రేపు రామప్ప సందర్శనకు వెళ్లనున్న రాష్ట్రపతి

draupadi-murmu-is-coming-to-visit-ramappa-tomorrow

ములుగుః రేపు ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా రామప్ప దేవాలయం చుట్టూ నిఘా ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఎలాంటి ఆటంకాలు కలుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు ప్రత్యేక హెలిప్యాడ్స్ సిద్ధం చేశారు. ఏర్పాట్లను రాష్ట్రపతి ప్రత్యేక భద్రతా సిబ్బంది, ఎన్ఎస్ జీ బృందం పర్యవేక్షించారు. ఇక ఇవాళ, రేపు సాధారణ భక్తులకు రామప్ప సందర్శనకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప టెంపుల్ విజిట్‭కు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇక రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్రపతి రామప్పలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రసాద్ స్కీం’ పైలెట్ ప్రాజెక్టును ఆమె ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీ కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామప్ప గార్డెన్ ను ముస్తాబు చేయడంతో పాటు ప్రాంగణమంతా శానిటైజ్​చేసి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు జారీ చేవారు. పోలీసులతో పాటు అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రపతి టూర్​ను సక్సెస్​చేయాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఆదేశించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/