నేడు ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్ గ్యాంగ్

క్యాసినో , మనీ లాండరింగ్ కేసులో ఈరోజు ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్ గ్యాంగ్ హాజరుకాబోతున్నారు. ఇప్పటికే ప్రవీణ్‌, మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు… ల్యాప్‌టాప్‌లు, ఇతరదస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించి, వారిని విదేశాల్లో క్యాసినో ఆడించి లాటరీ డబ్బులను పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. విదేశాల్లో క్యాసినో పై ఈడీ అధికారులు వీరిని ప్రశ్నించనున్నారు. ఇద్దరు నిర్వాహకులు సహా నలుగురు హవాలా బ్రోకర్స్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రవీణ్, మాధవరెడ్డిలకు హవాల రూపంలో సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ అనే నలుగురు ఏజెంట్లు నగదు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేది ప్రధాన అభియోగం. అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్‌ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకుని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ప్రవీణ్‌తో పాటు అతడి అనుచరుడు దాసరి మాధవరెడ్డి బ్యాంకు లావాదేవీల గురించి ఈడీ ఆరా తీసింది. దీనికితోడు వారి పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలనూ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. మరోవైపు చీకోటి ప్రవీణ్ తన పుట్టిన రోజు వేడుకలు.. బోనాలు, వినాయకచవితి పండుగల సందర్భంగా పెద్దఎత్తున చేసిన వ్యయాలనూ లెక్కగడుతోంది. వీటన్నింటినీ క్రోడీకరించుకొన్న సమాచారం ఆధారంగా ప్రవీణ్‌ను సోమవారం విచారించనుంది. ఈనేపథ్యంలో హవాలా లావాదేవీల్లో రాజకీయ, సినీ ప్రముఖుల పాత్ర ఎంత ఉందనేది కూడా తెలియబోతుంది.