స్కూల్‌ అసిస్టెంట్‌ నియామకాల్లో అవకతవకలు!

రిజర్వేషన్‌ అభ్యర్థులకు అన్యాయం

DSC- candidates-File
DSC- candidates-File

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2018 డిఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌ నియామకాలలో రిజర్వేషన్‌ అమలు సరిగ్గా జరగలేదు.

ఒసిలతో సమానంగా అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించి ఓపెన్‌ కేటగిరి (ఓపెన్‌ కాంపిటషన్‌) నియమించాల్సిన బీసి అభ్యర్థులను ఓపెన్‌ కేటగిరిలో కాకుండా రిజర్వేషన్‌ కోటాలో కేటాయించడం వలన డిఎస్సీ 2018 స్కూల్‌ అసిస్టెంట్‌ నియామకాల్లో రిజర్వేషన్‌ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు.

ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు నియామకాల్లో జిల్లా రెండో ర్యాంకర్‌ బిసి-బి కేటగిరికి చెందిన అభ్యర్థి. ఈ అభ్యర్థికి వాస్తవంగా ఓపెన్‌ కేటగిరిలోనే పోస్ట్‌ కేటాయించాలి.

కానీ బిసి-బి జనరల్‌ కోటాలో ఇవ్వడం వలన బిసి-బి జనరల్‌లో అవకాశం వచ్చే మరొక రిజర్వేషన్‌ అభ్యర్థి ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయారు.

ఆ జిల్లాలోని స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు నియామకాల రోస్ట రును పరిశీలిస్తే ఓపెన్‌ కేటగిరిలో 4, ఓపెన్‌ కేటగిరి 3, బిసి-బి జనరల్‌లో 2, బిసి-బి ఉమెన్‌లో జీరోగా కేటాయింపులు చేశారు.

1,5,7 ర్యాంకర్లు ఓసి- ఉమెన్‌ కేటగిరిలో,రెండవ ర్యాంకర్‌ బిసిబి జనరల్‌లోనూ, 3,4,8 ర్యాంకర్లను ఓపెన్‌ కేటగిరి జనరల్‌లో భర్తీ చేశారు.

రెండవ ర్యాంకర్‌ను ఓపెన్‌ కేటగిరి జనరల్‌లో భర్తీ చేయకుండా ఎనిమిదవ ర్యాంకర్‌ ఓసి కమ్యూనిటికీ చెందిన అభ్యర్థిని ఓపెన్‌లో కేటాయించారు.

ఇలా చేయడం వలన ఒక బిసి అభ్యర్థి ఉద్యోగం కోల్పోవడం జరిగింది.

ఇదేవిధంగా ప్రకాశం జిల్లాలో సోషల్‌, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంగ్లీషు, శ్రీకాకుళం జిల్లాలో గణితం, కృష్ణాలో సోషల్‌, చిత్తూరులో సోషల్‌, నెల్లూరులో కూడా ఇదేతరహాలో నియామకాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇలా అనేక చోట్ల రిజర్వేషన్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఇలా జరిగిన వాళ్లల్లో కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉన్నారు.

ఈ నియామకాల్లో బిసి అభ్యర్థులే అధిక సంఖ్యలో పోస్టులను కోల్పోవలసి వస్తున్నది. ఈ అవకతవకలకు గురించి అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం జరగలేదు.

అన్‌రిజర్వ్డ్‌ కేటగిరి పోస్టులు అంటే అవి ఒసి పోస్టులని, ఇతర కులాల వారికి చెందినవని ఇప్పటికీ అధికారుల్లో ఒక దురాభిప్రాయం ఉంది.

నిజానికి ఒసి అంటే ఓపెన్‌ కాంపిటిషన్‌ఇందులో మెరిట్‌ ఆధారంగా అన్నీవర్గాలు ఎస్సీ,ఎస్టీ, బిసి అభ్యర్థులు ఓసి అభ్యర్థులతో సమానంగా పోటీపడతారు.

కాబట్టి పోస్టుల భర్తీలో మెరిట్‌ కం రిజర్వేషన్‌ పాటించవలసి ఉంటుంది. అలా పాటించకుండా నియామకాలు చేపట్టడం వల్ల రిజర్వేషన్‌ అభ్యర్థులు తమకు రావాల్సిన ఉద్యోగాలను కోల్పోతున్నారు.

కాబట్టి ప్రభుత్వం మరోసారి డిఎస్సీ 2018 స్కూల్‌ అసిస్టెంట్‌ నియామకాలను రిజర్వేషన్లు వారీగా సరిచేసి రీ-ఆర్గనైజ్‌ చేయించాలి.

  • వి.సురేష్‌

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/