డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన త‌రుణ్‌

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన న‌గ‌దు లావాదేవీల‌పై విచార‌ణ‌

హైదరాబాద్ : టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన న‌గ‌దు లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు సినీ హీరో త‌రుణ్‌ను విచారిస్తున్నారు. త‌రుణ్ న‌మూనాల్లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు లేవ‌ని ఇప్ప‌టికే ఎఫ్ఎస్ఎల్ నివేదిక‌లో స్ప‌ష్ట‌మైంది. నివేదిక ప్ర‌కారం ఇప్ప‌టికే ఆయ‌న‌కు క్లీన్ చీట్ ఇచ్చారు. అయితే, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌నీలాండ‌రింగ్ కేసులో త‌రుణ్‌ను అధికారులు విచారిస్తున్నారు.

ఈ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులను విచారించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో నోటీసులు అందుకున్న నేప‌థ్యంలో త‌రుణ్‌ హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యంలో అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌రయ్యాడు. ఆయ‌న‌కు సంబంధించిన‌ బ్యాంకు ఖాతాల‌ను అధికారులు ప‌రిశీలిస్తున్నారు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఆయ‌న‌కు ఉన్న‌ సంబంధాలపై విచారిస్తున్నారు. డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/