడా ఆరా తీసింది.. అయితే కొందరు తమ బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చుకునేందుకు హవాలా, మనీ ల్యాండరింగ్ రూపంలో పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తుంది. అంతేకాకుండా వీరిద్దరి ఖాతాలో అధిక మొత్తంలో విదేశీ డబ్బు జమ అయినట్టు కూడా తెలుస్తోంది. మరి ఇంకా ఏ ఏ విషయాలు బయటపడ్డాయో అధికారికంగా తెలియాల్సి ఉంది.