హక్కులపై ద్వంద్వ ప్రమాణాలు విడనాడాలి

నిర్దిష్టమైన కార్యాచరణ అవశ్యం

Human Rights
Human Rights

తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, తమను ఎదురించిన దేశాలపై ఏకపక్షంగా దాడులకు తెగబడితే కిమ్మనని వారంతా కాశ్మీర్‌ విషయంలో గగ్గోలు పెట్టడం వారి పక్షపాత వైఖరికి నిదర్శనం.

ఇరాక్‌పైన, ఆప్ఘన్‌పైన అమెరికా మాదిరిగా మనం కూడా మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిస్తూ, ఉగ్రవాదులకు, ఆర్థిక, ఆయుధ సహాయమందిస్తున్న పాకిస్థాన్‌పై భారతదేశం దాడి చేస్తే అదే వైఖరి అవలంభిస్తారా?ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విషయంలో అన్నిదేశాలకు ఒకే సూత్రం వర్తింపచేయాలి.

అమాయకులను ఊచకోత కోసిన వారిని శిక్షిస్తే దానికి మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో హడావిడి చేయడం మానుకోవాలి. నిజమైన మానవ హక్కుల పరిరక్షణకు ప్రపంచమంతా పాటుపడాలి. మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధి, దృఢసంకల్పం, నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం.

ప్ర పంచంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో ప్రశాంతంగా బతకగలగాలి. స్వేచ్ఛలేని జీవితం ముళ్లతో నిండిన రహదారి లాంటిది. క్రూరమృగాలు సంచ రించే కీకారణ్యం లాంటిది. అడవిలో సంచరించే జంతువ్ఞలు అమాయక ప్రాణులను చంపి తింటాయి.సాధు జంతువ్ఞలు తారసపడినా అదే గతి. జంతువ్ఞలకు విచక్షణ తెలియదు. అవి బుద్ధిజీవులు కావు.

కాని మేథస్సు వికసించిన మానవులు కూడా యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి సాటి మానవ్ఞలజీవితాన్ని నరక ప్రాయం చేసి, తమ ఆధిపత్యాన్ని చెలాయించడం అత్యంత దారుణం. మనిషిని మనిషే పీడించుకుతినే సంస్కృతి మానవ సమాజంలో నెలకొనడం మానవత్వానికే మాయనిమచ్చ.

ఉగ్రవాదం పేరుతోనో సామ్రాజ్యకాంక్షతోనో, ఆధిపత్యం పేరుతోనో సాగే మానవ హింస. ఆధునిక సమాజానికి ఒక శాపం. హింస ఏ రూపంలో ఉన్నా అది క్షమార్హం కాదు. అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, బానిసత్వం ఇవన్నీ మానవ జీవితాలను అతలాకుతలం చేసే పైశాచిక చర్యలే. అక్షరజ్ఞానం లేని రోజుల్లో అజ్ఞానంతో అలమటించే అమాయక ప్రజలపై ఆధిపత్యం చెలా యించి,శతాబ్దాల తరబడి నియంతృత్వం చెలాయించి మనుషు లను పురుగుల కంటే హీనంగా చూసేవారు.

వారిని స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు దూరం చేసి ఎదురుతిరిగే వారిని అణగద్రొక్కే వారు.ఆధునిక యుగంలో కూడా వివిధ రూపాల్లో హింసాకాండ కొనసాగడం సిగ్గుచేటు. హింస ఏ రూపంలో సాగినా క్షమార్హం కాదు.మానవ జీవితం సకల ప్రాణుల్లో ఉన్నతమైనది. అలాంటి జీవితాన్ని హేయమైన ఆంక్షలతో, భయాలతో అణచివేయడం, భావ స్వాతంత్య్రాన్ని చెరిపేసి, బానిసత్వంతో పరుల పాదాల కింద బతికే దారుణమైన స్థితిని కలిగించడం అమానుషత్వం.

గతంలో ఎంతో మంది నియంతలు ప్రజల హక్కులను హరించి వేధించుకుతినేవారు.చంఘీజ్‌ఖాన్‌, హిట్లర్‌, ముస్సోలినీ, ఫ్రాన్సి స్కో, ఫ్రాంకో, రొమేనియన్‌ నియంత నికోలే సియుస్కే ఇలా ఎంతోమంది నియంతలు ప్రపంచం నలుమూలల తమ అధికా రం చెలాయించారు.ఎంతోమంది క్రూర నియంతలుకాలగర్భంలో కలిసిపోయారు. వీరి నియంతృత్వంలో లక్షలాది మంది అమా యకులు ఊచకోతకోయబడ్డారు. తమకు ఎదురుతిరిగిన వారిని దారుణంగా హింసించి, చంపి పైశాచికానందం పొందారు.

ఆ రోజుల్లో ప్రజలు కట్టుబానిసలుగా జీవించేవారు. వారికిఎలాంటి హక్కులు ఉండేవికావ్ఞ. పుట్టినందుకు చచ్చినట్టు బతకవలసి వచ్చేది. ప్రజలను కీలు బొమ్మలుగా చేసి ఎన్నో రకాలుగా హిం సించి ఆటాడించే నియంతలు చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తులుగా నిలిచిపోయారు. అలాంటి నియంతలకు వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు రావడం, ప్రజాస్వామ్యభావన వెల్లువెత్తడం జరిగింది.

మానవ హక్కులను గుర్తించి, గౌరవించే ప్రక్రియ ప్రపంచమంతా ప్రారంభమైనది. ఎన్నో రకాల హింసాత్మక చర్యల నుండి కాపాడుకోవడానికి స్వేచ్ఛగా జీవించడానికి ప్రజ లెన్నో పోరాటాలు చేశారు.ప్రజాస్వామ్యాన్ని పోరాడి సాధించుకు న్నారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవించడానికి అనేక హక్కులు సాధించుకున్నారు. కొన్ని దేశాల్లో ఇంకా ప్రజాస్వామ్యం ఏర్పడ లేదు.

కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశత్వం యధేచ్ఛగా కొనసాగుతున్నది. ప్రతీవ్యక్తి స్వేచ్ఛగా జీవించడానికి, పరపీడన హింస లేని ప్రశాంత జీవనానికి కొన్ని హక్కులు అవ సరం. వీటినే మానవ హక్కులు అని స్థూలంగా నిర్వచించ వచ్చు. ఐ.రా.స మానవ హక్కుల విషయంలో అగ్రరాజ్యాల విషయంలో ఒక విధంగా, ఇతర దేశాల విషయంలో మరొక విధంగా ప్రవర్తించడం సంస్థ డొల్లతనాన్ని తెలియచేస్తున్నది.

కొన్ని దేశాలు ఉగ్రవాదం వలన తీవ్రంగా నష్టపోతున్నా ఉగ్ర వాదులు అమాయకులను అత్యంత పాశవికంగా అంతమొం దిస్తున్నా ఐ.రా.స స్పందన పేలవంగా ఉంటున్నది. అమాయక ప్రజల రక్తతర్పణంతో పైశాచికానందం పొందుతూ ఉగ్రవాదు లకు మద్దతునిచ్చే దేశాలను నిలువరించడంలో ఐ.రా.స పూర్తిగా విఫలమైంది.

సీమాంతర ఉగ్రవాదంతో భారతదేశాన్ని దశాబ్దాల తరబడి పీడించుకుతింటున్న పాకిస్థాన్‌ విషయంలో ప్రపంచ మానవ హక్కుల సంఘాలు, ఐక్యరాజ్యసమితి నిర్లిప్తత వహిం చడం క్షంతవ్యం కాదు. భారతదేశానికి అన్ని అవకాశాలున్నా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం విడ్డూరం. అగ్రదేశాల నిధులపై ఆధారపడి మనుగడ సాగించినంత కాలం మానవ హక్కుల విషయంలో ఐ.రా.స చర్యలు సత్ఫలితాలనివ్వబోవు.

పేద, వర్ధమాన దేశాలకు న్యాయం జరగబోదు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో అన్ని దేశాలకు సమా నమైన నియమ నిబంధనలు వర్తింపచేయాలి. అమెరికా, చైనా, పాకిస్థాన్‌, విషయంలో ఒక మాదిరిగా, ఆప్ఘనిస్థాన్‌, సిరియా విషయంలో ఒక రకంగా, ఇరాక్‌ విషయంలో ఒక రకంగా, ఉత్తరకొరియా విషయంలో మరో రకంగా మానవ హక్కుల సంఘాలు పరస్పర విరుద్ధమైన న్యాయసూత్రాలను అన్వయించడం సబబుకాదు.

మత ప్రాతిపదికన ఏర్పడిన పలు దేశాల ప్రభు త్వాలు అక్కడ ప్రజల హక్కులను హరిస్తున్నాయి. స్త్రీలను పలు రకాల ఆంక్షలతో నిర్బంధాలకు గురిచేస్తున్నాయి. లింగవివక్షత పేరుతో ఆడపిల్లల హక్కులను హరించడం వారిని విద్యకు దూరం చేయడం, నాలుగు గోడల మధ్య బంధీలుగా చేయడం వంటి అమానవీయ ధోరణులపై ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలన్నీ స్పందించాలి.

అమెరికా వరల్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడికి సూత్రధారి ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టడంలోను, ఆప్ఘన్‌ లో గతంలో తాలిబాన్లను తరిమేసి, హమీద్‌ ని గద్దె నెక్కించడంలోను, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌, లిబియాలో గడాఫీని అంతమొందించడంలో సహకరించిన ప్రపంచదేశాలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్థాన్‌ విషయంలోను, పాక్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ భారత్‌పై దాడు లకు దిగుతున్న చైనాను కట్టడి చేయడంలో విఫలమవుతున్నాయి.

కసాయి హంతకులు కసబ్‌, అఫ్జల్‌గురు, మెమన్లను ఉరితీస్తే రెచ్చిపోయిన వారంతా అగ్రరాజ్యాల్లోను, నియంతల పాలనలోను, మత చాంధస వాదుల పాలనలోను మానవ హక్కులను కాలరాస్తుంటే కిమ్మనకుండా నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తించడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.

దావూద్‌ ఇబ్రహీం, మౌలానా మసూద్‌ అజహర్‌ లాంటి వారిని భారత్‌కు అప్పగించడంలో వెనకడుగు వేయడం దేనికి సూచన? అత్యంత కిరాతకంగా హత్యచేసిన ముష్కరమూకను ఉరితీస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనా? అమాయకులను శిరచ్ఛేదం చేసి, వారి అవయవాలను వేరుచేసి, ఊరేగించడం మానవ హక్కుల ఉల్లం ఘన కాదా?

9/11గా పిలవబడే అమెరికా వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌పై దాడుల పట్ల ఒకరకంగా, 26/11 ముంబై దాడుల పట్ల మరో రకంగా ప్రవర్తించిన ప్రపంచ మానవ హక్కుల సంఘాలు ఐక్య రాజ్యసమితి తమ ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలి. తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, తమను ఎదురించిన దేశాలపై ఏకపక్షంగా దాడులకు తెగబడితే కిమ్మనని వారంతా కాశ్మీర్‌ విషయంలో గగ్గోలు పెట్టడం వారి పక్షపాత వైఖరికి నిదర్శనం.

ఇరాక్‌పైన, ఆప్ఘన్‌పైన అమెరికా మాదిరిగా మనం కూడా మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిస్తూ,ఉగ్రవాదులకు,ఆర్థిక, ఆయుధ సహాయమందిస్తున్న పాకిస్థాన్‌పై భారతదేశం దాడి చేస్తే అదే వైఖరి అవలంభిస్తారా?

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విష యంలో అన్నిదేశాలకు ఒకే సూత్రం వర్తింపచేయాలి. అమాయ కులను ఊచకోత కోసిన వారిని శిక్షిస్తే దానికి మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో హడావిడి చేయడం మానుకోవాలి. నిజమైన మానవ హక్కుల పరిరక్షణకు ప్రపంచమంతా పాటుపడాలి.

మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధి, దృఢసంకల్పం, నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/