ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖ‌లు

draupadi-murmu-nomination-as-nda-presidential-candidate

న్యూఢిల్లీ : ఎన్డీఏ కూట‌మి త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ముర్ము నామినేష‌న్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌తిపాదించారు. నామినేష‌న్ ప‌త్రాల‌ను రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు అంద‌జేశారు. నామినేష‌న్ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, గ‌డ్క‌రీ, బీజేపీ రాష్ట్రాల సీఎంలు హాజ‌ర‌య్యారు. ద్రౌప‌ది ముర్ము ఒడిశాలోని సంతాల్ గిరిజ‌న తెగకు చెందిన మ‌హిళా నేత‌. ఆమె జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా చేశారు. ద్రౌప‌ది ముర్మును రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన వెంట‌నే ఆమెకు జెడ్ ప్ల‌స్ క్యాట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు.

కాగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పోటీ చేయనుండడం తెలిసిందే. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి బీజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు పలికాయి. దీంతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా సునాయాసంగా ఎన్నిక కానున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్లు 10,86,431 కాగా, ఎన్డీయేకి 5,32,351 ఓట్లు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు 45,550 ఓట్లు, బీజేడీకి 31,686 ఓట్లు, అన్నాడీఎంకేకు 14,940 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ముర్ముకే పడనున్నాయి. చిన్న వయసులోనే (64) రాష్ట్రపతిగా ఎన్నికైన మహిళగా ముర్ము చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాదు, రాష్ట్రపతి స్థానాన్ని అలంకరించే తొలి గిరిజన మహిళ కూడా ఆమే అవుతారు.

https://twitter.com/VSReddy_MP/status/1540254280380461061

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/