మందుల కుంభకోణం.. అక్రమాలకు పరాకాష్ఠ!

మందుల కుంభకోణం.. అక్రమాలకు పరాకాష్ఠ!
Drug Scam

ఊదురు గొట్టడం వాడు ఊదుతూఉంటే చల్లార్పుడు గొట్టడం వాడు చల్లార్చుతు న్నట్టుగా ఉంది. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించివేస్తాం, ఎంతటివారినైనా వదిలిపెట్టం, అవినీతితో ఇక రాజీలేని పోరాటమని అటు కేంద్ర పాలకులు,ఇటురాష్ట్ర పాలకులు పదేపదే హెచ్చరికలు చేస్తున్నా అవేమి పట్టించుకోకుండా కొందరు అధికారుల అవినీతి పరాకాష్ఠకు చేరుకుంటున్నది.

తాజాగా గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులు రాష్ట్ర కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) ఉన్నతాధికారుల ఉద్యోగులపై జరిపిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.సాక్షాత్తు ఈఎస్‌ఐ పర్యవేక్షణ,కేటాయింపులు, పంపిణీల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిర్వహించాల్సిన ముఖ్యమైన అధికారులే ఇందులో పాత్రధారులు కావడంతో అవినీతి ఏ స్థాయిలో ఆ సంస్థలో పాతుకుపోయిందో చెప్పకనే చెబుతున్నది.

ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం పది, పదిహేను కోట్ల రూపాయల వరకు అక్రమంగా అధికారులు భోంచేసి నట్లు తెలుస్తున్నది. గత రెండు రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. రోగులకు పంపిణీ చేయాల్సిన మందుల కొనుగోళ్లలో భారీఎత్తున అవకతవకలు జరిగినట్లు ఎసిబి అధికారులు కనుగొన్నారు.

అవినీతి నిరోధక చట్టం భారతీయశిక్షాస్మృతి కిందకేసులు నమోదు చేసినట్లు ఎసిబి డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచంద్రరావ్ఞ గురువారం అధికారికంగా ప్రకటన విడు దలచేశారు.శుక్రవారం ఇందుకు సంబంధించి ఉన్నతాధికా రులతోసహా ఏడుగురిని అరెస్టు చేశారు. న్యాయస్థానం ముందు హాజరుపరచగా వారిని వచ్చేనెల 11వరకు రిమాండ్‌కు పంపారు. ఈ మందుల కుంభకోణం ఇప్పటికిప్పుడు ప్రారంభమైందని కాదని తెలుస్తున్నది. ఎంతో కాలంగా జరుగుతున్నా,అప్పు డప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నా పట్టించుకున్న నాధుడేలేరని చెప్పొచ్చు.

ఈఎస్‌ఐ సరఫరా చేసే మందులపై సంస్థ ముద్ర విధిగా ఉండాలి. కానీ ఒక వ్యూహం ప్రకారం ముద్రలేని మందులు కొని బహిరంగమార్కెట్లో ఇష్టానుసారంగా అమ్ముకు న్నారు.అసలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నఈఎస్‌ఐ ఆస్పత్రులు వైద్యుల పేరుపై బోగస్‌ ఇండెంట్లు తయారు చేసి మందులు సరఫరా చేసినట్లు లక్షలాది రూపాయలు తమ జేబుల్లో వేసుకున్నారు. పటాన్‌చెరువ్ఞ, బోరబండ ఆస్పత్రులకు చెందిన వైద్యుల పేరుతో 2018లో మే 26, 28 తేదీల్లో ఒక కోటిమూడు లక్షల రూపాయల కుపైగా వ్యయంతో మందులు కొనుగోలు కోసం రెండు బోగస్‌ ఇండెంట్లు తయారుచేసి నట్లుఎసిబి అధికారులు కొనుగొన్నారు.వాస్తవానికి పటాన్‌ చెరువ్ఞ బోరబండ వైద్యులు ఇలాంటి ఇండెంట్లు ఏమీ వారు ప్రతిపా దించలేదు.

అలాగే బొల్లారం బొంతపల్లి కోసం కోటి ఇరవైరెండు లక్షల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో రాసుకున్నారు. ఇన్నాళ్లుగా జరుగుతున్నా ఉన్నతాధికారులు ఏం చేశారనే ప్రశ్న ఉద యించక తప్పదు. ఇప్పుడు కూడా రేట్‌ కాంట్రాక్టర్ల విష యంలో కాంట్రాక్టర్ల మధ్య వచ్చిన వివాదమే ఈ కుంభ కోణాన్ని బయటపెట్టినట్టు చెప్పొచ్చు.

రేట్‌ కాంట్రాక్టర్లకు వీలుపడని సమయంలో పెద్దమొత్తంలో మందులు సర ఫరా చేయాలని కోరారు. అప్పటికప్పుడు సరఫరా చేయ డం సాధ్యంకాదని చెప్పడంతో ఆ సాకుచూపి నిబంధన లను అతిక్రమించి లోకల్‌ ఫార్మా కంపెనీలకు మరికొన్ని బీనామి పేర్లతో కూడా కొనుగోళ్లు ఆర్డర్లు ఇచ్చారు. దీనితో పాటు నిబంధనల ప్రకారం ఒక క్రమపద్ధతిలో ఆయా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా తమకు నచ్చి న తమ బీనామి కంపెనీలకు ఇష్టానుసారంగా చెల్లించడం తో వివాదం ఉద్యోగుల మధ్యనే తారాస్థాయికి చేరింది.

అయితే ఈ విషయంలో విజిలెన్స్‌ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ప్రాథమికంగా దర్యాప్తు చేసి నివేదికను ప్రభుత్వానికి అందించారు.ఈ ఏడాది జులైలో ప్రభుత్వం ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు అప్పగించింది. దీంతో ఎసిబి మరింత లోతుగా పరిశోధించి అవసరమైన సమాచారం సేకరించి గత రెండు రోజులుగా దాడులు నిర్వహించారు. మొత్తం కుంభకోణం వెలుగు చూసింది. ఇది ఇరవై,ముప్ఫైకోట్లకుపైగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

రోగులకు అందించాల్సిన మందుల్లో ఇంతటి ఘోరానికి ఒడిగట్టడం దురదృష్టకరం.మానవతావిలువలు మంటకలిసిపోతున్నాయి.ఇక్కడే కాదు అవినీతి విజృంభి స్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికోసం అప్పులు ఏ స్థాయిలో తెస్తున్నారో మరొకపక్క పన్నుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ధనరాసుల్లో అధికశాతం పక్కదారి పడుతున్నాయి. కష్టపడకుండా తెల్లవారే సరికి లక్ష్మీపుత్రులు కావాలనే దురాశవల్లనే ఈ దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి.

కీలకపదవ్ఞల్లో ఉన్న అధికారులు, అనధికారులు సైతం డబ్బు ఆశలో పడిమరే విషయాన్ని పట్టించుకోవడం లేదు. డబ్బు సంపాదనే ఏకైక ధ్యేయంగా పనిచేస్తున్నారు. గౌరవ మర్యాదలగూర్చి, మానవతా విలువల గూర్చి ఆలోచిం చడం లేదు. దిగజారుతున్న మానవతా విలువల పట్ల నిజాయితీపరులైన అధికారుల ఆవేదన మౌనరోదనగా మిగిలిపోతున్నది.

అంతోఇంతో నిజాయితీతో జీవనం సాగిస్తున్న అధికారులను అసమర్థులుగా పరిగణిస్తున్న దురదృష్టపు రోజులు దాపురించాయి. ఎలుకలను చూసి పిల్లి తప్పుకుంటున్నట్లు అవినీతిపరుల ముందు నితీవం తులు తలవంచుకునే నికృష్ఠపు రోజులు వచ్చాయి. ఇందుకు కొన్ని ప్రభుత్వ విధానాలు కూడా కారణమవ్ఞ తున్నాయి. ఏళ్లతరబడి కష్టపడి ఆక్రమార్జనను వెలికితీసి కేసులు పెట్టిన తర్వాత కూడా మూడోకంటికి తెలియ కుండా రాజకీయ ఒత్తిడి మేరకు ఉపసంహరిస్తున్న చర్యలుకూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.ఇప్పటికైనా పాలకులు అవినీతిపై మాటల్లోకాక చేతల్లో చూపాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/