అమెరికాలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం

త్రివర్ణ పతకాలు చేబూని స్వాగతం పలికిన ఎన్నారైలు

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అగ్రరాజ్యం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ విమానాశ్రయంలో మోడీ కి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్ సింగ్ సందు, అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్​, ఎయిర్ కమాండర్ అంజన్ భద్ర, నౌకాదళ కమాండర్ నిర్భయా బప్నా విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఐక్యరాజ్య సమితి సమావేశం, క్వాడ్ సదస్సులో పాల్గొంటారు.

అలాగే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తోనూ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఇంకా, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిణామాలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపైనా చర్చిస్తారు. పర్యటన ముగించుకుని ఈ నెల 26న తిరిగి స్వదేశానికి వస్తారు.

కాగా, ప్రవాస భారతీయులు విమానాశ్రయం వద్ద త్రివర్ణ పతాకాన్ని చేపట్టుకుని ప్రధాని మోడీ కి ఆహ్వానం పలికారు. వంద మందికిపైగా ప్రవాసులు ఎయిర్‌పోర్టుకి వచ్చారు. తన కోసం వేచిఉన్నవారిని కలిసిన మోడీ .. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘వాషింగ్టన్‌లో నాకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు కృతజ్ఞతలు. మన ప్రవాసులే మనకు బలం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయం’ అని ప్రధాని మోడీ అన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/