ఇంద్రకీలాద్రి ఫై పది రోజులు పాటు దసరా ఉత్సవాలు

దసరా సందర్బంగా ఇంద్రకీలాద్రి ఫై పది రోజులు పాటు దసరా ఉత్సవాలు జరపనున్నట్లు దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. ఈ పది రోజులు పది అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి జగన్ అమ్మవారిని దర్శించుకుంటారన్నారు.

దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయినట్లు, ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయన్నారు. ఈ ఏడాది రూ. 80 లక్షలతో ప్రత్యేకంగా విద్యుద్ధీకరణ చేపడుతున్నామన్నారు. భక్తుల కోసం చండిహోమం, శ్రీ చక్ర నామార్చన, కుంకుమార్చనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కుంకుమార్చనలో పాల్గొనే వారి కోసం 20 వేల టికెట్లు ఆన్ లైన్ లో ఉంచామన్నారు. గతంలో మాదిరిగానే నగరోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. భవానీ భక్తులు దర్శనాలకు మాత్రమే రావాలని.. మాల వితరణకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవని స్పష్టం చేసారు.

ఇక ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు రూ. 100, రూ. 300, ఉచిత దర్శనాలతో పాటు.. వీఐపీ బ్రేక్ దర్శనం ప్రతిపాదనలపై వచ్చే సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాటర్ ప్యాకెట్స్ బదులు ఆర్వో వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 6+1 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు.. తిరుపతి మాదిరి నాణ్యత కలిగిన లడ్డూ ప్రసాదం అందిస్తామన్నారు. మొత్తం 21 లక్షల లడ్డూలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.