అట్టహాసంగా నిర్మాత దానయ్య కుమారుడి వివాహం

RRR నిర్మాత DVV దానయ్య కుమారుడు కల్యాణ్ వివాహం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు యావత్ చిత్రసీమ కదిలివచ్చింది. బంధుమిత్రులు ఆశీర్వాదాలు, వేద పండితులు మంత్రాల నడుమ సమత మెడలో మూడు ముళ్లు వేశాడు. టాలీవుడ్ టాప్ నిర్మాతగా కొనసాగుతున్న దానయ్య ఎంతోమంది స్టార్ హీరోలతో బడా చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా రాజమౌళి, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.

హైదరాబాద్ లో జరిగిన కుమారుడి పెళ్లి వేడుకలో పలువురు టాలీవుడ్ దిగ్గజాలు పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కల్యాణ్-సమత వివాహ వేడుకకు హాజరైన వారిలో హీరోలు రామ్‌ చరణ్‌, పవన్‌ కల్యాణ్‌, డైరెక్టర్లు త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ నీల్‌, రాజమౌళితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. నిర్మాత దానయ్య వచ్చిన అతిథులను దగ్గరుండి ఆహ్వానించారు. పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళ్లి వారితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.