నేడు విచారణకు హాజరుకాలేను..కవిత..అభ్యర్థనను తిరస్కరించిన ఈడీ

విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పిన అధికారులు

ed-denies-mlc-kavitha-request-to-skip-questioning

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ చేసిన అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. విచారణకు కచ్చితంగా హాజరు కావాలని అధికారులు తేల్చి చెప్పడంతో కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరినట్టు తెలిసింది. అంతకుమునుపు.. ఆనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ కవిత తన న్యాయవాది సోమభరత్‌ కుమార్‌తో ఈడీకి సమాచారం పింపించారు. విచారణకు మరో రోజును నిర్ణయించాలని అభ్యర్థించారు. మరి కాసేపట్లో కవిత విచారణకు హాజరువుతారని అంతా అనుకుంటుండగా ఆమె తరపు న్యాయవాది సోమాభరత్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమవడం సంచలనం కలిగించింది. ఈడీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ పెరిగింది. అయితే.. ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనను ఈడీ అధికారులు విచారించారు.

ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఢిల్లీ నేత మనీశ్ సిసోడియా, పిళ్లై, బుచ్చిబాబుల కస్టడీ ఒకటి రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితతో సహా నిందితులందరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించాలని ఈడీ తలచినట్టు చెబుతున్నారు. అయితే.. వీరి కస్టడీ ముగిశాకే విచారణకు హాజరుకావాలని కవిత భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కవిత అభ్యర్థనను ఈడీ తిరస్కరించడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.