విశాఖ నగరంలో భూ ప్రకంపనలు

ten-new-beaches-between-vizag-rushikonda-and-bhogapuram

విశాఖ నగరవాసులను భూ ప్రకంపనలు భయాందోళనకు గురి చేసాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో 7.15 గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో భూమి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అక్కయ్యపాలెం, మధురానగర్‌, తాటిచెట్లపాలెం, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, అల్లిపురం, రైల్వేస్టేషన్‌, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో పలు చోట్ల అపార్ట్‌మెంట్ భవనాలకు పెచ్చులూడిపడ్డాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.

భారీ శబ్దం వచ్చిన తర్వాత భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో 1997 నాటి హెచ్‌పీసీఎల్ దుర్ఘటన విశాఖవాసుల కళ్లముందు కదలాడింది. గోపాలపట్నం, సింహాచలం, అడవివరంలోనూ భూమి కంపించింది. దీనిపై భూభౌతిక శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రకటన చేయలేదు. గతానికి భిన్నంగా బాంబు పేలిన శబ్దం వినబడిన తర్వాత భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ ఏం జరిగిందో అంటూ పరుగులు తీశారు. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.