టర్కీ లో భూకంపం : 640 కు చేరిన మృతుల సంఖ్య

టర్కీ లో నిమిషాల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 640 కి చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెపుతున్నారు. సోమవారం తెల్లవారుజామున సిరియా సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదయ్యింది. అనంతరం 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. గజియాన్‌టెప్ ప్రావిన్సుల్లోని నుర్దగి నగరానికి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. 17.9 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అలాగే, నిమిషాల వ్యవధిలోనే మధ్య టర్కీలో 9.9 కిలోమీటర్ల లోతులో రెండో భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే వివరించింది.

ఈ రెండు చోట్ల నిమిషాల వ్యవధిలో భూకంపాలు చోటుచేసుకోవడం తో వేలాది మంది కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో 240 మందికిపైగా, రెబల్స్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో 120 మందికి పైగా చనిపోయారు. ఇక టర్కీలో 284 మందికి పైగా మ‌ృతి చెందారు. గంటలు గడిచే కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

భూకంపం దెబ్బకి పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. కొన్ని చోట్ల పూర్తిగా నేలమట్టమయ్యాయి. రెండు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చలికాలం కావడంతో రోడ్లన్నీ మంచుతో కప్పుకుని ఉన్నాయి. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది.